చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఘనత | Sai Sudarshan Scripts History Becomes 1st Indian Player In IPL To Achieve This | Sakshi
Sakshi News home page

IPL: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఘనత

Published Thu, Apr 10 2025 2:23 PM | Last Updated on Thu, Apr 10 2025 3:03 PM

Sai Sudarshan Scripts History Becomes 1st Indian Player In IPL To Achieve This

Photo Courtesy: BCCI/IPL

గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌-2025 (IPL 2025)లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది పన్నెండు ఇన్నింగ్స్‌లోనే 527 పరుగులు సాధించి సత్తా చాటిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఈసారి అదే జోరును కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి 273 పరుగులు సాధించాడు.

ధనాధన్‌ దంచికొడుతూ
సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 41 బంతుల్లో 74.. అనంతరం ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీపై 36 బంతుల్లో 49 రన్స్‌ చేసిన సాయి సుదర్శన్‌ (Sai Sudharshn).. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం కేవలం ఐదు పరుగులే చేసి నిరాశ పరిచాడు. అయితే, తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మరోసారి బ్యాట్‌ ఝులిపించి.. సాయి ఫామ్‌లోకి వచ్చేశాడు.

అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 53 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ మంచి స్కోరు సాధించి జట్టు విజయానికి పునాది వేశాడు.

సరికొత్త చరిత్ర
ఇక రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో 1300 పరుగుల మార్కును దాటాడు. అంతేకాదు కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1300కు పైగా పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

కాగా 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన చెన్నై ఆటగాడు సాయి సుదర్శన్‌.. ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 1307 పరుగులు సాధించాడు. ఇక ఆది నుంచి టైటాన్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి సుదర్శన్‌ను ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు గుజరాత్‌ ఫ్రాంఛైజీ రూ. రూ. 8.50 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

ఐపీఎల్‌ చరిత్రలో 30 ఇన్నింగ్స్‌లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించిన క్రికెటర్లు
👉షాన్‌ మార్ష్‌- 1338
👉సాయి సుదర్శన్‌- 1307*
👉క్రిస్‌ గేల్‌- 1141
👉కేన్‌ విలియమ్సన్‌- 1096
👉మాథ్యూ హెడెన్‌- 1082.

తొలి ప్లేయర్‌గా మరో ఘనత
రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా సాయి సుదర్శన్‌ సాధించాడు. ఒకే వేదికపై వరుసగా ఐదు హాఫ్‌ సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో ఆర్సీబీపై 84, సీఎస్‌కేపై 103, పంజాబ్‌ కింగ్స్‌పై 74, ముంబై ఇండియన్స్‌పై 63 పరుగులు సాధించిన సాయి.. తాజాగా అదే వేదికపై రాయల్స్‌పై 82 పరుగులు స్కోరు చేశాడు.

చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement