సంజూ శాంసన్‌కు భారీ షాక్‌! | IPL 2025 GT vs RR: Sanju Samson Fined Rs 24 Lakh By BCCI, Here's Reason | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌కు భారీ షాక్‌!

Published Thu, Apr 10 2025 9:40 AM | Last Updated on Thu, Apr 10 2025 10:09 AM

IPL 2025 GT vs RR: Sanju Samson Fined Rs 24 Lakh By BCCI, Here's Reason

Photo Courtesy: BCCI/IPL

ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)కు మరో షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ పాలక మండలి అతడికి రూ. 24 లక్షల మేర జరిమానా విధించింది. అదే విధంగా.. గుజరాత్‌ టైటాన్స్‌ (GT vs RR)తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా ఫైన్‌ వేసింది.

ఎదురుదెబ్బలు
కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న సంజూ.. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ జట్టును ముందుండి నడిపించాడు.

ఈ క్రమంలో శనివారం (ఏప్రిల్‌ 5) నాటి మ్యాచ్‌ నుంచి కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ అందుబాటులోకి వచ్చాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్‌లో తొలుత పంజాబ్‌ కింగ్స్‌తో తలపడ్డ రాజస్తాన్‌..  50 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.

159 పరుగులకే
అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో ఆతిథ్య గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ మాత్రం 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్‌ బౌలర్ల దెబ్బకు సంజూ సేన 19.2 ఓవర్లలోనే ఆలౌట్‌ అయి.. 58 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

సంజూకు రూ. 24 లక్షల జరిమానా
ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున రాజస్తాన్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) పనిష్మెంట్‌ ఇచ్చింది. గతంలో రియాన్‌ పరాగ్‌ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ ఇదే తప్పిదానికి పాల్పడింది. 

అప్పుడు అతడికి రూ. 12 లక్షల ఫైన్‌ వేసిన బీసీసీఐ... రాజస్తాన్‌ మరోసారి ఇదే తప్పు పునరావృతం చేసినందున నిబంధనల ప్రకారం సంజూకు రూ. 24 లక్షల జరిమానా విధించింది.

ఇందుకు సంబంధించి.. ‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నాం.

వారికి కూడా
అదే విధంగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా తుదిజట్టులోని ప్రతి ఆటగాడు రూ. లక్షల జరిమానా కట్టాలి లేదంటే వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం మేర చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది’’ అని ఐపీఎల్‌ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం రెండే గెలిచింది.

ఐపీఎల్‌-2025: గుజరాత్‌ వర్సెస్ రాజస్తాన్‌
👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌
👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌
👉గుజరాత్‌ స్కోరు: 217/6 (20)
👉రాజస్తాన్‌ స్కోరు: 159 (19.2)
👉ఫలితం: 58 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82).

చదవండి: KKR: చేతులు జోడించి అడుగుతున్నా.. రింకూని కాస్త ముందే పంపండి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement