
నేడు రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో సొంతగడ్డపై తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. సీజన్ ఆరంభంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దాన్ని పక్కన పెట్టి తిరిగి గెలుపు బాట పట్టాలని అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి అదరగొట్టిన కరుణ్ నాయర్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోగా... డుప్లెసిస్ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది. ముంబైతో పోరులో భారీ లక్ష్యఛేదనలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించిన ఢిల్లీ కరుణ్ నాయర్ అవుటైన అనంతరం తడబడింది. ఆ లోపాలను సరిదిద్దుకొని తిరిగి సత్తాచాటాలని చూస్తోంది.
మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాయల్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో బలంగానే ఉన్నా ఆటగాళ్లు సమష్టిగా సత్తా చాటడంలో విఫలమవుతుండటంతో నిలకడ కనబర్చలేకపోతోంది. గత మ్యాచ్‌ల తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని మూడో విజయం ఖాతాలో వేసుకోవాలని రాయల్స్ చూస్తోంది.
డుప్లెసిస్ అనుమానమే...
దేశవాళీల్లో పరుగుల వరద పారించి అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... తుది జట్టులో అవకాశం దక్కించుకున్న తొలి పోరులో చెలరేగిపోయాడు. మేటి ఆటగాళ్లు సైతం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో... నాయర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
బౌల్ట్, బుమ్రా, దీపక్, సాంట్నర్, హార్దిక్ ఇలా బౌలర్ ఎవరనేది చూడకుండా భారీ షాట్లతో అలరించాడు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరోసారి అతడు ఆడటం ఖాయమే కాగా... అదే జోరు కొనసాగిస్తాడా చూడాలి. డుప్లెసిస్ ఫిట్‌నెస్‌పై సందేహాలు తొలిగిపోలేదు. మంగళవారం సాయంత్రం జట్టు ప్రాక్టీస్‌లోనూ అతడు పాల్గొనలేదు. దీంతో బుధవారం మ్యాచ్ ఆడటంపై స్పష్టత కొరవడింది.
డుప్లెసిస్ అందుబాటులో లేకపోతే అభిషేక్ పొరెల్‌తో కలిసి మెక్‌గుర్క్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మలతో మిడిలార్డర్ బలంగా ఉంది. స్టార్క్, ముకేశ్ కుమార్, మోహిత్ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు.
సామ్సన్ సత్తా చాటితేనే!
మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. అనంతరం మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. గత మ్యాచ్‌లో కష్టతరమైన పిచ్‌పై యశస్వి జైస్వాల్ సంయమనంతో అర్ధశతకం సాధించడం రాయల్స్‌కు శుభసూచకం. కెపె్టన్ సంజూ సామ్సన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు.
రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఐపీఎల్ వంటి అత్యంత పోటీ ఉండే లీగ్‌లో మెరుపులు లేకపోతే విజయాలు సాధ్యం కావు. వెస్టిండీస్ హిట్టర్ హెట్‌మైర్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ మరింత దూకుడు ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన రాయల్స్... అదే మైదానంలో ఢిల్లీతో జరగనున్న పోరులో విజయం సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్‌లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై ఎక్కువ భారం ఉండగా... లంకేయులు తీక్షణ, హసరంగ రాణించాల్సిన అవసరముంది.
తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), డు ప్లెసిస్/మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్.
రాజస్తాన్ రాయల్స్: సంజూ సామ్సన్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ.
29 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 29 సార్లు తలపడ్డాయి. 15 సార్లు రాజస్తాన్ నెగ్గగా... 14 సార్లు ఢిల్లీ గెలిచింది. రాజస్తాన్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 221 కాగా... ఢిల్లీపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 222.