
ఒత్తిడికి చిత్తయిన రాజస్తాన్ రాయల్స్
మెరిసిన స్టార్క్, రాహుల్
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు.
స్కోరు వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0.
సూపర్ ఓవర్ సాగిందిలా...
సూపర్ ఓవర్‌లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు.

ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X హైదరాబాద్
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం