కేఎల్‌ రాహుల్‌పై కోహ్లి సీరియస్‌!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్‌ | DC vs RCB: Kohli Fumes At KL Rahul Heated Exchange Reason Revealed | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్‌ కీపర్‌! వీడియో

Published Mon, Apr 28 2025 10:52 AM | Last Updated on Mon, Apr 28 2025 11:11 AM

DC vs RCB: Kohli Fumes At KL Rahul Heated Exchange Reason Revealed

Photo Courtesy: BCCI/starsports

సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్‌ సేనను వారి హోం గ్రౌండ్‌లో ఓడించి లెక్క సరిచేసింది. 

ఇక అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్‌ అయ్యింది.

కేఎల్‌ రాహుల్‌ మరోసారి
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌ (28), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (22), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్‌ రాహుల్‌ (41) ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు కూల్చగా.. జోష్‌ హాజిల్‌వుడ్‌ రెండు, కృనాల్‌ పాండ్యా- యశ్‌ దయాళ్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.

కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌
ఫిల్‌ సాల్ట్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన జేకబ్‌ బెతెల్‌ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19) ధనాధన్‌ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.

అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి - ఢిల్లీ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ను ఢిల్లీ చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్‌ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్‌ పాండ్యా ఎదుర్కొన్నాడు.

రాహుల్‌తో వాదనకు దిగిన కోహ్లి?!
అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్‌ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్‌ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్‌తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.

కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్‌, భారత మాజీ స్పిన్నర్‌ పీయూశ్‌ చావ్లా కోహ్లి- రాహుల్‌ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.

గట్టిగానే బదులిచ్చాడు
‘‘ఫీల్డింగ్‌ సెట్‌ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్‌కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్‌ కీపర్‌ రాహుల్‌ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. 

వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్‌ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్‌కాస్టర్‌ షేర్‌ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్‌ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.

ఐపీఎల్‌-2025: ఢిల్లీ వర్సెస్‌ బెంగళూరు
ఢిల్లీ స్కోరు: 162/8 (20)
ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)
ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కృనాల్‌ పాండ్యా. 

చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్‌ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement