
ఈనెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం... ఆరు వేదికల్లో మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.