ipl season
-
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సింథి కాలనీకి చెందిన పడాల మహేష్ బాబు ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ కోసం కొత్త పంథా అనుసరించాడు. తన ఎంజీ హెక్టర్ వాహనాన్నే అడ్డాగా చేసుకుని అందులోనే అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఇంత పక్కాగా ప్లాన్ చేసినా... మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు ఏడుగురు ముఠా సభ్యులతో సహా చిక్కాడు. అదనపు డీసీపీ పి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. తన 19 ఏళ్ల కుమారుడినీ కలెక్షన్ ఏజెంట్‌గా మార్చుకోవడం గమనార్హం. సింథికాలనీకి చెందిన పడాల మహేష్ బాబు వృత్తి కన్స్ట్రక్షన్ వ్యాపారం. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడాన్ని ప్రవృత్తిగా మార్చుకుని ప్రధాన బుకీగా మారాడు. డెన్ ఏర్పాటు చేస్తే పోలీసులకు చిక్కుతామని తన ఎంజీ హెక్టర్ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. అందులోనే ప్రత్యేకంగా బ్యాటరీతో పాటు వైఫై రూటర్లు అమర్చుకున్నాడు. ల్యాప్‌టాప్, కాల్ కనెక్టర్ బాక్స్, రికార్డర్లు, టీవీ, అకౌంట్ పుస్తకాలు.. ఇలా బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన సమస్తం కారులోనే ఉండేలా చూసుకున్నాడు. తన కుమారుడైన జతిన్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా మార్చుకున్నాడు. నగరానికి చెందిన శ్యామ్ సుందర్ (సబ్ బుకీ), నవాజ్ ఖాన్ (ఏజెంట్), మహేంద్ర కుమార్ అగర్వాల్ (లైన్ ఆపరేటర్), ఆనంద్ (ల్యాప్‌టాప్ ఆపరేటర్), నవీన్ (అకౌంటెంట్), గోవింద్ యాదవ్‌లు (కలెక్షన్ బాయ్) మహేష్ వద్ద నెల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొందరు మహేష్‌తో పాటు అతడి వాహనంలో సంచరిస్తూ ఫోన్ కాల్స్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్స్ అంగీకరిస్తున్నారు. కాల్ కనెక్టర్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేసుకుంటున్నారు. తెలిసిన వారు, వారి సిఫార్సుతో వచ్చిన వారిని మాత్రమే పంటర్లుగా అంగీకరిస్తున్నారు. పందాల నిర్వహణలో క్రెడిట్ సౌకర్యాన్నీ కల్పించేవాడు. ఇతడి పంటర్లు వారం రోజుల పాటు ఎలాంటి మొత్తం చెల్లించకుండా బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. ఆపై అకౌంటెంట్ లెక్కలు చూస్తాడు. దాని ప్రకారం డబ్బు తీసుకోవడమో, చెల్లించడమో ఏజెంట్ల ద్వారా చేస్తుంటాడు. ఇతడి ముఠాపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్, ఎస్సైలు సీహెచ్.నవీన్ కుమార్, ఎస్.సాయి కిరణ్ రామ్‌గోపాల్‌పేట పోలీసులతో కలిసి వలపన్నారు. సింథికాలనీలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో మహేష్, అతడి కుమారుడు జతిన్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4.5 లక్షల నగదు, వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు) -
ధోని మంత్రం పని చేయలేదు
ఒకప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అతను దిగ్గజాల్లాంటి సీనియర్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు కుర్రాళ్లను ఎందుకు ఆడించడం లేదంటే వారిలో తనకు కావాల్సిన ‘మెరుపు’ కనిపించలేదని చెబుతున్నాడు. ఇన్నాళ్లూ ధోని ఏం వ్యూహం రచించినా అదో అద్భుతంగా అనిపించింది. ఎలాంటి ప్రణాళిక వేసినా ఆహా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అనామక బౌలర్ కూడా ధోని సారథ్యంలో ఆడితే అసాధారణంగా కనిపించేవాడు. కానీ ఈసారి ఐపీఎల్లో అలాంటి చమక్కులు ఏమీ కనిపించలేదు. ఒక సీజన్లో జట్టు విఫలం కావడంలో తప్పు లేదు కానీ చెన్నై జట్టు ఆట చూస్తే మరీ ఇలానా... అన్నట్లుగా అభిమానులు సైతం నిట్టూర్చే విధంగా సాగడమే విషాదం. సాక్షి క్రీడా విభాగం: తాజా సీజన్లో ధోనితోపాటు జట్టు సహచరులకు కూడా ఏదీ కలిసి రాలేదు. లీగ్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు పేరుకు ఈసారి మూడు మ్యాచ్‌లు గెలిచినా... ఒక్కసారి కూడా తమ స్థాయిని ప్రదర్శించే ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నిషేధం తర్వాత తీవ్ర ఒత్తిడిలో 2018లో బరిలోకి దిగి చాంపియన్‌గా నిలవడంతో పాటు గత ఏడాది ఫైనల్ కూడా చేరగలిగిన టీమ్ ఇంతగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. వ్యూహాలే గందరగోళం... ఐపీఎల్లో ఏ జట్టు విజయంలోనైనా పవర్‌ప్లేలో చేసే పరుగులు అత్యంత కీలకం. కానీ ఈసారి పవర్‌ప్లేలో చెన్నై ఆట అన్ని మ్యాచ్‌లలో టెస్టులను తలపించింది. తొలి 6 ఓవర్లలో చెన్నైకంటే తక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. వికెట్లు కాపాడుకొని... చివర్లో చెలరేగిపోవచ్చనే వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. ఆఖర్లో వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోయి సాధారణ లక్ష్యాలను కూడా ఛేదించలేక సీఎస్కే చతికిలపడింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లి కూడా అద్భుతంగా గెలిపించవచ్చని గతంలో ఎన్నోసార్లు నిరూపించిన ధోని బ్యాట్ ఈసారి మూగబోయింది. చేయాల్సిన పరుగుల రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయి చివరి మెట్టుపై బోల్తా పడాల్సిన పరిస్థితి వచి్చంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సూపర్ కింగ్స్ నుంచి ‘భారీ స్కోరు’ అనే మాట వినిపించడమే గగనంగా మారింది. ఆదివారం సూపర్ ఓవర్ల తర్వాత ఒక చెన్నై అభిమాని ‘మా జట్టుకు ఎప్పుడైనా సూపర్ ఓవర్ ఆడే అవకాశమే రాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్లు నిలదొక్కుకునే లోపే ఓవర్ ముగిసిపోతుంది’ అంటూ చేసిన సరదా వ్యాఖ్య పరిస్థితిని చూపిస్తోంది. అందరూ అందరే... సీజన్లో చెన్నై 17 మంది ఆటగాళ్లను బరిలోకి దించింది. ఒకటి రెండు వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా చూస్తే అందరి వైఫల్యం కనిపిస్తుంది. ‘సీనియర్ సిటిజన్స్ టీమ్’ అంటూ మొదటి నుంచీ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించినా మేనేజ్మెంట్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే సమస్య వయసు గురించి కాదు. సత్తా ఉంటే ఏ వయసువారైనా చెలరేగిపోగలరు. కానీ చెన్నై జట్టు పరిస్థితి భిన్నం. ప్రధాన ఆటగాళ్లలో సగం మంది రిటైర్డ్ లేదా సెమీరిటైర్డ్లాంటివారు ఉన్నారు. లీగ్‌కు నెల రోజుల ముందు అంతా ఒక్క చోటికి చేరడం, కొంత సాధన చేయడం, ఐపీఎల్ ఆడేయడం... కానీ వేర్వేరు కారణాలతో ఈసారి అది పని చేయలేదు. ఆటగాళ్లకు ‘కంటిన్యుటీ’ సమస్య బాగా కనిపించింది. జట్టుకు దిక్సూచి లాంటి ధోనినే స్వయంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు. అందుకే ఎంత ప్రయతి్నంచినా ఆ షాట్లలో పదును కనిపించలేదు, బ్యాటింగ్‌లో చురుకుదనం కనిపించలేదు. వాట్సన్, బ్రేవో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఇతర లీగ్‌లలో పాల్గొంటున్నా... ఐపీఎల్‌తో పోలిస్తే వాటి ప్రమాణాలు పేలవం. కేదార్ జాదవ్ సంగతి సరే సరి. మొత్తం జట్టులో అన్ని ఫార్మాట్లలో ఉన్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కడే. అందువల్లే కావచ్చు అతనొక్కడిలోనే కాస్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇదే తరహాలో డుప్లెసిస్ మెరుగైన ప్రదర్శన కనబర్చగా, తనకున్న అనుభవాన్ని బట్టి చూస్తే స్యామ్ కరన్ ఆటను కాస్త మెచ్చుకోవచ్చు. సర్వం తానే అయి వ్యవహరించే ధోని... రైనా, హర్భజన్‌లాంటి ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దూరమైతే, కనీసం వారి స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం తనపై తనకు ఉన్న అతి నమ్మకమని చెప్పవచ్చు. మొత్తం మార్చేస్తారా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి రేసులో నిలిచేందుకు ప్రయతి్నస్తాం అనే మొహమాటపు మాటకు పోకుండా తమ పని ముగిసిపోయిందని ధోని స్పష్టంగానే చెప్పేశాడు. కాబట్టి ఇక దృష్టి వచ్చే సీజన్ మీదే. నిబంధనల ప్రకారం 2018 వేలంలో తీసుకున్న ఆటగాళ్ల ఒప్పందం 2020తో ముగుస్తుంది. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ వేలం జరిగాలి. అయితే ఏప్రిల్‌లో జరిగే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ సారికి వేలం నిర్వహించరాదనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు వినిపించింది. అయితే ఇంతటి ‘భారమైన’ జట్టుతో చెన్నై 2021 లీగ్ ఆడే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి ఆ జట్టు వేలం కోసం పట్టుబడవచ్చు. గత ఫలితాలు, చరిత్రను పక్కన పెడితే ఇప్పుడున్న టీమ్‌లో సమూల మార్పులు చేసి వస్తేనే చెన్నై మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఈసారి ధోని ఆట చూస్తే వచ్చేసారి ఆటగాడిగా కొనసాగుతాడా అనేది సందేహమే కానీ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలను బట్టి అది ఉండవచ్చు. అయితే తాజా సీజన్ మాత్రం అభిమానులకు చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ధోని పేద్ద పిస్తా అయితే కావచ్చు. అతను గొప్ప ఆటగాడు కూడా. కానీ కుర్రాళ్లలో తనకు కావాల్సిన మెరుపు కనిపించలేదని అతను చేసిన వ్యాఖ్యను నేను ఏమాత్రం సమరి్థంచను. అసలు అతని ఆలోచనే అర్థరహితం. ఫలితాలు కాదు ప్రక్రియ ముఖ్యం అనే ధోరణే అర్థం లేనిది. ఇచ్చిన ఒక అవకాశంలో రాణించిన జగదీశన్‌లో నీకు కనిపించని మెరుపు జాదవ్, చావ్లాలలో కనిపించిందా. అసలు జాదవ్ మైదానంలో దిగాలంటే ఒక స్కూటర్ కావాల్సిందేమో. –ధోనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్య -
హ్యాట్రిక్ 'పంజా'...
ఐపీఎల్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట ఏడు మ్యాచ్‌లాడి ఆరింట ఓడింది. ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే అనుకున్న దశలో పంజా విసురుతోంది. దీంతో తర్వాత మూడు మ్యాచ్‌ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. పంజాబ్ గెలిచిన వరుస మూడు మ్యాచ్‌లు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ గెలుపుతో అట్టడుగున ఉన్న కింగ్స్ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. దుబాయ్: ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్ ధావన్ అజేయ శతకం... సుడి‘గేల్’, పూరన్ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ఆడింది ఒక్కడే... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ధావన్ దంచుడు ఫోర్‌తో మొదలైంది. ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్ అయ్యర్ (14), పంత్ (14), స్టొయినిస్ (9), హెట్‌మైర్ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచారు. మ్యాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్‌వే! ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న ధావన్... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్ సిక్సర్‌తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్ బ్యాట్‌తోనే చేరింది. గేల్, పూరన్ ధనాధన్... కింగ్స్ లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెపె్టన్ రాహుల్ (15) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గేల్ సుడిగాలి ఆట ఆడేశాడు. అతని హోరుతో 4 ఓవర్లలో 24/1 స్కోరు కాస్తా ఒక్క ఓవర్ పూర్తయ్యేసరికే గిర్రున తిరిగింది. తుషార్ వేసిన ఈ ఐదో ఓవర్‌ను అసాంతం ఆడిన గేల్ 4, 4, 6, 4, 6, వైడ్, 1లతో హోరెత్తించాడు. 26 పరుగులు ధనాధన్‌గా వచ్చేశాయంతే! కింగ్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. కానీ తర్వాతి ఓవర్లో అశి్వన్... గేల్ మెరుపులకు ఫుల్స్టాప్ పెట్టాడు. అదే ఓవర్లో మయాంక్ (5) రనౌటయ్యాడు. 7 ఓవర్లలో పంజాబ్ స్కోరు 57/3. ఢిల్లీ శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం. కానీ పూరన్ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించడంతో పరుగులు చకచకా వచ్చాయి. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో పూరన్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే రబడ అతన్ని ఔట్ చేశాడు. ఢిల్లీకి ఆశలు రేపినా... మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), నీషమ్ (8 బంతుల్లో 10 నాటౌట్; సిక్స్) జాగ్రత్త గా ఆడటంతో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ నెగ్గింది. టి20 క్రికెట్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో వార్నర్ (2011), ఉన్ముక్త్ చంద్ (2013), ల్యూక్ రైట్ (2014), మైకేల్ క్లింగర్ (2015), పీటర్సన్ (2015), మార్కో మరైస్ (2018), రీజా హెండ్రిక్స్ (2018), ఇషాన్ కిషన్ (2019) కూడా ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ ఒకే సీజన్లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో 2016లో కోహ్లి (బెంగళూరు) ఏకంగా 4 సెంచరీలు చేయగా... గేల్ (2011–బెంగళూరు), ఆమ్లా (2017–పంజాబ్), వాట్సన్ (2018–చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్ (బి) నీషమ్ 7; ధావన్ (నాటౌట్) 106, అయ్యర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 14, పంత్ (సి) మయాంక్ (బి) మ్యాక్స్‌వెల్ 14, స్టొయినిస్ (సి) మయాంక్ (బి) షమీ 9; హెట్‌మైర్ (బి) షమీ 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–25, 2–73, 3–106, 4–141, 5–164. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–31–1, షమీ 4–0–28–2, అర్‡్షదీప్ 3–0–30–0, నీషమ్ 2–0–17–1, మురుగన్ అశ్విన్ 4–0–33–1, రవి బిష్ణోయ్ 3–0–24–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సామ్స్ (బి) అక్షర్ 15; మయాంక్ (రనౌట్) 5; గేల్ (బి) అశ్విన్ 29; పూరన్ (సి) పంత్ (బి) రబడ 53; మ్యాక్స్‌వెల్ (సి) పంత్ (బి) రబడ 32; దీపక్ హుడా (నాటౌట్) 15; నీషమ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–17, 2–52, 3–56, 4–125, 5–147. బౌలింగ్: సామ్స్ 4–0–30–0, రబడ 4–0–27–2, అక్షర్ 4–0–27–1, తుషార్ 2–0–41–0, అశి్వన్ 4–0–27–1, స్టొయినిస్ 1–0–14–0. -
ఐపీఎల్లో అతనొక్కడే!!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రికార్డులు, మైలురాళ్లు విరాట్ కోహ్లికి సర్వసాధారణమయ్యాయి. ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును తన అసాధారణ బ్యాటింగ్‌తో, డాషింగ్ నాయకత్వంతో ప్లేఆఫ్‌కు చేర్చాడు. తాజాగా ఢిల్లీ డేర్డేవిల్స్పై ఘనవిజయం సాధించి బెంగళూరు సగర్వంగా ప్లేఆఫ్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మరో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సింగిల్ ఐపీఎల్ సీజన్లో 900 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది. 2012లో 15 మ్యాచ్‌లు ఆడి గేల్ 733 పరుగులు చేశాడు. కానీ ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి అప్పుడే 900 పరుగుల మార్క్‌ను దాటాడు. రికార్డులే రికార్డులు.. ప్రస్తుత ఐపీఎల్లో కోహ్లి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సెంచరీలు చేసి ఒకే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో మొత్తంగా 4వేల పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనాను అధిగమించినప్పటికీ.. రైనా కూడా ధాటిగా పరుగులు చేస్తుండటంతో ఇప్పుడా రికార్డు రైనా-కోహ్లి మధ్య దోబుచులాడుతోంది. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల యంత్రంలా ప్రతి మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడుతున్న కోహ్లి ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అతనొక్కడి వల్లే బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. -
కట్టి‘బెట్టు’డు కానరాదే..!
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ఐపీఎల్ బెట్టింగ్ దందా నెలరోజులుగా జిల్లాలో భారీగా సాగుతోంది. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్కో మ్యాచ్‌పై రూ.వెయ్యి నుంచి రూ.ఐదు లక్షల వరకు బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా సరిహద్దు మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మరింత జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కృష్ణ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన కొంతమంది ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యసనం విద్యార్థుల్లోనూ వ్యాపిస్తోంది. ఇటీవల ఖమ్మం నగ రానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తనకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బులతో ఐపీఎల్ బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నాడు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు తమ తల్లితండ్రులు కొనిచ్చిన ల్యాప్‌టాప్‌లను, సెల్ఫోన్లను సైతం ఐపీఎల్ బెట్టింగ్ కోసం తాకట్టుపెడుతున్నట్లు తెలిసింది. ప్రముఖుల పిల్లలు కూడా తమ సరదా తీర్చుకోవడం కోసం విచ్చలవిడిగా ఈ తంతులో పాల్గొంటున్నారు. టెన్త్, ఇంటర్, డీగ్రీ కళాశాలలకు సెలవులు రావడం, మరికొన్ని ఇంజ నీరింగ్ కళాశాలలకు ప్రిపరేషన్ సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఈ మాయలో పడుతున్నారు. గతంలో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ఈసారి మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది. కాకా హోటళ్లే అడ్డా... బెట్టింగ్ తంతు ఎక్కువగా చిన్న చితకా హోటళ్లు, బార్‌షాపుల లో జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఇలాంటి చోటైతే ఎవరికీ అనుమానం రాదని భావించిన కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా నగరంలోని ప్రధాన లాడ్జీలు, రెస్టారెంట్లు వేలకు వేలు అద్దెలు వసూలు చేస్తూ బెట్టింగ్ రాయుళ్లకు ఆశ్రయం ఇస్తున్నట్లు తెలిసింది. పట్టించుకోని అధికారులు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవారం రోజుల్లో ఐపీఎల్ ముగుస్తుడండంతో ఈ జోరు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిస్థితి మరింత తీవ్రం కాకముందే అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
కాయ్.. రాజా.. కాయ్!
పరిగి, న్యూస్‌లైన్: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ జడలు విచ్చుకుంది. ఒక ప్పుడు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్‌లు నేడు పరిగికి కూడా పాకింది. ఈ జాడ్యం గత ఐపీఎల్ సీజన్లో ప్రారంభమవగా ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో వేళ్లూనుకుంటోంది. ప్రస్తుతం జనమంతా ఎన్నికలో హడావుడిలో మునిగిపోగా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువకులు బెట్టింగ్‌కు బావినసవుతూ రూ. వేలకువేలు వెచ్చిస్తున్నారు. బెట్టింగులు ఇలా.. క్రికెట్ బెట్టింగ్‌ల గురించి వినడమే గాని చాలా మందికి దానికి గురించి తెలియదు. బాల్ టూ బాల్... ఓవర్ టూ ఓవర్.. మ్యాచ్ టూ మ్యాచ్ ఇలా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. పలానా బాల్ పలానా బ్యాట్స్‌మన్ సిక్స్, లేదా ఫోర్ కొడతాడని ఫోన్లో బెట్ కట్టడం, లేదా పలానా బ్యాట్స్‌మన్ పలానా ఓవర్లో 10 పరుగులు, లేదా 20 పరుగులు ఆపైనా సాధిస్తాడు. లేదా దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లో పలానా దేశం విజయం సాధిస్తుంది. పలానా బ్యట్స్‌మన్ హాఫ్ సెంచరీ సాధిస్తాడు.. ఇలా పలు రూపాల్లో బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. మ్యాచ్ టూ మ్యాచ్ బెట్ కట్టే వారు ముందుగానే మధ్యవర్తుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉంటు ంది. గెలిస్తే చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ నిర్వహకులు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. లేదంటే ముందుగా కట్టిన డబ్బులు పోతాయి. ఓవర్ టూ ఓవర్, బాల్ టూ బాల్.. బెట్టింగ్ విషయానికి వస్తే ఓవర్‌కు ముందు, బాల్‌కు ముందు ఫోన్ చేసి బెట్ కట్టాల్సి ఉంటుంది. కొందరు నిర్వాహకులు బ్రోకర్‌ను నియమించి అతని ద్వారా లేవాదేవీలు జరుపుతుంటారు. గెలిస్తే మరుసటి రోజు అతను డబ్బులు తెచ్చి ఇస్తుంటాడు. ఓడితే డబ్బులు తీసుకువెళ్తాడు. పరిగిలో ప్రస్తుతం బెట్టింగ్ ఇలా కొనసాగుతోంది. యువత, ఉద్యోగులపై వల... బెట్టింగ్ నిర్వాహకులు హైదరాబాద్‌లో ఉండి కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రధానంగా క్రికెట్ అంటే క్రేజ్ ఉన్న యువకులు, ఉద్యోగులను ఎంచుకుని ముగ్గులోకి దింపుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో పరిగికి చెందిన 30-50 మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.