హ్యాట్రిక్‌ 'పంజా'... | Kings XI Punjab won by 5 wickets over Delhi Capitals | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ 'పంజా'...

Published Wed, Oct 21 2020 5:07 AM | Last Updated on Wed, Oct 21 2020 4:05 PM

Kings XI Punjab won by 5 wickets over Delhi Capitals - Sakshi

ధావన్‌

ఐపీఎల్‌లో ‘బ్యాక్‌ టు బ్యాక్‌’ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా శిఖర్‌ ధావన్‌ గుర్తింపు పొందాడు.  
ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మొదట ఏడు మ్యాచ్‌లాడి ఆరింట ఓడింది. ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే అనుకున్న దశలో పంజా విసురుతోంది. దీంతో తర్వాత మూడు మ్యాచ్‌ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. పంజాబ్‌ గెలిచిన వరుస మూడు మ్యాచ్‌లు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ గెలుపుతో అట్టడుగున ఉన్న కింగ్స్‌ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది.  

దుబాయ్‌: ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్‌ ధావన్‌ అజేయ శతకం... సుడి‘గేల్‌’, పూరన్‌ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్‌ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.  

ఆడింది ఒక్కడే... 
ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్‌ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతి నుంచి ధావన్‌ దంచుడు ఫోర్‌తో మొదలైంది. ఆఖరి ఓవర్‌ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్‌ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్‌ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్‌ అయ్యర్‌ (14), పంత్‌ (14), స్టొయినిస్‌ (9), హెట్‌మైర్‌ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచారు.  మ్యాక్స్‌వెల్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్‌ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్‌ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్‌వే! ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తి చేసుకున్న ధావన్‌... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో  అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్‌ సిక్సర్‌తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్‌ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్‌ బ్యాట్‌తోనే చేరింది. 

గేల్, పూరన్‌ ధనాధన్‌... 
కింగ్స్‌ లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెపె్టన్‌ రాహుల్‌ (15) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గేల్‌ సుడిగాలి ఆట ఆడేశాడు. అతని హోరుతో 4 ఓవర్లలో 24/1 స్కోరు కాస్తా ఒక్క ఓవర్‌ పూర్తయ్యేసరికే గిర్రున తిరిగింది. తుషార్‌ వేసిన ఈ ఐదో ఓవర్‌ను అసాంతం ఆడిన గేల్‌ 4, 4, 6, 4, 6, వైడ్, 1లతో హోరెత్తించాడు. 26 పరుగులు ధనాధన్‌గా వచ్చేశాయంతే! కింగ్స్‌ స్కోరు 50 పరుగులకు చేరింది. కానీ తర్వాతి ఓవర్లో అశి్వన్‌... గేల్‌ మెరుపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. అదే ఓవర్లో మయాంక్‌ (5) రనౌటయ్యాడు. 7 ఓవర్లలో పంజాబ్‌ స్కోరు 57/3. ఢిల్లీ శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం. కానీ పూరన్‌ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్‌ ఝళిపించడంతో పరుగులు చకచకా వచ్చాయి. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో పూరన్‌ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే రబడ అతన్ని ఔట్‌ చేశాడు. ఢిల్లీకి ఆశలు రేపినా... మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్‌), నీషమ్‌ (8 బంతుల్లో 10 నాటౌట్‌; సిక్స్‌) జాగ్రత్త గా ఆడటంతో ఓవర్‌ మిగిలుండగానే పంజాబ్‌ నెగ్గింది.

టి20 క్రికెట్‌లో ‘బ్యాక్‌ టు బ్యాక్‌’ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌. గతంలో వార్నర్‌ (2011), ఉన్ముక్త్‌ చంద్‌ (2013), ల్యూక్‌ రైట్‌ (2014), మైకేల్‌ క్లింగర్‌ (2015), పీటర్సన్‌ (2015), మార్కో మరైస్‌ (2018), రీజా హెండ్రిక్స్‌ (2018), ఇషాన్‌ కిషన్‌ (2019) కూడా ఈ ఘనత సాధించారు. 

ఐపీఎల్‌ ఒకే సీజన్‌లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌. గతంలో 2016లో కోహ్లి (బెంగళూరు) ఏకంగా 4 సెంచరీలు చేయగా... గేల్‌ (2011–బెంగళూరు), ఆమ్లా (2017–పంజాబ్‌), వాట్సన్‌ (2018–చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు.  

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) నీషమ్‌ 7; ధావన్‌ (నాటౌట్‌) 106, అయ్యర్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 14, పంత్‌ (సి) మయాంక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 14, స్టొయినిస్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 9; హెట్‌మైర్‌ (బి) షమీ 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. 
వికెట్ల పతనం: 1–25, 2–73, 3–106, 4–141, 5–164. బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4–0–31–1, షమీ 4–0–28–2, అర్‌‡్షదీప్‌ 3–0–30–0, నీషమ్‌ 2–0–17–1, మురుగన్‌ అశ్విన్‌ 4–0–33–1, రవి బిష్ణోయ్‌ 3–0–24–0. 
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) సామ్స్‌ (బి) అక్షర్‌ 15; మయాంక్‌ (రనౌట్‌) 5; గేల్‌ (బి) అశ్విన్‌ 29; పూరన్‌ (సి) పంత్‌ (బి) రబడ 53; మ్యాక్స్‌వెల్‌ (సి) పంత్‌ (బి) రబడ 32; దీపక్‌ హుడా (నాటౌట్‌) 15; నీషమ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–17, 2–52, 3–56, 4–125, 5–147. బౌలింగ్‌: సామ్స్‌ 4–0–30–0, రబడ 4–0–27–2, అక్షర్‌ 4–0–27–1, తుషార్‌ 2–0–41–0, అశి్వన్‌ 4–0–27–1, స్టొయినిస్‌ 1–0–14–0.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement