ఐపీఎల్-2023లో నిన్న (మే 13) మరో లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్‌సిమ్రన్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డీసీ ఇన్నింగ్స్‌లో వార్నర్ (54) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ ధవన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లపై, ముఖ్యంగా స్పిన్నర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లే తమను తిరిగి ఆటలోకి తీసుకొచ్చారని కొనియాడాడు. క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అన్నాడు. తాము బ్యాటింగ్ చేసే సమయంలో సైతం పిచ్ స్పిన్నర్లకు సహకరించిందని, అలాంటి పిచ్‌పై ఓ పక్క వికెట్లు పడుతున్నా ప్రభ్‌సిమ్రన్ అత్యద్భుతమైన నాక్ ఆడాడని ఆకాశానికెత్తాడు.
మ్యాచ్‌ను పంజాబ్‌వైపు టర్న్ చేసిన స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ (4/30)పై కూడా ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వికెట్లే లక్ష్యంగా నెమ్మదిగా బౌలింగ్ చేయమని బ్రార్‌కి చెప్పానని.. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసిన తీరు అమోఘమని కొనియాడాడు. డీసీపై గెలుపు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ప్రశాంతంగా ఉండటం తమకు బాగా సహాయపడిందని, తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఇలాగే ఉండేందుకు ప్రయత్నిస్తామని ధవన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు! చెత్త కెప్టెన్సీ వల్లే ఇదంతా
Comments
Please login to add a commentAdd a comment