
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.
ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్‌పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు
39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా
ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

పట్టిష్టంగా ఇరు జట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడగా…అందులో ఎస్‌ఆర్‌హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment