ఐపీఎల్‌లో అతనొక్కడే!!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రికార్డులు, మైలురాళ్లు విరాట్ కోహ్లికి సర్వసాధారణమయ్యాయి. ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును తన అసాధారణ బ్యాటింగ్‌తో, డాషింగ్ నాయకత్వంతో ప్లేఆఫ్‌కు చేర్చాడు. తాజాగా ఢిల్లీ డేర్‌డేవిల్స్‌పై ఘనవిజయం సాధించి బెంగళూరు సగర్వంగా ప్లేఆఫ్‌కు చేరిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో మరో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సింగిల్ ఐపీఎల్ సీజన్‌లో 900 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది. 2012లో 15 మ్యాచ్‌లు ఆడి గేల్ 733 పరుగులు చేశాడు. కానీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి అప్పుడే 900 పరుగుల మార్క్‌ను దాటాడు.
రికార్డులే రికార్డులు..
ప్రస్తుత ఐపీఎల్‌లో కోహ్లి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సెంచరీలు చేసి ఒకే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 4వేల పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనాను అధిగమించినప్పటికీ.. రైనా కూడా ధాటిగా పరుగులు చేస్తుండటంతో ఇప్పుడా రికార్డు రైనా-కోహ్లి మధ్య దోబుచులాడుతోంది.
భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల యంత్రంలా ప్రతి మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడుతున్న కోహ్లి ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అతనొక్కడి వల్లే బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.