
ఐసీసీ వైట్ బాల్ టోర్నీలు (పరిమిత ఓవర్ల టోర్నీలు) అనగానే టీమిండియా కృష్ణార్జునులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు పూనకం వస్తుంది. ఈ ఇద్దరు మామూలు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చెలరేగిపోతారు. ఇందుకు తాజా నిదర్శనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ ఆది నుంచే చెలరేగగా.. రోహిత్ కీలకమైన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.
ఈ ఇద్దరు గడిచిన 18 ఏళ్లలో భారత్‌కు ఐసీసీ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. రోహిత్ ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగం కాగా.. విరాట్ ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమయ్యాడు.
ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి, రోహిత్‌ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. కోహ్లి, రోహిత్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటివరకు (ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్) తలో 90 మ్యాచ్‌లు ఆడి 70కి పైగా విజయాల్లో (కోహ్లి 72, రోహిత్ 70) భాగమయ్యారు.
ప్రపంచంలో మరే క్రికెటర్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో వీరు సాధించినన్ని విజయాలు సాధించలేదు. కోహ్లి, రోహిత్ తర్వాత ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఘనత మహేళ జయవర్దనేకు దక్కుతుంది. జయవర్దనే 93 మ్యాచ్‌ల్లో 57 విజయాలు సాధించాడు.
ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి- 72 (90 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ- 70 (90)
మహేళ జయవర్దనే- 57 (93)
కుమార సంగక్కర- 56 (90)
రవీంద్ర జడేజా- 52 (66)
రికీ పాంటింగ్- 52 (70)
ఎంఎస్ ధోని- 52 (78)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయానికొస్తే.. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడగా.. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.
ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment