![JAY SHAH CONFIRMS ROHIT AND KOHLI WILL BE THERE IN THE CHAMPIONS TROPHY 2025](/styles/webp/s3/article_images/2024/07/1/sw.jpg.webp?itok=y_Kd7XQh)
టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని హింట్ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు.
టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటల్స్ అని తెలిపాడు. విరాట్, రోహిత్‌లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.
ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్‌పాట్ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.
అయితే, హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment