
గతేడాది టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా తెంబా బవుమా (Temba Bavuma) రాణించడంతో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్-2025కి చేరుకుంది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో పన్నెండు మ్యాచ్‌లకు గానూ ఎనిమిది గెలిచిన బవుమా బృందం.. మూడింట ఓడి.. ఒకటి డ్రా చేసుకుంది, ఫలితంగా 100 పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. విజయాల శాతం (69.440) పరంగా మాత్రం అన్ని జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచి అగ్రస్థానాన్ని సంపాదించింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 11న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (SA vs AUS)తో తలపడనుంది. అయితే, ఈ మెగా మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ సౌతాఫ్రికా ఫోర్-డే సిరీస్ మ్యాచ్ సందర్భంగా తెంబా బవుమా గాయపడ్డాడు.
దేశీ రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న బవుమా గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. కాగా లయన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకుని.. టైటాన్స్ జట్టుతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ఇక గురువారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. బవుమా గాయపడిన విషయం ఆఖరి నిమిషంలో లయన్స్ వర్గాలకు తెలిసిందని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తెలిపింది. లయన్స్ కెప్టెన్ డొమినిక్ హెండ్రిక్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. అయితే, గాయం తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
2022లో మూడు నెలలపాటు
కాగా 2022లో బవుమా ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అదే రీతిలో గతేడాది ఐర్లాండ్‌తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఎడమ మోచేయికి గాయం కావడం సౌతాఫ్రికా బోర్డులో ఆందోళన రేకెత్తిస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అయితే, బవుమా గనుక అప్పటికి కోలుకోలేకపోతే.. జట్టుకు ఎదురుదెబ్బ తప్పదు. ఏదేమైనా బవుమా గాయంతో.. తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికాకు నిరాశ ఎదురయ్యే పరిస్థితులు తలెత్తాయి.
శతకాలతో అలరించి
కాగా బవుమా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికాను సెమీ ఫైనల్‌కు చేర్చాడు. ఎడమ మోచేయికి కట్టుతోనే అతడు ఈ మెగా వన్డే టోర్నమెంట్లో బ్యాటింగ్ చేశాడు.
ఇక టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే... గతేడాది బవుమా ఐదు మ్యాచ్‌లు ఆడి 503 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆడిన ఒకే ఒక్క టెస్టులోనూ శతక్కొట్టాడు.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీని 2019లో ప్రవేశపెట్టగా.. తొలి సీజన్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక 2021-23 సీజన్లోనూ భారత్ ఫైనల్‌కు చేరింది.
అయితే, ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తాజాగా 2023-25 ఎడిషన్‌లో మరోసారి ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ సేనను 3-1తో ఓడించి మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!