CT 2025 Aus vs SA: టాస్‌ పడకుండానే కీలక మ్యాచ్‌ రద్దు.. ఆసీస్‌కు.. | CT 2025 Aus vs SA: Match Called Off Due To Rain Without Toss | Sakshi
Sakshi News home page

CT 2025 Aus vs SA: టాస్‌ పడకుండానే కీలక మ్యాచ్‌ రద్దు.. ఆసీస్‌కు ఇది నాలుగోసారి!

Published Tue, Feb 25 2025 5:58 PM | Last Updated on Tue, Feb 25 2025 7:03 PM

CT 2025 Aus vs SA: Match Called Off Due To Rain Without Toss

ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa)  మధ్య వన్డే మ్యాచ్‌ రద్దైంది. వర్షం కారణంగా కనీసం టాస్‌ కూడా పడకుండానే ఆట ముగిసిపోయింది. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా గ్రూప్‌-‘బి’లో ఉన్న ఆసీస్‌- ప్రొటిస్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

రావల్పిండి(Rawalpindi) వేదికగా జరగాల్సిన ఈ కీలక మ్యాచ్‌కు ఆది నుంచే వరణుడు అడ్డు తగిలాడు. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాస్త తెరిపినిచ్చినా మ్యాచ్‌ మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా వర్షం మాత్రం ఆగలేదు. కాసేపు వాన ఆగినా.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ చినుకులు పడ్డాయి.

కటాఫ్‌ టైమ్‌ రాత్రి 7.32 నిమిషాల వరకు
ఇలా ఆగుతూ, సాగుతూ దోబూచులాడిన వరణుడి కారణంగా ఆఖరికి అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం తగ్గకపోవడంతో.. మ్యాచ్‌ మొదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్‌ టైమ్‌ రాత్రి 7.32 నిమిషాల వరకు ఉన్నప్పటికీ కనీసం ఇరవై ఓవర్ల మ్యాచ్‌ సాగేందుకు కూడా గ్రౌండ్‌ పరిస్థితి అనుకూలంగా లేదు. 

చెరో పాయింట్‌
దీంతో మొదలుకాకుండానే మ్యాచ్‌ ముగిసిపోయినట్లు ప్రకటించిన అంపైర్లు.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్‌- అఫ్గనిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితం ఆధారంగా ఈ గ్రూప్‌ నుంచి టోర్నీ నుంచి వైదొలిగే తొలి జట్టు ఖరారు కానుంది.

ఇక తాజాగా వచ్చిన ఒక్కో పాయింట్‌తో బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా, స్మిత్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, నెట్‌ రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్న ప్రొటిస్‌ జట్టు పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్‌ రెండో స్థానంలో ఉంది. 

ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో, ఆస్ట్రేలియా అఫ్గనిస్తాన్‌తో తలపడతాయి. ఇందులో విజయం సాధిస్తే గనుక ప్రొటిస్‌, కంగారు జట్లు నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి.

ఇక చాంపియన్స్‌ ట్రోఫీలో మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరగా.. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 

ఆసీస్‌కు ఇది నాలుగోసారి
కాగా చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్లో గత ఎనిమిది మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాలుగుసార్లు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు కావడం లేదంటే.. ఫలితం తేలకుండానే గేమ్‌ ముగిసిపోయింది.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 పాయింట్ల పట్టిక
గ్రూప్‌-‘ఎ’
👉న్యూజిలాండ్‌- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్‌ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)
👉ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్‌ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)
👉బంగ్లాదేశ్‌- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్‌ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్‌)
👉పాకిస్తాన్‌- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్‌ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్‌)

గ్రూప్‌-బి
👉సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్‌ రన్‌రేటు     +2.140
👉ఆస్ట్రేలియా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్‌ రన్‌రేటు +0.475
👉ఇంగ్లండ్‌- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్‌ రన్‌రేటు     -0.475
👉అఫ్గనిస్తాన్‌- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్‌ రన్‌రేటు-2.140.

చదవండి: పదే పదే అవే తప్పులు.. పాక్‌పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement