
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.
ఇంగ్లండ్‌కు తలపోటు
ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.
గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.
టాప్‌లో సౌతాఫ్రికా
తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్‌ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్‌రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.
ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి.
ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.
నాడు సెమీ ఫైనల్లో
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది.
ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.
సౌతాఫ్రికా జట్టు
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.
Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు
చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment