
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు.
ట్రోఫీ గెలిచిన టీమిండియా..
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్‌లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్‌లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది.
గిల్ అదరగొట్టాడు
గ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.
భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్‌ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.
వారిని ఓడించి
ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.
బుమ్రా రికార్డు బ్రేక్
ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే
👉శుబ్‌మన్ గిల్- మూడుసార్లు
👉జస్‌ప్రీత్ బుమ్రా- రెండుసార్లు
👉రిషభ్ పంత్- ఒకసారి
👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి
👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి
👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి
👉విరాట్ కోహ్లి- ఒకసారి
👉యశస్వి జైస్వాల్- ఒకసారి.
టాప్‌లోనే గిల్
మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.
చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..
Comments
Please login to add a commentAdd a comment