
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.
టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలు
ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.
వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు.. ఈసారి మాత్రం
ముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
ఈ మెగా ఈవెంట్‌ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.
ఆసీస్ వర్సెస్ ప్రొటిస్
ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
సుమారు రూ.45 కోట్లు నష్టం
అయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది.
ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్‌లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment