కోహ్లి రిటైర్మెంట్‌పై ఢిల్లీ రంజీ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు | Delhi Coach Sarandeep Singh Shocking Reveal: Spoke To Virat Kohli, He Wanted 4, 5 Tons In ENG | Sakshi
Sakshi News home page

కోహ్లి రిటైర్మెంట్‌పై ఢిల్లీ రంజీ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు

May 12 2025 8:44 PM | Updated on May 12 2025 8:52 PM

Delhi Coach Sarandeep Singh Shocking Reveal: Spoke To Virat Kohli, He Wanted 4, 5 Tons In ENG

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌కు ఇవాళ (మే 12) ఉదయం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విరాట్‌ నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్రకటనపై క్రికెట్‌ ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విరాట్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌ చూసి టెస్ట్‌ల్లో మరో రెండు మూడేళ్లు కొనసాగుతాడని చాలా మంది అనుకున్నారు. అయితే విరాట్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

విరాట్‌ ఆకస్మిక టెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రకటనపై అందరిలాగే ఢిల్లీ రంజీ జట్టు కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ కూడా ఆశ్చర్యం వ్య​క్తం చేశాడు. విరాట్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ శరణ్‌దీప్‌ సింగ్‌ ఇలా అన్నాడు. కొద్ది రోజుల కిందట (ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సమయంలో) విరాట్‌ టెస్ట్‌ భవిష్యత్తుపై నాతో చర్చించాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌ కోసం ఆతృతగా ఎదరుచూస్తున్నానని చెప్పాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కౌంటీలు ఆడతావా అని విరాట్‌ను అడిగాను.

అయితే విరాట్‌ లేదని చెప్పాడు. కౌంటీలకు బదులుగా ఇండియా-ఏ తరఫున రెండు ​మ్యాచ్‌లు (ఇంగ్లండ్‌-ఏతో) ఆడతానని అన్నాడు.  

2018 తరహాలో ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈసారి ఇంగ్లండ్‌ సిరీస్‌లో నాలుగైదు సెంచరీలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఏం జరిగిందో ఏమో తేలీదు కానీ, విరాట్‌ మూడు నెలల్లో మనసు మార్చకున్నాడు. విరాట్‌ రిటైర్మెంట్‌ వార్త వినగానే షాకయ్యానని తెలిపాడు.

శరణ్‌దీప్‌ సింగ్‌ చెప్పిన ఈ విషయాలను బట్టి చూస్తే విరాట్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటన వెనుక ఏదో జరిగినట్లు తెలుస్తుంది. విరాట్‌కు గత కొన్నేళ్లుగా బీసీసీఐ పెద్దలతో పొసగడం లేదు. అందుకే అతను చాలా సిరీస్‌లకు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉంటూ వస్తున్నాడు.‍ 

గత రెండు మూడేళ్ల కాలంలో విరాట్‌ కేవలం మెగా టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయం నుంచి విరాట్‌కు బోర్డుతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో కూడా విరాట్‌కు సత్సంబంధాలు లేవు. పైకి ఇద్దరూ ఏమీ లేదని నటిస్తున్నప్పటికీ.. ఏదో మూలన ఏదో రగులుతూ ఉంది. 

ఇటీవలికాలంలో సీనియర్‌ ఆటగాళ్ల పట్ల బోర్డు తీరు కూడా సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే సీనియర్లు చెప్పాపెట్టకుండా రిటైర్మెంట్‌ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. 2024-25 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అశ్విన్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటనే ఇందుకు ఉదాహరణ.

టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రోహిత్‌, జడేజా, కోహ్లి ఒకేసారి పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు రోహిత్‌ టెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రకటన చేసిన వారం రోజుల్లోపే విరాట్‌ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. ​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement