
‘‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన ప్రేమ గురించి నాకు తెలుసు.
నీ నుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదేలడంతో పాటు మరింత నిరాడంబరంగా తయారయ్యేవాడివి. నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేష గౌరవం. నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను.
అయితే, నువ్వు మాత్రం మీ మనసు చెప్పిన మాట విన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం మై లవ్’’ అంటూ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది.
తన భర్త, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క. కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు అతడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.
కొనసాగాల్సింది
ఈ నేపథ్యంలో భారత, విదేశీ మాజీ క్రికెటర్లు.. 36 ఏళ్ల కోహ్లి మరికొన్నాళ్ల పాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి రికార్డులను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క పైవిధంగా స్పందించడం గమనార్హం.
మూడు ముళ్ల బంధం.. ముచ్చటైన పిల్లలు
కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లి.. 2017 డిసెంబరు 11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఆ తర్వాత మూడేళ్లకు అంటే.. ఫిబ్రవరి 15, 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు.
తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకున్న ఈ స్టార్ జోడీ.. ఇంత వరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు. అంతేకాదు.. పిల్లల గోప్యత, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్‌లోనే కాలం గడుపుతున్నారు.
శతకాల ధీరుడు
ఇక టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పిన ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా 82 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 30, వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు బాదిన కోహ్లి.. టీమిండియా తరఫున టీ20లలోనూ సెంచరీ నమోదు చేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి ఐపీఎల్‌లో ఇప్పటికి 263 మ్యాచ్‌లు ఆడి.. 8 శతకాల సాయంతో 8509 పరుగులు సాధించాడు.
చదవండి: కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు