
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల అనుమతిని పరిమితం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులు వెంట ఉంటే ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉంటారని అతడు అభిప్రాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
అందరికీ ఒకేలా కనిపించవు!
‘‘నువ్వెవరో తెలిసిన ప్రతి వ్యక్తి మనసులో నీ పట్ల భిన్న భావాలు ఉన్నాయి. నువ్వు ఎవరని నువ్వు అనుకుంటావో అదే నువ్వు.
ఆ ‘నువ్వు’ ఎవరన్నది నీకూ పూర్తిగా తెలియదు. నిన్ను కలిసిన వ్యక్తులు, నీ బంధువులు.. లేదంటే వీధిలో వెళ్తున్నపుడు నీతో చూపులు కలిపిన వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో నీ గురించిన ఆలోచన వేరుగా ఉంటుంది.
తల్లి, తండ్రి, తోబుట్టువులకు నువ్వు ఒకే తీరుగా కనిపించవు. సహచరులకు, ఇరుగుపొరుగు వారికి, నీ స్నేహితులకూ వారి కోణంలోనే కనిపిస్తావు.
ఎదుటివారి ఆలోచనల్లో నీకు వెయ్యి రూపాలు ఉండవచ్చు. కానీ.. ప్రతి వర్షన్‌లోనూ నువ్వు ప్రత్యేకమే. నువ్వు నువ్వే.. వేరొకరివి అసలే కావు’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో తన భర్త.. ప్రత్యేకమైన వాడని అనుష్క చెప్పాలనుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా బీసీసీఐ నిబంధనను ఆమె కూడా విమర్శించిందని అభిప్రాయపడుతున్నారు.
కాగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో టీమిండియా పరాజయం పాలవడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతించనుంది.
దానికి వెలకట్టలేం
నలభై ఐదు రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో రెండు వారాల పాటు సన్నిహితులకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడి వెనక కుంటుబ సభ్యుల ప్రాతను అందరికీ వివరించడం కష్టం. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారిచ్చే మద్దతును వెలకట్టలేం. దాని మీద ప్రజలకు అవగాహన లేదని అనుకోలేం.
కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మైదానంలో ఆవరించిన నిరాశ, నిస్పృహ నుంచి ప్లేయర్లు త్వరగా బయటపడగలరు. అంతేకానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా వెళ్లి గదిలో కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు.
నిరాశ కలిగించింది
సన్నిహితుల సమక్షంలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత కుటుంబంతో గడపడంలో తప్పేముంది. నా వరకైతే కుటుంబ సభ్యులతో ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా. అలాంటి అవకాశాలను వదిలిపెట్టను.
మైదానంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు దీనిపై నియంత్రణ తేవడం నిరాశ కలిగించింది. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబ సభ్యులు వెంట ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు’ అని వివరించాడు. కాగా ఐపీఎల్‌లోనూ డ్రెసింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే, కోహ్లి మాత్రం తాను అనుష్కతో ప్రేమలో ఉన్ననాటి నుంచి.. ఇప్పుడు తాము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత కూడా.. భార్యను ఎల్లవేళలా తన వెంటే తీసుకువెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తాడు.
ఆమె ఎదురుగా ఉంటే.. తాను సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలనని పలు సందర్భాల్లో కోహ్లి వెల్లడించాడు. అయితే, బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల కోహ్లి బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతడి మాటల ద్వారా వెల్లడైంది. అనుష్క శర్మ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment