రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు | Anushka Sharma Hugs Rohit Sharma Priceless Moment After India CT Triumph | Sakshi
Sakshi News home page

రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు

Published Mon, Mar 10 2025 10:35 AM | Last Updated on Mon, Mar 10 2025 11:28 AM

Anushka Sharma Hugs Rohit Sharma Priceless Moment After India CT Triumph

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.

పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్‌(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్‌ చేర్చిన హిట్‌మ్యాన్‌.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్‌ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.

ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలు
ఇక చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత సహచరులు రోహిత్‌ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్‌ బ్యాటర్‌, మాజీ సారథి విరాట్‌ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్‌ కుటుంబ​ంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.

అయితే, విజయానంతరం రోహిత్‌ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని ‌సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్‌ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. 

విరాట్‌ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ బారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ 
వేదిక: దుబాయ్‌,  మార్చి 9
టాస్‌: న్యూజిలాండ్ .. మొద‌ట బ్యాటింగ్‌
కివీస్ స్కోరు: 251/7 (50)

టీమిండియా స్కోరు: 254/6 (49)
ఫ‌లితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియ‌న్‌గా భార‌త్‌
ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌: రోహిత్ శ‌ర్మ‌(83 బంతుల్లో 76)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement