
గత వారం రోజులుగా పాక్‌తో జరిగిన యుద్దంలో భారత్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్దం ముగిసింది. సీస్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా పాక్ కొన్ని గంటల పాటు భారత్‌పై దాడులకు తెగబడింది.
ఎట్టకేలకు నిన్నటి నుంచి పాక్ అన్నీ మూసుకుని కామ్‌గా కూర్చుంది. యుద్దానికి పుల్‌స్టాప్ పడిన తర్వాత పైచేయి సాధించిన భారత్ ఎలాంటి గొప్పలకు పోకుండా తమ పని తాము చేసుకుని పోతుండగా.. భారత దళాల చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ మాత్రం హడావుడి చేస్తుంది.
Shahid Afridi leading a so called 'victory rally' in Karachi.
- Just like their army, everyone is delusional. pic.twitter.com/OnHRvmbzax— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025
భారత్‌పై యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పలు చెప్పుకోగా.. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఓ అడుగు ముందుకేసి కరాచీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
ఈ వీడియోలో అఫ్రిది కారు పైకప్పుపైకి ఎక్కి ఏదో సాధించామన్నట్లు ఫోజులు కొడుతూ కనిపించాడు. అతని వెనుక పలువురు పాకిస్తాన్ జెండాలతో కనిపించారు. ఈ వీడియోపై భారతీయులు భగ్గుమంటున్నారు. చావు దెబ్బ తిన్నా సిగ్గులేకుండా విజయోత్సవ ర్యాలీ ఎలా జరుపుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ర్యాలీ సందర్భంగా అఫ్రిది భారత్‌పై నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. భారత సైన్యమే ముందుగా పాక్‌పై దాడి చేసిందని అఫ్రిది అన్నాడట. భారత దాడులను పాక్ బలగాలు తిప్పికొట్టాయని బిల్డప్ ఇచ్చాడట. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా అవాక్కులు చవాక్కులు పేలాడట. దయ్యాలు వేదాలు వల్లించినట్లు తాము శాంతికాముకులమని ప్రకటించుకున్నాడట.
అఫ్రిది భారత్‌పై, భారత సైన్యంపై కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి చెత్త వాగుడే వాగాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు.
కశ్మీర్‌లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.
తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.
కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి.