India Pakistan tensions
-
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్
-
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా
లాహోర్: భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది. ఈ రైలు మన దేశంలో ఢిల్లీ నుంచి అటారీ వరకు, ఆ తర్వాత పాకిస్తాన్లో వాఘా నుంచి లాహోర్ వరకు నడుస్తుంది. సాధారణంగా ఈ రైలులో ఆక్యుపెన్సీ 70 శాతం ఉంటుండగా.. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడి అనంతరం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 1976లో భారత్–పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’అనే అర్థం. 1976లో జూలై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 6 స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీటైర్ కోచ్ ఉన్నాయి. -
విపక్షాల తీరు పాక్‌కు ఆయుధం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో విపక్షాల వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సాయుధ బలగాల ఆపరేషన్‌ను శంకించడం ద్వారా దేశంపై బురద జల్లేలా పాకిస్తాన్ చేతికి ఆయుధం ఇచ్చినట్లయిందని దుయ్యబట్టారు. 2004–14 మధ్య కాలంలో విఫల ప్రభుత్వాన్ని నడిపిన యూపీయే ఇప్పుడు మరింత ఘోరమైన విపక్ష పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. ‘విపక్షాలు నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది’ పేరిట ఆయన ఆదివారం ఫేస్బుక్లో ఒక బ్లాగ్ రాశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉగ్రదాడుల్ని ఖండించకపోవడాన్ని కూడా జైట్లీ తప్పుపట్టారు. భారత్, పాకిస్తాన్‌లు పరస్పర వినాశనానికి పిచ్చిగా ఆరాటపడటం తనను కలవరపెడుతోందని మన్మోహన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల నుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే భారత హక్కును మన్మోహన్ సందేహించారన్నారు. బాలాకోట్, పుల్వామా ఘటనలను ప్రధాని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సహా 21 విపక్ష పార్టీలు చేసిన తీర్మానంపై జైట్లీ స్పందించారు. ‘విపక్షాల తీర్మానం దేశ ప్రయోజనాలను గాయపరిచింది. విపక్షాల ప్రకటనను పాక్ వాడుకుంది. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అలాగే సంయమనం, రాజనీతిజ్ఞతనూ ప్రదర్శించాల్సి ఉంది’ అని అన్నారు. -
షెడ్యూల్ ప్రకారమే సార్వరిక ఎన్నికలు
-
ట్రెండ్‌ని టైటిల్ చేసుకుంటున్నారు
కొత్త ట్రెండ్, హాట్ టాపిక్స్‌ను క్యాచ్ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ ‘పుల్వామా ఎటాక్, సర్జికల్ స్ట్రైయిక్ 2.0, అభినందన్, హిందుస్తాన్ హమారా హై’ అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. మరి ఈ టైటిల్స్, ఐడియాలన్నీ సినిమా నిర్మాణం వరకూ వెళ్తాయా? వేచి చూడాలి. -
అనుకున్న సమయానికే ఎన్నికలు
లక్నో: సార్వత్రిక ఎన్నికలపై భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం ఉండదని, వాటిని సమయానికే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో సీఈసీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది. సరిహద్దుల్లో పరిస్థితి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందిస్తూ..సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. పోటీచేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని కూడా వెల్లడించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ప్రకటించే ఆస్తుల వివరాల్ని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందన్నారు. 1,63,331 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాల సాయంతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే వారమే షెడ్యూల్! సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే వారంలో ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెప్పాయి. మీడియా సమావేశంలో ప్రధాన కమిషనర్, కమిషనర్లు ఈ మేరకు ప్రకటన చేస్తారని తెలిపాయి. ఇప్పటికే కమిషన్ 2–3 ప్రత్యామ్నాయ షెడ్యూల్స్‌ను ఖరారుచేసిందని, అందులో నుంచి ఒకదాన్ని ప్రకటిస్తుందని వెల్లడించాయి. మరోవైపు, షెడ్యూల్ రాకముందే మరో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు కొందరు కేంద్ర మంత్రులు సంకేతాలిచ్చారు. ఇక ఎన్నికల సన్నాహాల తుది సమీక్షలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. -
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్‌కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. – ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ -
‘అష్ట’దిగ్బంధనం..
న్యూఢిల్లీ: ఇరవైనాలుగు లోహ విహంగాలతో భారత్‌పైకి దాడికి తెగబడిన పాకిస్తాన్‌ను ఎనిమిది భారత యుద్ధవిమానాలు బెదరగొట్టాయి. దీంతో పాక్ విమానాలు తోకముడుచుకుని పారిపోయా యి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ దళాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా దేశానికి రావాలని ప్రార్థిస్తున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది ఎఫ్–16లు, నాలుగు మిరాజ్–3 రకం విమానాలు, నాలుగు చైనా తయా రీ జేఎఫ్–17 ‘థండర్’ యుద్ధవిమానాలతో కూడిన ఫైటర్‌జెట్ విమానాల సమూహాన్ని పాకిస్తాన్ భారత్‌పైకి దాడికి పంపింది. భారత వాయుసేన దాడుల గురించి అప్రమత్తం చేసేందుకు ఈ జెట్లకు మరో పాక్ విమానం తోడుగా వచ్చింది. ఈ విమానాలన్నీ ఉదయం 9.45గంటల సమయంలో భారత్ వైపుగా రావడాన్ని సరిహద్దుకు 10 కి.మీ.ల దూరంలో ఉన్నపుడు భారత వాయుసేన దళాలు పసిగట్టాయి. ఒక్కొక్కటిగా అవి భారతభూగంలోకి దూసుకొస్తుండగా వెంటనే భారత్ వాయుసేనకు చెందిన నాలుగు సుఖోయ్ 30 విమానాలు, రెండు ఆధునీకరించిన మిరాజ్ 2000లు, రెండు మిగ్–21 బైసన్లు రంగంలోకి దిగి వెంటబడ్డాయి. భారత యుద్ధవిమానాలు వెంటబడుతుండడంతో పాక్ యుద్ధవిమానాలు విసిరిన బాంబులు లక్ష్యాలను గురితప్పాయి. సరిహద్దు వెంట ఉన్న భారత ఆర్మీ లక్ష్యాలకు సమీపంలో బాంబులు పడ్డాయి. పాక్ ఫైటర్‌జెట్ విమానాల బృందంలోని ఎఫ్–16 జెట్‌ను కూల్చేందుకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్–21 బైసన్ యుద్దవిమానం ద్వారా ‘ఎఫ్–73 ఎయిర్–టు–ఎయిర్ క్షిపణి’ని ప్రయోగించారు. దీంతో ఎఫ్–16 మంటల్లో చిక్కుకుంది. కానీ, అదే సమయంలో ఎఫ్–16 సైతం అభినందన్ నడుపుతున్న మిగ్పైకి రెండు (అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్–టు–ఎయిర్ మిస్సైల్–అమ్రామ్) క్షిపణులను ప్రయోగించింది. అది ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి తప్పిపోగా, మరొకటి అభినందన్ నడుపుతున్న మిగ్‌ను ఢీకొట్టింది. దీంతో కూలిపోతున్న మిగ్ నుంచి అభినందన్ ప్యారాచూట్‌తో బయటకు దూకేశారు. దెబ్బతిన్న పాక్ ఎఫ్–16 సైతం కుప్పకూలింది. మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న ఎఫ్–16 నుంచి ఇద్దరు పాక్ పైలట్లు ప్యారాచూట్ల సాయంతో సరిహద్దు ఆవల ల్యాండ్ అయ్యారు. ‘జమాతే ఇస్లామీ’పై కేంద్రం నిషేధం న్యూఢిల్లీ: వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌పై గురువారం కేంద్రం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. పుల్వామా దాడి అనంతరం భద్రతా బలగాలు. వివిధ వేర్పాటు వాద సంస్థల నేతలతోపాటు పెద్ద సంఖ్యలో జమాతే ఇస్లామీ శ్రేణులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ భేటీ సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాక్‌తో ఉద్రిక్తతలు, వింగ్ కమాండర్ అభినందన్‌ను వెనక్కి పంపించాలన్న పాక్ ప్రకటన నేపథ్యంలో గురువారం ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజర్‌పై చర్యలకు సంబంధించి పాక్ నుంచి ఎటువంటి హామీ రానంత వరకు సంయమనం పాటించినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమై నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడులకు తలొగ్గిన పాక్ ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని ఈ కమిటీ అభిప్రాయపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభినందన్ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం మంచి పరిణామమని పేర్కొంది. అయితే, బుధవారం పాక్ యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి చొచ్చుకు రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎఫ్–16 విమానాల ద్వారా అమెరికా తయారీ అమ్రోన్ క్షిపణులతో దాడికి యత్నించడాన్ని దురాక్రమణ చర్యేనని పేర్కొంది. ఎన్నికల వేళ ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకున్నా రాజకీయంగా వికటించే ప్రమాదముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. అభినందన్ స్వదేశానికి చేరుకున్న తర్వాతే పాక్‌పై మిగతా చర్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. భేటీలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. పాక్ మోర్టార్ దాడుల్లో మహిళ మృతి జమ్మూ: కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఆరు సెక్టార్లలో పౌర ఆవాసాలపై పాక్ సైన్యం గురువారం జరిపిన మోర్టార్ దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక జవానుకు గాయాలయ్యాయి. పాక్ దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని అధికారులు చెప్పారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం వరుసగా ఇది ఏడవ రోజు. సుందర్బని, మాన్‌కోట్, ఖరికర్మారా, డెగ్వార్ సెక్టార్లలో పాక్ భారీ ఎత్తున మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో కాల్పు లు జరుపుతోందని రక్షణ ప్రతినిధి వెల్లడించారు. మెందార్లోని చజ్జలలో పాక్ మోర్టార్ శకలం తగిలి ఓ మహిళ మరణించగా, మరో ఘటనలో జవాను గాయపడ్డాడని తెలిపారు. -
దేశం మీసం మెలేస్తోంది
దేశమంతా ఇప్పుడు ఒకటే నినాదం. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. మిగ్–21 బైసన్ యుద్ధ విమానం కూలిన తర్వాత పాక్ సైనికులకు అభినందన్ చిక్కడం.. ఆ తర్వాత స్థానికులు ఆయన్ను రక్తం కారేలా హింసించినా.. వీరుడి ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. పాక్ సైన్యం కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరిచికట్టినా ముఖంపై చిరునవ్వు కోల్పోలేదు. కులాసాగా టీ తాగుతూ తనను పాక్ ఆర్మీ బాగానే చూసుకుంటోందని చెప్పడం.. ఆయనలోని జెంటి ల్మన్కు నిలువెత్తు నిదర్శనం. పాక్ మేజర్ ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తన పేరు అభినందన్ అని, తాను పైలట్‌నని, సర్వీస్ నంబర్ 27981 అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు. అనవసర ప్రశ్నలకు సారీ సర్ అంటూ సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలతో ఇప్పుడు దేశంలో విక్రం అభినందన్ హీరోగా మారిపోయారు. భారత సైనికుడి సత్తా ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరదపారుతోంది. వెన్నెముకకు గాయమైనా..! బుధవారం ఉదయం వాస్తవాధీనరేఖకు 7 కిలోమీటర్ల దూరంలో హోర్రా గ్రామంలో భారత్‌కు చెందిన రెండు యుద్ద విమానాలు మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయాయంటూ డాన్ పత్రిక పేర్కొంది. ఒక విమానం నుంచి పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకి దిగడాన్ని స్థానికులు గుర్తించారు. చేతిలో పిస్టల్‌తో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను స్థానికులు చుట్టుముట్టారు. అభినందన్ ఇది భారతా? పాకిస్తానా? అని వారిని ప్రశ్నించారు. అభినందన్‌ను పక్కదారి పట్టించడానికి వారు భారత్ అని చెప్పారు. ఊపిరి పీల్చుకున్న అభినందన్ తన వెన్నెముకకు దెబ్బతగిలిందని.. దాహంతో నోరెండిపోతోందని మంచినీళ్లు కావాలని అడిగారు. అభినందన్‌ను చుట్టముట్టిన స్థానికుల్లో కొందరు యువకులు భావోద్వేగాలు ఆపుకోలేక పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అభినందన్‌కి తాను పాక్‌లో ఉన్నానని అర్థమైంది. వెంటనే చేతిలో ఉన్న పిస్టల్‌తో గాల్లో కాల్పులు జరుపుతూ.. పరుగులు తీశారు. వెన్నెముకకు గాయమై బాధిస్తున్నా పరుగు ఆపలేదు. ఆయనను పట్టుకోవడానికి స్థానికులు వెంబడిస్తే ఒక నీటి కుంటలోకి దూకేశారు. భారత్ రహస్యాలు పరాయి దేశస్తుల చేతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తన దుస్తుల్లో దాచుకున్న కీలక డాక్యుమెంట్లను నమిలి మింగడానికి ప్రయత్నించారు. మరికొన్ని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నీళ్లలో ముంచేశారు. ఆయన్ను వెంబడిస్తూ వచ్చిన స్థానికులు నిర్బంధించి రక్తం కారేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన పాక్ ఆర్మీ గ్రామస్తులు నుంచి అభినందన్‌ను రక్షించి తమ అధీనంలోకి తీసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అభినందన్ కనబరిచిన తెగువ దేశ ప్రజల మనసులను గెలుచుకుంది. ఎఫ్–16నే కూల్చేశారు ఆయన నడుపుతున్న మిగ్ 21 బైసన్ కుప్పకూలడానికి కొద్ది సెకండ్ల ముందు కూడా అభినందన్ తాను చేయాల్సిన పని పైనే దృష్టి పెట్టారు. శత్రుదేశ యుద్ధ విమానం ఎఫ్–16ను గురితప్పకుండా కాల్చి కూల్చేశారు. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే ఆర్–73 క్షిపణిని ప్రయోగించి అభినందన్ ఈ పని పూర్తి చేశారు. ఎప్పుడో 1960 కాలం నాటి క్షిపణిని ప్రయోగించి గురితప్పకుండా ప్రత్యర్థి అత్యాధునిక విమానాన్ని కూల్చివేయడం అరుదైన ఘటన అని వైమానిక వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి 7 కి.మీ. దూరంలోకి చొచ్చుకు వచ్చినా అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోయాయి. వీటి రాకను గుర్తించి గస్తీ తిరుగుతున్న రెండు మిగ్–21 బైసన్ విమానాలువెంబడించాయి. ఈ ప్రయత్నంలో రెండు ఎఫ్–16 విమానాల మధ్యకు అభినందన్ మిగ్ దూసుకెళ్లింది. తర్వాత విమానం అదుపుతప్పింది. పరిస్థితి చేయిదాటుతున్నా.. మిగ్ కూలిపోవడానికి ఆఖరి నిమిషంలో ఎఫ్–16ని కూల్చేశారు. వాఘా వద్ద అభినందన్‌కు ఆహ్వానం న్యూఢిల్లీ: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం భారత్–పాక్ సరిహద్దుల్లోని వాఘా పోస్ట్ వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టనున్నారు. ఐఏఎఫ్ అధికారుల బృందం వాఘా వద్ద ఆయనకు స్వాగతం పలకనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన్ను పాక్ సైన్యం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించనుందా లేక భారత అధికారులకు అప్పగిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. పంజాబ్‌లోని అట్టారి వద్ద భారత్–పాక్ సరిహద్దుల్లో వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. ‘పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తున్నాను. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఉన్నాను. అట్టారి వద్ద ఆయన్ను దేశంలోకి ఆహ్వానించటాన్ని గౌరవంగా భావిస్తాను. నాకు మాదిరిగానే అభినందన్, ఆయన తండ్రి కూడా నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ పొందినవారే. నాకు అవకాశం ఇవ్వండి’అంటూ ఆయన ప్రధానిని ట్విట్టర్లో కోరారు. -
సింహం కడుపున సింహమే పుడుతుంది
విక్రమ్ అభినందన్ మహారాష్ట్రలో ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో 16 ఏళ్లు సేవలు అందించారు. మన దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లలో ఆయన కూడా ఒకరు. అభినందన్ వయసు 36ఏళ్లు. సొంత రాష్ట్రం తమిళనాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారు. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. సుఖోయ్–30 యుద్ధ విమానాలను అత్యంత చాకచక్యంగా నడపగలరు. ఆ తర్వాత మిగ్–21 విమానం నడిపే బాధ్యతలు ఆయనకి అప్పగించారు. సూర్యకిరణ్ విన్యాసాలు చేయడంలో ఈయన దిట్ట. అభినందన్ తండ్రి కూడా మాజీ ఎయిర్‌మార్షల్. ఆయన పేరు సింహకుట్టి వర్ధమాన్. గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1999 కార్గిల్ యుద్ధంలో సమయంలో కీలక పాత్ర పోషించారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పని చేసి ఆయన పదవీ విరమణ చేశారు. అభినందన్ సోదరుడు కూడా వాయుసేనలో పనిచేశారు. అభినందన్ భార్య తన్వి మార్వా కూడా ఐఏఎఫ్‌లో అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేయడం విశేషం. అభినందన్‌ను విడుదల చేయడానికి పాక్ అంగీకరించడంతో ఆయన తండ్రి వర్ధమాన్ ఆనందానికి హద్దుల్లేవు. నిజమైన సైనికుడంటూ కుమారుడిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దేశం అంతా తన కుమారుడి విడుదలకు ప్రార్థించిన భారతీయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే తీసిన సినిమా చెలియా (తమిళంలో కాట్రూ వెలియడాయ్)లో సహజంగా సన్నివేశాలను చిత్రీకరించేందుకు అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌ను సంప్రదించారు. ఆ చిత్రంలోనూ ఐఏఎఫ్ విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేస్తుంది. పైలట్‌ను అదుపులోనికి తీసుకొని చిత్రహింసలు పెడుతుంది. -
పాకిస్థాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్ మెసేజ్!
వాషింగ్టన్: తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులన్నింటినీ అక్రమమైనవిగా గుర్తించి.. నిర్మూలించాలని సూచించింది. 'పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని మేం ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం' అని అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఉగ్రవాదులు, హింసాత్మక అతివాదుల కారణంగా పాకిస్థానే ఎక్కువగా నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాద ముప్పుపై పోరాటంలో పాకిస్థాన్‌కు తాము సాయం అందిస్తామని, అయితే పాకిస్థాన్ భూభాగాన్ని తమకు స్వేచ్ఛాయుత ఆవాసంగా మార్చుకున్న ఉగ్రవాదులపై ఆ దేశం చర్య తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడులను అమెరికా సమర్థించింది. ఉడీ దాడీ సీమాంతర ఉగ్రవాదానికి స్పష్టమైన నిదర్శనమని తేల్చిచెప్పిన అగ్రరాజ్యం... ఉగ్రవాద ముప్పుపై సైనిక చర్యలతో బదులు చెప్పాల్సిన అవసరముందంటూ భారత్ వైఖరిని సమర్థించింది. -
అక్కడ 'ధోనీ' సినిమాకు షాక్!
మధ్యతరగతి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ మధ్య తారస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆ ప్రభావం పడింది. భారత్‌లోని పాకిస్థానీ నటులు వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ బెదిరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఏకంగా 'ధోనీ' సినిమాపై నిషేధం విధించింది. 'ధోనీ' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయవద్దని ఆ దేశం డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారని 'మిడ్ డే' పత్రిక తెలిపింది. పాక్‌లో ఈ సినిమాను పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకురాలేదని, దీంతో పాక్‌లో ఈ సినిమా విడుదల కాకపోవచ్చునని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమాలపై ప్రభావం ఉంటుందని, భారత సినిమాలు పాక్‌లో విడుదల అయ్యే అవకాశం లేదని ఐఎంజీసీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ అహ్మద్ రషీద్ తెలిపారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేవరకు భారత్ సినిమాలు పాక్‌లో విడుదల కాకుండా నిషేధించాలని లాహోర్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది.