
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో విపక్షాల వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సాయుధ బలగాల ఆపరేషన్‌ను శంకించడం ద్వారా దేశంపై బురద జల్లేలా పాకిస్తాన్ చేతికి ఆయుధం ఇచ్చినట్లయిందని దుయ్యబట్టారు. 2004–14 మధ్య కాలంలో విఫల ప్రభుత్వాన్ని నడిపిన యూపీయే ఇప్పుడు మరింత ఘోరమైన విపక్ష పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. ‘విపక్షాలు నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది’ పేరిట ఆయన ఆదివారం ఫేస్‌బుక్‌లో ఒక బ్లాగ్ రాశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఉగ్రదాడుల్ని ఖండించకపోవడాన్ని కూడా జైట్లీ తప్పుపట్టారు.
భారత్, పాకిస్తాన్‌లు పరస్పర వినాశనానికి పిచ్చిగా ఆరాటపడటం తనను కలవరపెడుతోందని మన్మోహన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల నుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే భారత హక్కును మన్మోహన్ సందేహించారన్నారు. బాలాకోట్, పుల్వామా ఘటనలను ప్రధాని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సహా 21 విపక్ష పార్టీలు చేసిన తీర్మానంపై జైట్లీ స్పందించారు. ‘విపక్షాల తీర్మానం దేశ ప్రయోజనాలను గాయపరిచింది. విపక్షాల ప్రకటనను పాక్ వాడుకుంది. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అలాగే సంయమనం, రాజనీతిజ్ఞతనూ ప్రదర్శించాల్సి ఉంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment