Arun Jaitley
-
అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి
న్యూఢిల్లీ: సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా అరుణ్‌జైట్లీ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ప్రైవేటు రంగాన్ని వృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ‘‘9 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం. 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిధులతో నిర్మించాం. 45 కోట్ల బ్యాంకు ఖాతాలను పేదల కోసం తెరిచాం. 2014కు ముందు పదేళ్లలో 50 వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, గత 7–8 ఏళ్లలో 209 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి’’అని చెప్పారు. భారత్ తప్పనిసరి అయి సంస్కరణలు చేపట్టడం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని దృఢ విశ్వాసంతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలు అందరికీ ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నేత అయిన అరుణ్‌జైట్లీకి ప్రధాని నివాళులు అర్పించారు. -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్‌ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్‌ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్‌దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్‌దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్‌జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్‌గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి
న్యూఢిల్లీ : ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డీడీసీఏ నిర్ణయంపై భారత స్పిన్ దిగ్గజం ,బిషన్ సింగ్ బేడీ మండిపడ్డారు. తన నిరసనను తెలుపుతూ డీడీసీఏ ప్రస్తుత అధ్యక్షుడు, అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని లేఖలో వ్యాఖ్యానించిన ఆయన క్రికెటర్ల కన్నా ఎక్కువగా పాలకులను ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కోట్లా స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండుకు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. అంతేకాకుండా డీడీసీఏలో తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నానని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు బేడీ అందించిన సేవలకు గుర్తింపుగా 2017లో ఆయన పేరుతో స్టాండును ఏర్పాటు చేశారు. ఈ లేఖపై స్పందించేందుకు డీడీసీఏ విముఖత వ్యక్తం చేసింది. -
నిర్మలా సీతారామన్‌తో పనిచేయడం కష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయిందనీ, ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్‌కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్‌లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు. అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు. -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
కీలక పదవిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది. మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో అధ్యక్షుడు రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్‌లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
ఆసక్తికరంగా నిర్మల ప్రసంగం..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ఆమె ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన ప్రసంగం ప్రారంభంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని నిర్మల గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జీఎస్టీని తీసుకురావడం చారిత్రత్మకమైన నిర్ణయమని పేర్కొన్న నిర్మల.. శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సాగుతున్న నిర్మల ప్రసంగం.. ఆకట్టుకునేలా ఉంది. మధ్యలో ఆమె ఓ కవితను కూడా చదివి వినిపించారు. ‘నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది’ అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గతంలో మాదిరిగానే నిర్మల ఈసారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్ ప్రతులును తీసుకునివచ్చారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి, ఇతర కుటుంబభ్యులు పార్లమెంట్‌కు వచ్చారు. (జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు) -
జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు
సాక్షి, న్యూడిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న యూనియన్ బడ్జెట్ 2020పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 1 శనివారం నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా రెండసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనికి ముందు ఆమె 15వ ఆర్థిక సంఘం రిపోర్టును సభ ముందు ఉంచారు. రాజకీయ స్థిరత్వంతోపాటు, ఆర్థిక పురోగతిని కాంక్షిస్తూ ప్రజలు తమకు అధికారాన్నిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది పథంలో నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆర్థికమంత్రి చెప్పారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఈ క్రమంలో తాము తీసుకొచ్చిన జీఎస్టీ చాలా కీలకమైందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా ,కొనుగోలు శక్తి పుంజుకునేలా బడ్జెట్ వుంటుందని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. జీఎస్టీ చారిత్రాత్మక నిర్ణయమని, పన్ను రేట్ల శ్లాబుల వల్ల సామాన్యుల నెలవారీ ఖర్చులు తగ్గాయి, తద్వారా వారికి భారీ ప్రయోజనం చేకూరిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రికి అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలో చాలా కీలకమైన జీఎస్టీ విషయంలో జైట్లీ చాలా ముందు చూపుతో వ్యవహరించారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. (ఐ యామ్ వెయిటింగ్: కిరణ్ ముజుందార్ షా) -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్‌కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్‌కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
జైట్లీ సంస్కరణలు ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ రాజీనామా ఇంకా ఆమోదించలేదు’
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్‌బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
‘రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేశారు. అతడి రాజీనామాను డీడీసీఏ సీఈఓ, సీఏసీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇక రజత్ శర్మ రాజీనామా తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్, కోచ్ కేపీ భాస్కర్ల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది. ‘డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారు. డీడీసీఏ సమగ్రతను కాపాడుతూ నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలని భావించాను. కానీ డీడీసీఏ అలా ఉండటం సాధ్యపడటం లేదు. అయితే ఆ విషయాల్లో నేను రాజీ పడే ప్రసక్తే లేదు. దీంతో రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను’ అని రజత్ శర్మ పేర్కొన్నారు. ఇక రజత్ రాజీనామా అనంతరం వినోద్ తిహారా అధ్యక్షపదవి రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే బోర్డు ప్రవర్తనా నియమవాళిని ఉల్లఘించిన నేపథ్యంలో తిహారా సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే. రజత్ రాజీనామాతో తిహారా సస్పెన్షన్‌పై డిసెంబర్ 1న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో పునరాలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మాకు పెన్షన్ వద్దు.. వాళ్లకే ఇవ్వండి!
న్యూఢిల్లీ : దివంగత బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అరుణ్ జైట్లీ పెన్షన్ తమకు వద్దని చెప్పిన ఆయన భార్య సంగీత జైట్లీ.. ఆ డబ్బును రాజ్యసభ దిగువ తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరారు. అరుణ్ జైట్లీ ఉదారత, సేవాగుణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. అరుణ్ జైట్లీ పేరిట తనకు వచ్చే నెలవారీ పెన్షన్ రూ. 25 వేల మొత్తాన్ని రాజ్యసభ నాలువ తరగతి ఉద్యోగులకు అందజేయాలని కోరారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, బీజేపీ ట్రబుల్ షూటర్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుణ్ జైట్లీ ఆగష్టు 24న కన్నుమూసిన విషయం విదితమే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక అరుణ్ జైట్లీ సేవా గుణాన్ని చాటుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే వారన్న విషయం తెలిసిందే. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన.. తన వద్ద పనిచేసిన ఎంతో మంది సిబ్బంది పిల్లలను ఉచితంగా చదివించారు. అదే విధంగా 2018లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన సమయంలో.. అక్కడి రోగుల ఇబ్బందిని గమనించి వాటర్ కూలర్స్, డిస్పెన్సింగ్ యూనిట్స్ దానం చేశారు. కాగా అనారోగ్య కారణాల కారణంగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టలేనని ప్రధాని మోదీకి జైట్లీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
అనుష్క భావోద్వేగం.. విరాట్‌పై ముద్దుల వర్షం
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లాగా ఉన్న ఢిల్లీ మైదానానికి కొత్తగా అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. అలాగే ఒక స్టాండ్‌కు విరాట్ కోహ్లి పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగాయి. గురువారం నాటి కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తున్నట్టుగా డీడీసీఏ ప్రకటించింది. దీంతో కోట్లా మైదానం ఇకమీదట అరుణ్ జైట్లీ స్టేడియంగా కీర్తి గడించనుంది. కాగా క్రికెట్లో విశిష్ట సేవలందించినందుకుగానూ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని స్పెషల్ స్టాండ్‌కు విరాట్ కోహ్లిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్.. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా దేశం కోసం ఆట ఆడటానికి సిద్ధమయ్యాడని.. అంతటి ధైర్యశాలి, గొప్ప మనిషి క్రికెట్ ప్రపంచంలో మరొకరు లేరని చెప్తూ అరుణ్ జైట్లీ అతన్ని కీర్తించేవారని పేర్కొన్నారు. దీంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విరూష్కలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అనుష్క ఉబికి వస్తున్న కన్నీరును దిగమింగుకుంటూ విరాట్ గొప్పతనానికి అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. కాసేపటి వరకు అనుష్క శర్మ సాధారణ స్థితికి రాలేకపోయింది. దీంతో విరాట్ తనని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు దిగులు కూడా దరి చేరకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: విరుష్కల ఫోటో వైరల్) View this post on Instagram Cute! @anushkasharma and @virat.kohli caught in an adorable moment during an event in Delhi. . . Follow for more Updates @filmymantramedia Inquiries @murtaza . . #bollywoodactress #Bollywood #viratkohli #anushkasharma #virushka #love #kiss #together #sports #bollywood #hollywood #game #cricket #filmymantramedia #filmymantra A post shared by Filmymantra Media (@filmymantramedia) on Sep 12, 2019 at 8:14pm PDT -
ఫిరోజ్ షా కాదు ఇక..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానానికి ‘అరుణ్ జైట్లీ స్టేడియం’అని అధికారికంగా నామకరణం చేశారు. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన నూతన నామకరణ మహోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారథి విరాట్ కోహ్లి అతడి సతీమణి అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు అరుణ్ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. డీడీసీఏతో పాటు బీసీసీఐలో పలు బాధ్యతలు, హోదాలను నిర్వహించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఢిల్లీ క్రికెట్లో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జైట్లీ మరణాంతరం ఆయన గుర్తుగా ఫిరోజ్ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే గ్రౌండ్‌కు మాత్రం పాత పేరునే కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. కాగా, అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అశిష్ నెహ్రా వంటి క్రికెటర్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అరుణ్ జైట్లీ స్టేడియంగా ఫిరోజ్ షా..
ఢిల్లీ: ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మృతి చిహ్నంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును మార్చనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజులు హాజరుకానున్నారు. డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. దీనిలో భాగంగా డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారన్నారు. జైట్లీ డీడీసీఏ పగ్గాలు చేపట్టిన సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను పునరుద్ధరించారని, ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్‌ల నిర్మించారన్నారు. డీడీసీఏకి జైట్లీ చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. -
జైట్లీ నివాసానికి ప్రధాని మోదీ..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దివంగత నేత అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ఢిల్లీలోని జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ... ఆయన భార్య సంగీత, కుమారుడు రోహన్, కుమార్తె సొనాలిలను ఓదార్చారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీతో ఉన్నారు. విదేశీ పర్యటన కారణంగా జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని హాజరుకాలేకపోయారు. మరణవార్త తెలిసిన వెంటనే జైట్లీ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే జైట్లీ నివాసానికి వెళ్లారు. బీజేపీ సీనియర్ నేతగా, గత కేబినెట్లో ఆర్థిక, రక్షణమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్‌జైట్లీతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. -
సోనియాకు అరుణ్ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న రాయ్‌బరేలి నియోజకవర్గానికి ఓ బహుమతిని ఇచ్చాడు. తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి 200 సోలార్ విద్యుత్ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం రాయ్ బరేలీ జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై బీజేపీ నాయకుడు హీరో బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ‘జైట్లీ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆగస్టు 17న రాయ్‌బరేలీ జిల్లా కలెక్టర్‌కు ఈ సిఫారసులు అందాయి’ అని పేర్కొన్నారు. ఆయన ఈ లేఖ జూలై 30న, అంటే ఆస్పత్రిలో చేరడానికి ముందు రాసినట్టు ఉంది. కాగా తనకు జైట్లీ నుంచి సిఫారసులు అందినట్టు రాయ్‌బరేలీ జిల్లా కలెక్టర్ నేహ శర్మ తెలిపారు. ఎంపీలాడ్స్ నిధుల కింద ఎంపీలు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.5 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది. (చదవండి : జైట్లీకి కన్నీటి వీడ్కోలు) గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) ఈ నెల 24న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు జరిగాయి. -
జైట్లీకి కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కైలాస్ కాలనీలోని స్వగృహం నుంచి దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు అక్కడే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్ష్‌వర్థన్, ప్రకాశ్ జవడేకర్, పీయూష్ గోయెల్, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలపాటు పార్థివ దేహం వద్ద మౌనంగా నిలుచుండి పోయారు. మధ్యాహ్నం ప్రత్యేక శకటంలో జైట్లీ పార్థివ దేహాన్ని నిగమ్‌బోధ్ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్రలో ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్ బిర్లా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుసహా అశేష సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠిస్తుండగా జైట్లీ కుమారుడు రోహన్ చితికి నిప్పంటించారు. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ..జైట్లీకి ఉద్వేగపూరిత నివాళులర్పించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ వస్తువులపై మక్కువ కుర్తా పైజామాతో అందరికీ ఆత్మీయుడిగా కనిపించే అరుణ్ జైట్లీకి లండన్‌లో తయారయ్యే షర్టులు, జాన్ కాబ్ షూస్ వంటి బ్రాండెడ్ వస్తువులంటే విపరీతమైన మక్కువనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయ వేత్తగా, ప్రముఖ లాయర్‌గా అందరికీ సుపరిచితుడైన జైట్లీకి బ్రాండెడ్ వాచీలు, పెన్నులు, శాలువాలు, షర్టులు, ఇంకా షూలు సేకరించడం హాబీ. ఆయన వాడే వాటిల్లో ప్రఖ్యాత పటేక్ ఫిలిప్స్(వాచీలు), మాంట్ బ్లాంక్ (పెన్నులు) ఉన్నాయి. జైట్లీ అభిరుచులపై కుంకుమ్ చద్దా రాసిన ‘ది మారిగోల్డ్ స్టోరీ’ పుస్తకంలోని అరుణ్‌జైట్లీ: ది పైడ్ పైపర్ అనే చాప్టర్లో వివరంగా ఉంది. ‘చాలా మంది భారతీయులకు ఒమెగా వాచీలకు మించి తెలియని రోజుల్లోనే జైట్లీ చాలా ఖరీదైన పటేక్ ఫిలిప్స్ వాచీలను కొనేవారు. మాంట్ బ్లాంక్ పెన్నులు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి మోడల్‌నూ కొనేవారు. ఇంకా జమవార్ షాల్స్‌ను సేకరించేవారు. ఆయన తన కుమారుడికి కొని పెట్టిన మొదటి షూ జత ఇటాలియన్ బ్రాండ్ సల్వటోర్ ఫెర్రాగమో’ అని చద్దా పేర్కొన్నారు. అలాగే, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తనకంటూ కొన్ని నియమాలను విధించుకున్నారు. లాయర్‌గా తను తీసుకునే ఫీజు కాకుండా క్లర్కులకు ‘మున్షియానా’(ఫీజు)కూడా అందేలా చూసేవారు. ఈ విధానం ఆయన తోటి వారికి నచ్చకపోయినా అరుణ్ తన విధానానికే కట్టుబడి ఉన్నారు’ అని జైట్లీ సతీమణి సంగీత తెలిపారని చద్దా తన పుస్తకంలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనల్లోనూ వెంట ఉండే వారి ఖర్చులు తనే భరించేవారని ఆమె తెలిపారన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల సందర్భంగా రాకపోకల కోసం విదేశీ కంపెనీల ప్రతినిధులు కార్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామన్నా అంగీకరించేవారు కాదని పేర్కొన్నారు. -
ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్నారు. -
జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు. ‘జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు. ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు. తీవ్ర అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.