
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీ మండిపడ్డారు. సరిహద్దుల్లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం భేటీ అయిన 21 విపక్ష పార్టీలు చేసిన ఉమ్మడి ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని, వారి ప్రకటనతో పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ, మీడియా ఆనందంగా ఉన్నాయని జవదేకర్ తప్పుబట్టారు. జైట్లీ కూడా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ‘యావత్ దేశం ఒకే గొంతుకను వినిపిస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో యావత్ దేశం ఒకే గొంతుకను వినిపించాలని నేను అభ్యర్థిస్తున్నాను. పాకిస్థాన్ తనకు అనుకూలంగా జబ్బలు చరుచుకునేలా మీరు (ప్రతిపక్షాలు) ఇచ్చిన దురుద్దేశపూరిత ప్రకటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను’ అని జైట్లీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment