రూ. 80 వేల కోట్ల రికవరీ.. | NCLT helped creditors recover Rs 80,000 crore | Sakshi
Sakshi News home page

రూ. 80 వేల కోట్ల రికవరీ..

Published Fri, Jan 4 2019 2:58 AM | Last Updated on Fri, Jan 4 2019 2:28 PM

NCLT helped creditors recover Rs 80,000 crore - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్‌సీఎల్‌టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా ఎన్‌సీఎల్‌టీ అవతరించిందని జైట్లీ ప్రశంసించారు. ‘‘దివాలా కోడ్‌ – రెండేళ్లు’ అన్న అంశంపై జైట్లీ ఒక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే...

► వాణిజ్యానికి సంబంధించి దివాలా సమస్యలను పరిష్కరించలేని క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్‌ వదిలిపెట్టి వెళ్లింది. అయితే ఈ విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంది. దివాలా చట్టానికి పదునుపెట్టింది.

► 2016 చివర్లో ఎన్‌సీఎల్‌టీ కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ కేసులను విచారించడం ప్రారంభించింది. ఇప్పటికి 1,322 కేసుల విచారణను (అడ్మిట్‌) చేపట్టింది. అడ్మిషన్‌కు ముందే 4,452 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.2.02 లక్షల కోట్లు పరిష్కారమయినట్లు ఎన్‌సీఎల్‌టీ డేటా చెబుతోంది.  విచారణా ప్రక్రియ ద్వారా 66 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.80 వేల కోట్ల రికవరీ జరిగింది.  260 కేసుల విషయంలో దివాలా చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

► భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్, ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా వంటి 12 బడా కేసులు విచారణ ప్రక్రియ చివరిదశలో ఉంది. వీటిలో కొన్ని కేసుల పరిష్కారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో రూ.70,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. ఆయా కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు.

► ఎన్‌పీఏ అకౌంట్లు తగ్గుతుండడం హర్షణీయం. రుణాల మంజూరు, చెల్లింపుల వ్యవస్థల్లో మార్పులను ఈ పరిణామం సూచిస్తోంది. దివాలా చట్టం– రుణదాత, గ్రహీత మధ్య సంబంధాల్లో కూడా సానుకూల మర్పును సృష్టించింది.

► ఖాయిలా పరిశ్రమల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వ 1980లో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం తీసుకువచ్చింది. ఇది తీవ్ర వైఫల్యం చెందింది. ఈ చట్టం పలు ఖాయిలా పరిశ్రమలకు  రుణదాతల నుంచి రక్షణ కల్పించింది. బ్యాంకింగ్‌ రుణ బకాయిల వసూళ్లకు డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఏర్పాటయినా, అది అంత ఫలితమివ్వలేదు.

► 2008–2014 మధ్య బ్యాంకుల విచక్షణారహితంగా రుణాలను మంజూరుచేశాయి.వాటిలో ఎక్కువ మొండిబకాయిలుగా మారాయని ఆర్‌బీఐ రుణ నాణ్యతా సమీక్షలు పేర్కొంటున్నాయి.

► ఆయా అంశాలే ఎన్‌డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు కారణమయ్యింది. 2016 మేలో పార్లమెంటు రెండు సభలూ ఐబీసీ (ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)కి ఆమోదముద్ర వేశాయి. నేను చూసినంతవరకూ పార్లమెంటు ఆమోదించిన సత్వర చర్యల, అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక చట్టం ఇది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement