న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయనిచ్చిన రూ. 1,200 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుకి సంబంధించిన మొత్తాన్ని రికవర్ చేసుకునే దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలంటూ అనిల్ అంబానీని ట్రిబ్యునల్ ఆదేశించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ (ఆర్‌ఐటీఎల్) తీసుకున్న రుణాలకు గాను అనిల్ అంబానీ ఈ వ్యక్తిగత పూచీకత్తునిచ్చినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా తగు సమాధానాలను అంబానీ దాఖలు చేస్తారని వివరించారు. 3 చైనా బ్యాంకులకు చెల్లించాల్సిన 717 మిలియన్ డాలర్ల బాకీలను రుణ ఒప్పందం ప్రకారం 21 రోజుల్లోగా కట్టేయమంటూ గత నెలలో బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సిందేనని లండన్‌లోని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్ట్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment