dues
-
ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టింది. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డి మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా గత ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఈ పథకాన్ని దెబ్బ కొడుతున్నారని ధ్వజమెత్తారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా, ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలలపై స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా?చంద్రబాబూ.. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా.. అలాంటి కంపెనీలకే ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంత వరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి అనేక మార్లు ఎంతో మందిని ఆదుకున్నాం. ఈ పని ప్రైవేటు కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు (చంద్రబాబు) ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోవడం వాస్తవం. ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?నాలుగు సార్లు సీఎం అయ్యానని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారు. అయితే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఏనాడైనా అనుకున్నారా? కనీసం ఏరోజైనా ఆ ప్రయత్నం చేశారా? దివంగత మహానేత వైఎస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్కపనైనా చేశారా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్సలు అందించే ప్రొసీజర్లను 1,000 నుంచి 3,257కి పెంచింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వారికీ మేలు చేశాం. రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేస్తూ, ఐదేళ్లలో 45.1 లక్షల మందికి రూ.13,421 కోట్లతో ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, విశ్రాంతి సమయంలో రోగులకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. దీని కింద 24.59 లక్షల మందికి మరో రూ.1,465 కోట్లు అందించాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్త అంబులెన్స్‌లతో 104, 108 సేవలను మెరుగుపరిస్తే, చంద్రబాబు నెలల తరబడి బకాయిలుపెట్టి అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు.బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ.. అని చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను దుర్మార్గంగా ఎగరగొడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనూ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా.. ఉన్న గ్యారంటీనీ తీసేశారు. ప్రజలకు నష్టంచేసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. -
ఫలించని చర్చలు.. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. గురువారం నుంచి పథకం సేవలను నిలిపి వేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సిద్ధమైంది. బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు కొనసాగించలేమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మిషాకు బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులతో సీఈవో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ప్రస్తుతం రూ.200 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో రూ.300 కోట్లు ఇస్తామని సీఈవో వెల్లడించినట్టు తెలిసింది. ఇలా అరకొర నిధులతో ఆస్పత్రులను నడపలేమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. బకాయిలు రూ.2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆగస్టు 15 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. తొలుత ఈ నెల 10వ తేదీలోగా కొంత మొత్తం విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. రెండు వారాల తర్వాత బుధవారం రాత్రి కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. సేవలు కొనసాగించాలని కోరింది. ఈ మేరకు సీఈవో లక్షిషా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరగా, వారు ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంతో కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూసేందుకు యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులు సమ్మతించారు. మొత్తం బకాయిలు చెల్లించే వరకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేమని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పథకానికి నిధులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం పట్ల ఆస్పత్రుల యాజమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘విదేశీ విద్య’కు నిధి ఏది?
నల్లగొండ జిల్లాకు చెందిన స్వాతి (పేరుమార్చాం) 2019–20 సంవత్సరంలో విద్యానిధి పథకానికి అర్హత సాధించి అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేసింది. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అధికారులను పలుమార్లు సంప్రదిస్తే తొలివిడత సాయం కింద రూ.10 లక్షలు అందాయి. రెండో సంవత్సరం కోర్సు పూర్తి చేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు రెండో విడత సాయం రూ.10 లక్షలు ఇంకా అందలేదు. ఇప్పటివరకు దాదాపు ఇరవైసార్లు బీసీ సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా, ఎప్పుడిస్తారనే దానిపై సరైన సమాధానం రాలేదు.సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్యానిధి బకాయిల చెల్లింపులపై నీలినీడలు కమ్ముకున్నాయి. బకాయిలు రూ.100 కోట్లకు పైగా ఉండగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.80 కోట్లే కేటాయించారు. దీంతో బకాయిల చెల్లింపుల ప్రక్రియ అటకెక్కినట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అర్హత సాధించి విదేశాలకు వెళ్లి కోర్సు పూర్తి చేసినా, ఆ విద్యార్థులకు ఇంకా రెండోవిడత ఆర్థికసాయం అందనే లేదు. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి విద్యానిధి నిధుల విడుదల నెమ్మదించింది. దీంతో బీసీ సంక్షేమశాఖ తనవద్ద ఉన్న నిధుల లభ్యతకు అనుగుణంగా విద్యార్థులకు మొదటివిడత సాయాన్ని అందిస్తూ రాగా... క్రమంగా రెండోవిడత సాయం అందలేదు. కోర్సు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం రెండోవిడత ఇవ్వకపోవడంతో ఆయా విద్యార్థులు దీనిపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది.ఏటా రూ.60 కోట్లు కేటాయిస్తున్నా..విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించే బీసీ పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థి ఉన్నతవిద్య చదివేందుకు ఆర్థికసాయం కింద గరిష్టంగా రూ.20 లక్షలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద 300 మందికి సాయం చేసేలా విద్యార్థుల అర్హతలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే రెండు వాయిదాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం జమ చేసేది. అయితే నాలుగేళ్లుగా ఈ పథకానికి నిధుల విడుదల తగ్గిపోయింది. ఏటా ఈ పథకం కింద రూ.60 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నా, వార్షిక సంవత్సరం పూర్తయ్యే నాటికి నిధుల విడుదల మాత్రం పూర్తిస్థాయి లో జరగడం లేదు. ఫలితంగా బకాయిలు పేరుకుపో యాయి. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయి నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు రూ.100 కోట్లు బకాయిలున్నట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు చెబుతున్నాయి.నిధుల లభ్యతను బట్టి మంజూరు..విద్యానిధి పథకం కింద ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖకు ఏటా రూ.60కోట్లు బడ్జెట్లో కేటాయిస్తుంది. కానీ వార్షిక సంవత్సరం ముగిసే నాటికి కేటాయించిన బడ్జెట్లో అరకొరగానే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో అర్హత సాధించిన విద్యార్థులకు తొలివిడత కింద రూ.10లక్షలు చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్న బీసీ సంక్షేమశాఖ...ఆ తర్వాత రెండోవిడత చెల్లింపులపై చేతులెత్తేసింది. దీంతో ఆ చెల్లింపులు క్రమంగా పేరుకుపోతు న్నాయి. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి చాలామంది విద్యార్థులకు తొలివిడత నిధులు అందగా... 2022–23 విద్యా సంవత్సరం విద్యార్థులకు మాత్రం తొలివిడత నిధులు కూడా అందలేదు. -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి. అదనపు ఖర్చులతో రేటు పెరిగి.. 2017 చివరి నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్‌కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.ట్రాన్స్మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్‌గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి. సరిగా విద్యుత్ సరఫరా లేక.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్‌గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్‌కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి. -
కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత
కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు. ధర్నా వద్దే మమత రాత్రి బస ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్‌వాక్‌కు వెళ్లారు. -
చివరి నెల వేతనం హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ నాలుగింటిలో కోత.. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు. ఇక సీసీఎస్ మాటేమిటి? ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టాప్50 ఎగవేతదారుల బకాయిలు రూ.87 వేల కోట్లు
న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్..ఇరా ఇన్ఫ్రా.. ఆర్ఈఐ ఆగ్రో.. ఏబీజీ షిప్‌యార్డు తదితర టాప్–50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(సంస్థలు) దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.87,295 కోట్ల మేర బకాయి పడ్డారు. ఇందులో టాప్–10 మంది ఎగవేతదారులు రూ.40,825 కోట్ల మేర షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు(ఎస్సీబీ)లకు బకాయి ఉన్నారని కేంద్రం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ఎస్సీబీలు మొత్తం రూ.10,57,326 కోట్ల మేర రుణాలను మాఫీ చేసినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి టాప్–50 ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు ఎస్‌సీబీలకు రూ.87,295 కోట్ల బకాయి పడినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఇందులో పరారైన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ సంస్థ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎస్‌సీబీలకు బకాయి పడింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కలి్పంచే నిబంధన 2007 నుంచే ఉందని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన..2022–23 సంవత్సరాల్లో నమోదైన 66,069 ఆన్లైన్ మోసాల ఘటనల్లో రూ.85.25 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పారు. -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )కు చెందిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్‌లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు మలేషియా అధికారులు. బాకీ తీర్చమంటే... ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA ) సుమారుగా 4 మిలియన్ల డాలర్లు(రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఈ సంస్థ అనేకమార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. ఇదే విమానం రెండోసారి... ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేయగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది. మొత్తం చెల్లించేసాం... మళ్ళీ అదే కథ పునరావృతం కావడంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాం, అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. గతకొంత కాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యింది. -
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్‌పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
ఉద్యోగులకు బకాయిలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల రెగ్యులర్ జీతభత్యాలు, బకాయిలు, ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్య బీమా, ఏపీజీఎల్ఐ రుణాలు, కంప్యూటర్, హౌస్ బిల్డింగ్, కారు, బైక్, విద్య, పండుగ అడ్వాన్సులు, ప్రయాణ భత్యం, తదితరాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రకటించారు. తాను ఈ ప్రకటన చేస్తున్న సమయానికి పింఛనుదారులకు సైతం పెన్షన్ బకాయిలు, ఏపీజీఎల్ఐ తుది చెల్లింపులు, జీఐఎస్, వైద్య ఖర్చుల చెల్లింపులు, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, పారితో ష కాలు, పింఛన్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని వెల్లడించారు. అయితే ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి, డీఏ, సరెండర్ లీవు బకాయిలు కొంత మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే పింఛనుదారుల కరువు భత్యం బకాయిలు కొంత మేర చెల్లించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం సొంత ఆదాయం రూ.98,900 కోట్లు ఉందన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల చెల్లింపులకే దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ఇందులోనే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కూడా కలిసి ఉందన్నారు. 33.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మార్చి 15 నాటికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 33,68,398.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను 6,03,490 మంది రైతులకు రూ.6,834.87 కోట్లు చెల్లించామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం గుంటూరు జిల్లా అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులు నిధులు లేక జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో రూ.268.46 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు. కాగా, ఎస్సీ సబ్ ప్లాన్ కింద 2022–23లో రూ.18,518.29 కేటాయించగా, ఫిబ్రవరి నాటికి రూ.13,112.36 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంలో యాడ్స్ ఖర్చు రూ.449 కోట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పత్రికల్లో ప్రకటనల కోసం రూ.449 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.128.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని ఏజెన్సీల ద్వారా ప్రకటనలు ఇచ్చేవారని.. 15 శాతం కమీషన్లు ఇస్తేనే ఏజెన్సీలు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవన్నారు. తమ ప్రభుత్వం ఆ వృథాను అరికట్టి నేరుగా మంత్రిత్వ శాఖ ద్వారానే ప్రకటనలు ఇస్తోందని తెలిపారు. 31,594 ఎకరాల వక్ఫ్ భూముల ఆక్రమణ రాష్ట్రంలో 65,783.83 ఎకరాల మేర వక్ఫ్ భూములు ఉన్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. అందులో 31,594.20 ఎకరాలు గతంలో వివిధ ప్రభుత్వాల సమయంలో ఆక్రమణల పాలయ్యాయనని చెప్పారు. ఇలా కబ్జాలో ఉన్న వక్ఫ్ భూముల స్వా«దీనానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 580.32 ఎకరాలను ఇప్పటివరకు స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు వ్యయం చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రెండో దశ కింద రూ.1,816.50 కోట్లు కేటాయించామన్నారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో జరిగిన కుంభకోణంపై 2021లో సీఐడీ కేసు నమోదు చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ కూడా చేసిందని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడును స్వాగతించిన మండలి రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడాన్ని శాసనమండలి స్వాగతించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా పీడీఎఫ్ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2023–24లో విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 60.6శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు. నాడు–నేడు కింద 56,572 పాఠశాలలను సుమారు రూ.16వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 25,552 అదనపు గదులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగటున ఏటా 72 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. అది నాడు–నేడు తర్వాత 43 లక్షలు దాటిందని గుర్తు చేశారు. -
ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాకాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్‌లో ఎనీ్టఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు.. ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్‌ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు. 9 మందికి లీగల్ నోటీసులు బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు. చదవండి: ‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు -
Telangana: రైస్ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రాసెస్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతికి సంబంధించిన 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర రైస్ మిల్లర్లు, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురుతో మిల్లర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సీ– ఫారం దాఖలు చేస్తే సీఎస్టీలో 2 శాతం రాయితీని కలి్పంచే విధానం ఉండేది. ఆ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పాడ్డాక మొదట్లో అమలు చేశారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ– ఫారం సబి్మట్ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కలి్పంచడం నిలిపివేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతకాలంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వాపోతున్నారు. బియ్యం ఎగుమతి చేశామా.. లేదా? అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్ సరి్టఫికెట్లు, లారీ, రైల్వే పరి్మట్లు, వే బిల్లులు తదితర ఏ ఆధారమైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్లలో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ఉపాధ్యక్షుడు కర్నాటి రమే‹Ù, సంఘం మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తదితరులు సీఎంను కలిసి వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే రైస్ మిల్లర్లకు, రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని ఆదేశించారు. సీఎస్ ఉత్తర్వులు 2015, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 30 వరకు జరిగిన బియ్యం అమ్మకాల లావాదేవీలపై సీఎస్టీని ఎత్తివేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు అమ్మిన ధాన్యం విషయంలో సీ–ఫారంలు సమరి్పంచకపోయినా, పరి్మట్, లోడింగ్ సర్టిఫికెట్, రవాణా రశీదులు, వే బిల్లుల్లాంటి ఆధారాలను సమరి్పస్తే 2 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రైస్ మిల్లర్స్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిõÙకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీ– ఫారం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
రూ.67,228 కోట్లు ఇక రానట్టే!.. వసూలు కావడం కష్టమేనన్న సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, తనకు రావాల్సిన బకాయిలు రూ.96,609 కోట్లలో రెండొంతులు అయిన రూ.67,228 కోట్లను (2022 మార్చి నాటికి) ఇక ‘వసూళ్లు కావడం కష్టమే’ అనే విభాగం కింద చేర్చింది. వివిధ కంపెనీలపై విధించిన జరిమానాలు చెల్లించకపోవడం, ఫీజుల చెల్లింపుల్లో వైఫల్యం, తన ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవవడం వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం బకాయిల్లో రూ.63,206 కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పీఏసీఎల్, సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించినవి కావడం గమనార్హం. అలాగే, మొత్తం వసూలు కావాల్సిన బకాయిల్లో 70 శాతానికి సమానమైన రూ.68,109 కోట్లు వివిధ కోర్టులు, కోర్టులు నియమించిన కమిటీల విచారణ పరిధిలో ఉన్నట్టు 2021–22 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. అన్ని మార్గాల్లో ప్రయత్నించినా కానీ, రూ.67,228 కోట్లు వసూలయ్యే అవకాశాల్లేవని సెబీ తేల్చింది. -
పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీడియా నివేదికల ప్రకారం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి చెందిన 25 కోట్ల మంది కస్టమర్లు భవిష్యత్తులో భారీ షాకే తగలనుంది. కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో ఈ ముప్పు ఏర్పడింది. ఇండస్ టవర్స్ వొడాఫోన్-ఐడియా హెచ్చరించిన వైనం ఇపుడు సంచలనంగా మారింది. (హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0) విషయం ఏమిటంటే.. టెల్కో వొడాఫోన్ ఐడియా ఇండస్ టవర్స్‌కు దాదాపు రూ. 7000 కోట్లు బకాయిపడింది. వీలైనంత త్వరగాఈ రుణాన్ని చెల్లించకపోతే, నవంబర్ నాటికి టవర్లనుఉపయోగించడాన్ని నిలిపివేస్తామని ఇండస్ టవర్స్ హెచ్చరించింది. ఈ చెల్లింపుల విషయంలో వొడాఫోన్-ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌లను మూసి వేస్తుంది. ఫలితంగా యూజర్లకు కష్టాలు తప్పవు. (Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో!) సోమవారం ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కంపెనీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్బంగా సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిలను గుర్తించింది. దీనిపై ఆందోళన చెందిన డైరెక్టర్లు బకాయిల చెల్లింపుపై లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుత నెలవారీ బకాయిలలో 80 శాతం వెంటనే చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు సూచించినట్లు జాతీయ మీడియా నివేదించింది. నెలవారీ బకాయిల్లో 100 శాతం "సకాలంలో" చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాగా కంపెనీ మొత్తం టవర్ బకాయిలు రూ. 10,000 కోట్లు మించిపోయాయి. ఇందులో కేవలం ఇండస్ టవర్స్‌కే రూ.7,000 కోట్లు రావాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీ (ఏటీసీ)కి రూ.3,000 కోట్లు బకాయి ఉంది. ఇదీ చదవండి: 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే! -
ఏపీ బకాయి పడిందంటూ కేసీఆర్ కొత్త పంచాయితీ.. ఆయన లెక్కలు సరైనవేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త పంచాయితీ పెట్టారు. ఎపి ప్రభుత్వమే తెలంగాణకు రూ.17,828 కోట్లు ఇవ్వాలన్న వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎపి నుంచి విద్యుత్ తీసుకున్నందుకు గాను తెలంగాణ ఇవ్వవలసిన మూడువేల కోట్లు, గత కొన్ని సంవత్సరాలుగా చెల్లించనందుకుగాను వడ్డీ మూడు వేలు , మొత్తం ఆరువేల కోట్లు వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం కేంద్రానికి వినతులు ఇస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చేసిన విజ్ఞప్తిలో కూడా ఈ అంశం ప్రముఖంగా ఉంది. ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఎపికి ఆరువేల కోట్లు రూపాయలు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. కెసిఆర్ దానిని వివాదాస్పదం చేస్తున్నారు. తమకే ఎపి రూ.17,828 కోట్లు ఇవ్వాలని, అందులో నుంచి ఈ ఆరువేల కోట్లు మినహాయించుకుని , మిగిలిన మొత్తం తమకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగానే ఎపి ప్రభుత్వం ఆ మొత్తం ఇవ్వవలసి ఉంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే. కాని ఇంతవరకు ఎన్నడూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి బాకీ ఉన్నట్లు కేంద్రానికి తెలియచేసినట్లు కనిపించదు. కెసిఆర్ ఇదంతా అధికారిక లెక్క అని చెబుతున్నా, అందుకు తగ్గ ప్రాతిపదిక కూడా అవసరమే. అలాకాకుండా ఎపి ప్రభుత్వానికి బాకీ చెల్లించకుండా ఉండడానికి పోటీగా ఈ లెక్కలు చెబితే అంత అర్దవంతంగా ఉండకపోవచ్చు. ఒక వైపు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న కెసిఆర్, తన పొరుగు రాష్ట్రమైన ఎపితోనే సంబంధాలు సజావుగా నడపడం లేదన్న భావన వస్తే అది ఆయనకు రాజకీయంగా నష్టం చేస్తుంది. ఎపి ప్రభుత్వం ఇవ్వవలసినవి అంటూ ఆయన ఇచ్చిన వివరణ లో విద్యుత్ ఉద్యోగుల ట్రస్టు నిధులు ఉన్నాయని, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణ వాటా ఉందని చెప్పారు. తాను ఎక్కువగా మాట్లాడుతున్నాననే ఎపికి ఆరువేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కెసిఆర్ ఆరోపించారు. నిజానికి కేంద్రం ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. ఈ నిర్ణయం చేయడానికి కేంద్రం ఎవరు అని ఆయన ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో తప్పు ఉంటే దానిని ఎత్తిచూపవచ్చు. కాని విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కాని అంశాలను కేంద్రమే చొరవ తీసుకుని సాల్వ్ చేయాలని స్పష్టంగా ఉంది. దానిని కెసిఆర్ విస్మరించలేరు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటా ఎలా వస్తుందో తెలియదు. అది నిజమే అయితే తెలంగాణలో ఉన్న కొన్ని పవర్ ప్లాంట్ లలో తమకు వాటా ఇవ్వాలని ఎపి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న వివిధ సంస్థల ఆస్తులు, బ్యాంకులలో ఉన్న నగదు పంపిణీ చేసుకోవలసి ఉన్నా, ఇంతవరకు అవి ఎటూ తెగడం లేదు. దీనివల్ల ఎపికే ఎక్కువ నష్టం జరుగుతుంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున ఇక్కడి వివిధ సంస్థల ఆస్తులు ఈ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. ఎపి ప్రభుత్వానికి ఆ అవకాశం ఉండదు. వారు తమ వాటా అడగడం తప్ప చేయగలిగింది లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సున్నిత మైన సమస్యలను ముందుగానే పరిష్కరించి విభజన చేసి ఉంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేది. అలాకాకపోవడం వల్ల ఆంద్రకు నష్టం జరిగిందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అలాగే పోలవరం ముంపు మండలాలను ఎపికి కేటాయించడం, సీలేరు హైడల్ ప్రాజెక్టు గురించి కూడా కెసిఆర్ ప్రస్తావించారు. కాని ఆయన ఒక విషయం మర్చిపోతున్నారు. 1956కి ముందు భద్రాచలంతో సహా పోలవరం ముంపు మండల ప్రాంతం అంతా ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. కాకపోతే సదుపాయాల రీత్యా దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారు. అప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం కనుక ఇబ్బంది రాలేదు. కాని విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపధ్యంలో దానిని పూర్తి చేయాలంటే ఈ ముంపు మండలాలు ఎపిలోనే ఉంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించి ఆర్డినెన్స్ జారీచేయించారు. అప్పుడు ఆ పని జరగకపోతే, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మద్య తలెత్తున్న పలు వివాదాలలో అది కూడా ఒకటి అయ్యేది. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడమే కష్టం అయ్యేది. ముందుగా ముంపు మండలాల పరిహారం తదితర సంగతులు తేల్చాలని, అంతవరకు ప్రాజెక్టు ముందుకు తీసుకు వెళ్లడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించి ఉండేదేమో! కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ ఎంతైనా విరుచుకుపడనివ్వండి. కేంద్రంలో బిజెపిని దేవుడు కూడా కాపడలేరని, నాన్ బిజెపి ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పనివ్వండి. మంచిదే. ఆయన ప్రధాని హోదాకు వెళితే తెలంగాణ ప్రజలతో పాటు ఆంద్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కాని ఆ ప్రయత్నంలో ఉన్న తరుణంలో కెసిఆర్ ఇలాంటి తగాదాలు పెట్టుకుంటే ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. ఎపి కి వ్యతిరేకంగా సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ఇక ఇవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎపి, తెలంగాణల మధ్య పలు అంశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కెసిఆర్ పట్ల గౌరవంగా ఉండే వ్యక్తే. అందువల్ల సీనియర్ నేతగా కెసిఆర్ ఇప్పటికైనా చొరవ తీసుకుని ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోగలిగితే మంచి పేరు వస్తుంది. తద్వారా దేశానికి ఒక మంచి సందేశం అందించినవారు అవుతారు. ఒక జాతీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందుతారు. మరి అది కెసిఆర్ చేతిలోనే ఉంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
వేలకోట్ల రుణ భారం, వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016–17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018–19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
ఏజీఆర్ బకాయిలు: వొడాఫోన్ ఐడియాకు ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016-17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018-19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
అంబానీ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం!
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభంలో పడిదివాలా బాటపట్టిన అనిల్ అంబానీకి మరో షాక్ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సిఎల్) ఆస్తులు విక్రయానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాలనుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయని సీఎన్‌బీసీ నివేదించింది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్ తరపున ఈ ప్రక్రియను చూడనున్నాయి. ఆర్సీఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్ రీ కన్స్ట్రక్షన్లో 49శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాతోపాటు సంస్థ ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను అమ్మి బకాయిగా జమ కట్టుకోనుంది. అయితే తాజా పరిణామంపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం చర్యలు తీసుకోవాలని రిజర్వుబ్యాంకును కోరగా, దీన్ని ఆర్బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ : 21 రాష్ట్రాలు కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన జీఎస్టీ లోటు భర్తీకి సంబంధించి 21 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన "ఆప్షన్ 1" ఎంచుకున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జీఎస్టీ ప్రతిపాదించిన రుణాలు తీసుకోవడానికే ఈ రాష్ట్రాలు నిర్ణయించాయి. తద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఒక ప్రత్యేక విండో కింద రుణాల ద్వారా 97,000 కోట్ల అంచనా లోటును అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అందించిన సమచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న వాటిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాండిచేరి ఒకటి కావడం విశేషం. ఇంకా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇతర కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపాయి. అలాగే మిగిలిన రాష్ట్రాలు అక్టోబరు 5న జరగనున్న కౌన్సిల్ సమావేశాని కంటే ముందు తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే బకాయిల కోసం జూన్, 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.('జీఎస్టీ రుణాల్ని కేంద్రమే చెల్లిస్తుంది') కాగా జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించామనీ, ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాలు పొందడం రెండో ఆప్షన్ గా పేర్కొన్నారు. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుందని, కానీ వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంద న్నారు. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చనీ, 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూలంకుషంగా చర్చించామనీ ఆమె తెలిపారు. రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చామని ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్
న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయనిచ్చిన రూ. 1,200 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుకి సంబంధించిన మొత్తాన్ని రికవర్ చేసుకునే దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలంటూ అనిల్ అంబానీని ట్రిబ్యునల్ ఆదేశించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) తీసుకున్న రుణాలకు గాను అనిల్ అంబానీ ఈ వ్యక్తిగత పూచీకత్తునిచ్చినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా తగు సమాధానాలను అంబానీ దాఖలు చేస్తారని వివరించారు. 3 చైనా బ్యాంకులకు చెల్లించాల్సిన 717 మిలియన్ డాలర్ల బాకీలను రుణ ఒప్పందం ప్రకారం 21 రోజుల్లోగా కట్టేయమంటూ గత నెలలో బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సిందేనని లండన్‌లోని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్ట్ స్పష్టం చేసింది. -
ఎప్పట్లోగా కడతారో చెప్పండి..
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించిన (ఏజీఆర్) బకాయీలను ఎప్పట్లోగా, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక సమర్పించాలంటూ టెలికం సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే పూచీకత్తులు కూడా ఇవ్వాలని సూచించింది. టెల్కోలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బాకీలు కట్టేందుకు టెల్కోలకు 20 ఏళ్ల గడువు ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 1999 నుంచి కేసు నలుగుతోందని.. ఈ 20 ఏళ్లలో బాకీలు కట్టనప్పుడు మరో 20 ఏళ్లలో కట్టేస్తారనడానికి గ్యారంటీ ఏమిటని టెల్కోలను ప్రశ్నించింది. వాయిదాల పద్ధతిలో కట్టుకోవడానికి కోర్టు అనుమతించే పరిస్థితి లేదని.. బ్యాంక్ గ్యారంటీలివ్వడానికి టెల్కోలు, వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి ఆయా సంస్థల డైరెక్టర్లు గానీ సిద్ధంగా ఉన్నారేమో తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. సవరించిన ఆదాయాల ఫార్ములా ప్రకారం టెల్కోలు బాకీలు కట్టేలా సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. టెలికం శాఖ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ. 16,798 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, టెల్కోలు తమ బాకీలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నాయి. స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే కొంత కట్టాయి. ఇది పోగా మిగతా రూ. 93,520 కోట్ల ఏజీఆర్ బాకీలను టెల్కోలు కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినిచ్చేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. స్పెక్ట్రమే గ్యారంటీ..: వొడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విచారణ సందర్భంగా ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. టెలికం సంస్థలు వేల కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం, లైసెన్సులనే ప్రభుత్వం గ్యారంటీగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ టెల్కోలు బాకీలు కట్టకపోతే వీటిని రద్దు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే 70% కట్టేశామని, ప్రభుత్వంతో సంప్రతించాకా మిగతాది కూడా కట్టేస్తామని భారతి ఎయిర్టెల్ తెలియజేసింది. పీఎస్యూలపై ఆ బాదుడేంటి.. ఇక ఏజీఆర్ బాకీలపై గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నుంచి రూ. 4 లక్షల కోట్ల బాకీలు రాబట్టేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పీఎస్‌యూలనుంచి బాకీలు రాబట్టేందుకు తమ ఉత్తర్వును ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదని పేర్కొంది. ‘ఈ డిమాండ్ నోటీసులను వెనక్కి తీసుకోండి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఏజీఆర్ బాకీలపై సుప్రీం ఆదేశాల ప్రకారం.. స్పెక్ట్రం, లైసెన్సులున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా మొదలైన పీఎస్‌యూలు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ లెక్కేసింది. దీనిపై ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. -
బకాయిలు చెల్లించండి
సినీ పరిశ్రమకు చెందిన దినసరి వేతనాలు అందుకునే సాంకేతిక నిపుణులు, నటీనటులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను నిర్మాతలు చెల్లించాలని ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (ఐఎమ్పీపీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘షూటింగ్స్ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెండింగ్ వేతనాలు అందక దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో నిర్మాతలు కూడా కష్టాల్లోనే ఉన్నారు. అది అర్థం చేసుకోగలం. కానీ మానవీయ కోణంలో నిర్మాతలు ఆలోచించి బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించాలని కోరుతున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో వారు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి వీలవుతుంది’’ అని ఐఎమ్పీపీఏ పేర్కొంది. -
మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్లో ఐఎన్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్ మీడియా వాటా’ అని వివరించింది. -
కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
కరోనా సంక్షోభ సమయంలోనైనా తన మొర ఆలకించాలని వేలకోట్ల రుణాలను ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ప్రభుత్వాన్ని కోరారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లించాలన్న తన కోరికను మన్నించాలంటూ మాల్యా మంగళవారం ట్విటర్ ద్వారా వేడుకున్నారు. ఇక నైనా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని పదే పదే చెబుతూ వస్తున్నా.. అయినా బ్యాంకులు సిద్ధంగా లేవు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్ మెంట్లను విడుదల చేయడానికి ఈడీ కూడా సిద్ధంగా లేదంటూ వరుస ట్వీట్లలో వాపోయారు. కరోనా మహమ్మారితో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలోనైనా జోక్యం చేసుకోవాలని ఆర్ధిక మంత్రిని కోరారు. అలాగే కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్డౌన్ ను గౌరవిస్తున్నామని మాల్యా తెలిపారు. కింగ్ ఫిషర్ లో అన్ని కార్యకలాపాలను, తయారీని సమర్థవంతంగా నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా విజయ్ మాల్యా సూచించారు. తాను కూడా అదే చేస్తున్నానని ట్వీట్ చేశారు. I have made repeated offers to pay 100 % of the amount borrowed by KFA to the Banks. Neither are Banks willing to take money and neither is the ED willing to release their attachments which they did at the behest of the Banks. I wish the FM would listen in this time of crisis. — Vijay Mallya (@TheVijayMallya) March 31, 2020 -
కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్ల పైగా కట్టాలని డాట్ చెబుతోంది. మరోవైపు, వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కంపెనీని నిలబెట్టేందుకు తోడ్పాటు అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బాకీలు కట్టలేం బాబోయ్..!
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు తాజాగా ఏజీఆర్ బాకీలు మరింత భారంగా మారాయి. దీంతో ప్రస్తుతం ఏజీఆర్ బకాయిలను కట్టే పరిస్థితుల్లో లేమని కేంద్ర సమాచార శాఖకు కంపెనీ లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న టెలికం రంగంలో కనీస చార్జీ విధానం అమలుకు అనుమతించడంతో పాటు సుంకాలు తగ్గించాలని, విడతలవారీగా బాకీలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరింది. ప్రభుత్వం నుంచి రావల్సిన జీఎస్టీ క్రెడిట్‌ను సర్దుబాటు చేస్తే .. ఏజీఆర్ చెల్లింపులపరంగా కొంత తోడ్పాటు లభించగలదని వివరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కలకు అనుగుణంగా టెలికం శాఖ అంచనాల ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు పైగా కట్టాల్సి ఉంది. ఇందులో ఇప్పటిదాకా 7 శాతం మాత్రమే కట్టింది. సుమారు 30 కోట్ల పైగా యూజర్లు, 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని వొడాఫోన్ ఐడియా కోరింది. మూడేళ్ల మారటోరియం.. కేంద్రం దగ్గరున్న సుమారు రూ. 8,000 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను బాకీల కింద సెటాఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే స్వీయ మదింపు ప్రకారం తాము కట్టాల్సిన మిగతా మొత్తాన్ని చెల్లించగలమని వొడాఫోన్ ఐడియా తెలిపింది. వడ్డీ, పెనాల్టీ చెల్లింపుపై మూడేళ్ల మారటోరియం విధించాలని, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు 15 ఏళ్ల గడువు ఇవ్వాలని, ఆరు శాతం రేటు చొప్పున వడ్డీ విధించాలని కోరింది. అలాగే లైసెన్సు ఫీజును ప్రస్తుతమున్న ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను (ఎస్‌యూసీ) సున్నా స్థాయికి లేదా అన్ని రకాల స్పెక్ట్రంనకు ఒకే విధంగా ఒక్క శాతం రేటును వర్తింపచేయాలని విజ్ఞప్తి చేసింది. డేటా కనీస చార్జీలను రూ. 35కు పెంచాలి.. పోటీ ఎదుర్కొనేందుకు తప్పనిసరై చౌక టారిఫ్‌లు అమలు చేస్తుండటమే తమ ప్రస్తుత దుస్థితికి కారణమని, తక్షణం కనీస చార్జీల విధానాన్ని తక్షణం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది. మొబైల్ డేటా 1 జీబీకి కనీస టారిఫ్ రూ. 35గా నిర్ణయించాలని, అలాగే నెలవారీ కనీస కనెక్షన్ చార్జీలను రూ.50కి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మొబైల్ డేటా ఖరీదు ప్రతీ జీబీకి రూ. 4–5 శ్రేణిలో ఉంటోంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా విజ్ఞప్తుల అమలు కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చార్జీలను 50 శాతం దాకా ఇటీవలే పెంచిన వొడాఫోన్ ఐడియా.. మూడు నెలలు కూడా గడవకముందే మళ్లీ కాల్, ఇంటర్నెట్ రేట్లను పెంచాలంటూ కోరుతుండటం గమనార్హం. సీవోఏఐ కూడా అదే బాటలో.. బాకీల చెల్లింపు విషయంలో నిబంధనలను సడలించాలని, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూడాలని, కనీస చార్జీల విధానాన్ని సత్వరం అమలు చేయాలంటూ సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కూడా కూడా కేంద్రాన్ని కోరింది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని, టెలికం రంగానికి ప్రభుత్వం దన్నుగా ఉంటుందని కేంద్రం భరోసానివ్వాలని విజ్ఞప్తి చేసింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కి సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఈ మేరకు లేఖ రాశారు. లైసెన్సు ఫీజులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలిచ్చే విధానాన్ని తొలగించాలని, ఒకవేళ వీలు కాని పక్షంలో గ్యారంటీ మొత్తాన్ని.. లైసెన్సు ఫీజులో పావు శాతానికైనా తగ్గించాలని సీవోఏఐ కోరింది. ఏజీఆర్ బాకీల కింద మొత్తం 15 టెల్కోలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. నేడు డీసీసీ సమావేశం.. సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి తోడ్పాటునిచ్చే చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) నేడు (శుక్రవారం) సమావేశం కానున్నట్లు సమాచారం. విడతలవారీగా చెల్లించే అవకాశం కల్పించడంతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఇందులో చర్చకు రావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు అదనంగా కట్టే దాన్ని బట్టి ఊరట చర్యలు ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. -
టెలికం మంత్రితో టాటా సన్స్ చంద్రశేఖరన్ భేటీ
న్యూఢిల్లీ: టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టెలికం శాఖ మదింపు ప్రకారం గతంలో టాటా గ్రూపు అందించిన టెలికం సేవలపై బకాయిలు రూ.14,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, టాటా గ్రూపు రూ.2,197 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. వాస్తవ బకాయిలు ఈ మేరకేనని స్పష్టం చేసింది. దీంతో టాటా మదింపును ప్రశ్నిస్తూ.. పూర్తి బకాయిల చెల్లింపును కోరుతూ టెలికం శాఖ మరో నోటీసును జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికం మంత్రితో చంద్రశేఖరన్ భేటీ కావడం ప్రాధాన్యం నెలకొంది. 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రశేఖరన్ స్పందించకుండానే వెళ్లిపోయారు. చదవండి : టెలికంలో అసాధారణ సంక్షోభం వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్ ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
టెలికంలో అసాధారణ సంక్షోభం..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు. మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్ ఏజీఆర్ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది. ఏజీఆర్ లెక్కల మదింపులో కేంద్రం.. ఇక ఏజీఆర్ బాకీలు డాట్ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్ చెక్ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి.. ఏజీఆర్ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు. టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం.. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్టెల్ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్ రూ. 2,321 కోట్లు, టెలినార్ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 614 కోట్లు, ఎంటీఎన్ఎల్ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది. -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్
సాక్షి, న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంస్థ తాజాగా మరో దఫా చెల్లింపులు చేసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్ ఐడియా రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి మరో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్టెల్ రూ.10వేల కోట్లన ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే టాటా టెలిసర్వీసెస్ మొత్తం రూ.14వే కోట్లు చెల్లించాల్సి ఉండగా, సోమవారం రూ.2,197 కోట్లను చెల్లించింది. మరోవైపు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి బకాయిల రికవరీ కోసం టాటా టెలిసర్వీస్‌కు నోటీసులు కూడా పంపుతామని డిఓటి వర్గాలు తెలిపాయని పీటీఐ తెలిపింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా షేర్లు 18.85 శాతం పెరిగి బిఎస్ఇలో రూ .4.98 ను తాకింది. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
చెల్లించాల్సింది రూ.25–30 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25–30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు 150–180 మంది క్లయింట్ల బకాయిలని తెలియజేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ నుంచి రియల్ ఎస్టేట్ విభాగానికి నిధులు మళ్లాయన్న ఎన్ఎస్ఈ ఆరోపణల నేపథ్యంలో.. గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీ కేఎస్‌బీఎల్ కాబట్టే దాన్నుంచి నిధులు బదలాయించినట్లు చెప్పారు. పలు అనుబంధ కంపెనీల్లో కేఎస్‌బీఎల్ పెట్టుబడులున్నాయని గుర్తు చేశారు. కంపెనీ వాదన వినకుండానే సెబీ ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ... దీనిపై సెబీని సంప్రతిస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్, దాని అనుబంధ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని పేర్కొంది. సీవోఏఐ బ్లాక్మెయిల్... ‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. భారత మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్ భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్మెంట్కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్ తెలిపింది. ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది. -
ఇదేం తీరు?
సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారుపై ఆర్థిక భారం దండిగానే ఉంటోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. నీటి వనరుల మరమ్మతు... ఆధునికీకరణవంటి పనులకు ఆసరాగా నిలుస్తుందని నిర్దేశించిన నీటితీరువా వసూలుపై అధికారులు నిర్లక్ష్యధోరణి చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 30కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేస్తే కాస్తయినా ప్రభుత్వానికి తోడ్పాటునందించినట్టే. సాక్షి, విజయనగరం గంటస్తంభం: నీటి తీరువా బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. కోట్లాది రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉన్నా... వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపడంలేదు. అంత మొత్తం ఒకేసారి వసూలు చేయకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా దశల వారీగానైనా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి తిరిగి నీటి వనరులు బాగు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మరచి అధికారులు వసూలుపై దృష్టిసారించపోవడం విశేషం. సాగునీటి వనరుల నుంచి నీటిని పంటలకు వినియోగించుకునేందుకు రైతులు ఏటా నీటి తీరువా(పన్ను) చెల్లించాల్సి ఉంది. శాశ్వత సాగునీటి వనరులైన ప్రాజెక్టుల కింద ఏడాదికి ఎకరాకు రూ.200లు, సాధారణ సాగునీటి వనరులైన చెరువులు, కాలువ కింద ఎకరాకు రూ.100లు పన్నుగా చెల్లించాలి. ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పన్ను వసూలు చేస్తుంటారు. పేరుకుపోయిన బాకాయిలు.. నీటి తీరువా వసూలుపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. పంటలు పండని ఏడాది మానేసి పండిన ఏడాది తప్పక వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో నాలుగు మండలాలు, రబీలో 25మండలాల్లో కరువు ఉండగా మిగతా మండలాల్లో పంటలు పండాయి. అంతకుముందు ఏడాది జిల్లాలో కాస్తా దిగుబడి తగ్గినా పంటలు మాత్రం బాగానే పండాయి. కానీ అధికారులు నీటితీరువా సకా లంలో వసూలుకు వెళ్లక బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.30.74 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అందులో రూ.28.10కోట్లు గతేడాది వరకు వసూలు కాని బకాయిలే. ఈ ఏడాది రూ.2.63కోట్లు టార్గెట్ ఇచ్చారు. పాత బకాయిలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఒకే ఏడాది వసూలు చేయాల్సి వస్తోంది. వసూలు అంతంతమాత్రమే.. రైతుల నుంచి అంత మొత్తం వసూలు చేయడం కష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో కేవలం రూ.10.81 లక్షలు మాత్రమే వసూలైంది. కోట్లాది రూపాయిలు బకాయిలుండగా వసూలు నామమాత్రంగా ఉండటం ఆలో చించదగ్గ విషయం. జిల్లాలో గతంలో కూడా పెద్దగా వసూలు చేసిన సందర్భం లేదు. నోట్లు రద్దు చేసిన సంవత్స రం మాత్రం జిల్లాలో రూ. 1.80కోట్లు వసూలు జరిగింది. ఆ తర్వాతగానీ, ముందుగానీ రూ.కోటి దాటి లేదు. గతేడాది ఆ మాత్రం కూడా వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతగా ప్రయత్నించినా మరో రూ.2కోట్లు వరకు వసూలవుతుందని అధికారుల అంచనా. వసూలుపై దృష్టిసారించని అధికారులు.. జిల్లాలో బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నా వసూలు విషయం మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వసూలు చేయాలంటే ముందుగా జమాబందీ జరిగి పన్ను నిర్ణయించాలి. తర్వాత వసూలుకు వీఆర్వోలు వెళ్లాలి. కానీ జమాబందీ ప్రక్రియ జిల్లాలో మొక్కుబడిగా జరుగుతోంది. ఇక వసూలు విషయమే అధికారులు మరిచిపోయా రు. గత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రంగా వసూలు చేసిన అధికారులు ఈ ఏడాది పూర్తిగా దృష్టిసారించలేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడిచినా రూ.30కోట్లు లక్ష్యంలో కేవలం రూ.10.81లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 0.4 శాతం మాత్రమే. నీటి తీరువా వసూలు ఇంత ఘోరంగా ఉన్నా ఒక్క అధికారీ దీనిపై పట్టించుకోవడం లేదు. వాస్తవానికి నీటి తీరువా ద్వారా వచ్చిన ని ధులను ప్రభుత్వం తిరిగి సాగునీటి వనరుల అభివృద్ధికి వెచ్చిస్తుంది. దీని వల్ల రైతులకే లబ్ధి కలుగుతుంది. కానీ అధికారులు వసూలు చేయకపోవడం వల్ల ఈ భారం ప్రభుత్వంపై పడి నీటి వనరుల అధునికీకరణ, మరమ్మతులకు నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఎన్నికల వల్ల ఆలస్యమైంది.. నీటి తీరువా వసూలు రెగ్యులర్‌గా జరుగుతుంది. ప్రతి ఏడాది వందశాతం రైతులు చెల్లించరు. అందువల్ల కొంత బకాయి ఉండడం సహజం. గతేడాది వరకు బకాయిలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవి. ఈ ఏడాది వసూలు తక్కువగానే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మొదట్లో ఆలస్యమైంది. తర్వాత వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు ఇతర పనులపై బీజీగా ఉన్నారు. నీటితీరువా వసూలుపై దృష్టిపెట్టాం. సమావేశం ఏర్పాటు చేసి డ్రైవ్ తీసుకునేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – బి.శ్రీకాంత్, సెక్షన్ పర్యవేక్షకులు, కలెక్టరేట్ -
ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు. -
‘ఫీజు’లపై ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఫీజు గండం వచ్చిపడింది. ప్రభు త్వం నిధులు విడుదల ఉత్తర్వులిస్తున్నా, సంక్షేమశాఖలు కేటగిరీలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఆమోదించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. వేతనాలు, డైట్ చార్జీలు మినహా మిగతా బిల్లులను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో 2017–18 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్థులు కాలేజీలను వీడినప్పటికీ ఫీజు చెల్లించని కారణంగా వారి ధ్రువ పత్రాలను యాజమాన్యాలు ఇవ్వడంలేదు. 2017– 18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.04 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2018 ఫిబ్రవరి రెండో వారం వరకు కొనసాగింది. వాటి పరిశీలన గతేడాది జూన్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకూ కొనసాగింది. ఈ క్రమంలో పూర్తయిన దరఖాస్తుల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఖజానాశాఖకు సమర్పిస్తూ వచ్చారు. కానీ ఖజానాశాఖలో ఆ బిల్లుల ఆమోదం ప్రహసనంగా మారింది. పలు రకాల ఆంక్షలను పేర్కొంటూ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన బిల్లులను అటకెక్కిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగుల వేతనాలు, డైట్ చార్జీల బిల్లులు మినహా మిగతా చెల్లింపులు జరగలేదు. జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మరోమారు చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉద్యోగుల వేతన బిల్లులనే ఆమోదిస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఫీజుల చెల్లింపు నిలిచిపోయింది. 2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు- రూ.13,04,431 ఉపకార వేతనాలు, ఫీజులకు అవసరమైన నిధులు- రూ.2,315 కోట్లు ఇప్పటివరకు విద్యార్థులకు విడుదల చేసినవి- రూ.1,075 కోట్లు బకాయిలు రూ. 1,240 కోట్లు ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖాధికారులు ఖజనాశాఖకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు మెజారిటీ విద్యార్థులకు ఫీజులు మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు, ఉపకార వేతనాల కింద రూ. 2,315 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 1,075 కోట్లకు సంబంధించిన బిల్లలనే ఖజానాశాఖ ఆమోదించడంతో ఆ మేరకు విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. ఇంకా రూ. 1,240 కోట్ల మేర విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లులు ఖజానాశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఖజానాశాఖపై ఆంక్షలు తొలగితే తప్ప వాటి విడుదల సులభతరం కాదని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు... కేటగిరీ ఫ్రెషర్స్ రెన్యువల్స్ మొత్తం ఎస్సీ 98,180 1,31,706 2,29,886 ఎస్టీ 55,829 76,215 1,32,044 బీసీ 3,05,215 4,17,462 7,22,677 డిజేబుల్ 84 117 201 ఈబీసీ 26,933 58,913 85,846 మైనారిటీ 65,700 68,077 1,33,777 ఈ ఏడాది విద్యార్థులకు చెల్లింపులు కష్టమే...! ప్రస్తుతం 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గతేడాది అక్టొబర్ నాటికే దరఖాస్తుల గడువు ముగియగా అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో తొలుత డిసెంబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి నెలాఖరు వరకు గడువు పొడిగించిన అధికారులు... విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఈ నెలాఖరు వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఫ్రెషర్స్ 5.81 లక్షలు, రెన్యువల్ విద్యార్థులు 7.18 లక్షల మంది ఉన్నారు. సంక్షేమశాఖలు ఒక పక్క దరఖాస్తులు స్వీకరిస్తూనే మరోపక్క వాటి పరిశీలన ప్రారంభించాయి. ఇప్పటివరకు లక్ష మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 70 వేల వరకు మంజూరు చేశారు. అయితే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో 2018–19 చెల్లింపులను ఇప్పట్లో చేసే అవకాశం కనిపించడం లేదు. 2018–19 విద్యా సంవత్సరం దరఖాస్తులు (ఇప్పటివరకు)... కేటగిరీ దరఖాస్తులు ఎస్సీ 2,32,442 ఎస్టీ 1,30,749 బీసీ 7,17,246 డిజేబుల్ 227 ఈబీసీ 83,464 మైనారిటీ 1,36,498 నిధులు విడుదల చేయాలి... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నెలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నెలనెలా నిధులిస్తే చెల్లింపులు సులభతరమయ్యేవి. కానీ మొదట్లో ఇచ్చినా ఆ తర్వాత చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. ఖజానశాఖపై ఆంక్షలు పెట్టడంతో బిల్లులను ఆమోదించట్లేదు. ఫలితంగా సిబ్బంది వేతనాల చెల్లింపు, కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా నెలవారీ నిబంధన ప్రకారం నిధులు విడుదల చేయాలి. – గౌరి సతీశ్, తెలంగాణ కళాశాలల యాజమాన్యాల జేఏసీ కన్వీనర్ -
అంబానీకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పందన కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం అంబానీ, ఇతరులను ఆదేశించింది. అయితే బకాయి కింద రూ.118కోట్లను అంగీకరించాల్సిందిగా ఆర్‌కాం తరపున వాదించిన న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహతగి కోర్టును కోరారు. అయితే ఎరిక్‌సన్‌దీనికి ససేమిరా అంది. మొత్తం బకాయిని డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో కోర్టు రిజిస్ట్రీలో రూ. 118 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను డిపాజిట్ చేయాల్సింగా ఆర్‌కాంను కోరింది. అలాగే రిలయన్స్ జియోతో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఆర్‌కాంకు నారిమన్ సూచించారు. పరస్పరం సమస్యను పరిష్కరించుకోని పక్షంతో తామేమి చేయలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్‌కాం కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే ముందస్తు బకాయిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో, ఆర్‌కాంకు ఫిజికల్ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇటీవల ఆర్‌కాంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీని అరెస్టు చేయాలని, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది. బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ తన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం: ఇద్దరు టాప్ హీరోయిన్లు
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించిన వార్తల్లోకి తాజాగా బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, బిపాసా వచ్చి చేరారు. ఇప్పటివరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు ఈ స్కాంలో మారు మోగితే.. ఇపుడు ఈ కోవలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, బ్యూటీ క్వీన్ బిపాసా నిలిచారు. రూ.11, 400 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ తమకు సొమ్ము ఎగ్గొట్టాడంటూ ఆరోపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గీతాంజలి జెమ్స్ కంపెనీ ఒప్పందంలో భాగంగా తమ రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని, భారీ ఎత్తున బకాయి పడిందని కంగనా ఆరోపించారు.. గీతాంజలి బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంగనా ఒప్పందం ప్రకారం పూర్తి సొమ్ము చెల్లించలేదని ఆరోపించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. 2016నుంచి ఈ బకాయిలు చెల్లించలేదని కంగనా తెలిపింది. కాగా కంగనాకంటే ముందు ఈ కంపెనీకి ఐశ్వర్య, కత్రినా కైఫ్ ప్రచారకర్తలుగా ఉన్నారు. మరోవైపు గీతాంజలికే చెందిన మరో బ్రాండ్ గిలికు అంబాసిడర్‌గా ఉన్న బిపాసా కూడా మెహుల్ చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. 2008లో కాంట్రాక్టు ముగిసిన తరువాత తన ఫోటోలను వార్తాపత్రికల్లో వాడుకున్నారని బిపాసా ఆరోపించారు. ఈ విషయంలో తన మేనేజర్ కంపెనీని సంప్రదించినప్పటికి ప్రయెజనం లేదన్నారు. దీని మూలంగా అనేక జ్యుయలరీ ఎండార్స్మెంట్లను తాను కోల్పోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్ ప్రచార కర్తగా ఉన్నారు. కాగా కుంభకోణం నేపథ్యంలో గత ఏడాది ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రియాంక చోప్రా నీరవ్‌మోదీ డైమండ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రియాకంతో పాటు ప్రకటనల్లో కనిపించిన మరో నటుడు సిద్దార్థ మల్హోత్రా కంపెనీతో తన కాంట్రాక్టు గత ఏడాదే ముగిసినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
బకాయిలను త్వరగా జమ చేయండి
– డీసీ గాయత్రిదేవి కర్నూలు(న్యూసిటీ): దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెల్లించ వలసిన సర్వశ్రేయోనిధి ఫండ్(సీజీఎఫ్), అర్చక వెల్ఫేర్ ఫండ్ బకాయిలను వెంటనే జమ చేయాలని ఆ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రిదేవి కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. శనివారం పాతబస్టాండ్‌లోని నగరేశ్వరస్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రిదేవి మాట్లాడుతూ.. 6ఎ, 6బి గ్రూపు పరిధిలోని దేవాలయాల్లో సర్వశ్రేయోనిధి ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్, ఇఎఎఫ్ ఫండ్ ఎంత వసూలు అయిందని కార్యనిర్వహణాధికారులను ప్రశ్నించారు. కమిషనర్ వై.వి.అనురాధ ఆదేశాల ప్రకారం సీజీఎఫ్, అర్చక వెల్ఫేర్ ఫండ్ బకాయిలను దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు. మిగిలిన నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నారు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్లు పాండురంగారెడ్డి, తిరుమలరెడ్డి, సహాయ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుధాకర్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారులు ఎస్.సత్యనారాయణ, ఎం.రామాంజనేయులు, శోభ, స్వర్ణముఖి, డి.ఆర్.కె.వి.ప్రసాద్, గుర్రొడ్డి, తిమ్మనాయుడు, సుబ్రహ్మణ్యేశ్వర నాయుడు, ఉరుకుంద ఈరన్న, దేవస్థానం సూపరింటెండెంట్ మల్లికార్జున, ఇన్స్పెక్టర్లు హరిచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులివ్వండి మహాప్రభో..
►నాలుగు నెలలుగా నిర్వాహకులకు అందని గౌరవ వేతనం ►రెండు నెలలుగా పెండింగ్‌లో భోజన బిల్లులు ఎల్లారెడ్డిపేట: బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణకు నిధులు కరువయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 64ప్రభుత్వ పాఠశాలల్లో 132మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం తయారు చేసిపెడుతున్నారు. ఈపథకం ద్వారా సుమారు 6280మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వంట నిర్వాహకులకు ప్రతీనెల ప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. ఇప్పటివరకు ఆరు నెలలుగా గౌరవ వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసిపెడుతున్నారు. పేరుకుపోయిన రూ.5.28లక్షల వేతనాలు మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకులు మరోపని చేసుకోకుండా దీనిపైనే ఆధారపడగా నాలుగు నెలలుగా వేతనాలు అందక పూటగడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 132మంది నిర్వాహకులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నాలుగు నెలలకు సంబంధించి రూ.5.28లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. రూ. 4.50లక్షల మధ్యాహ్న భోజన బకాయిలు 64పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు కొనసాగుతుండగా డిసెంబరు వరకు రెండు నెలల భోజన బిల్లులు రాలేదు. ఇప్పటి వరకు రూ.4.50లక్షల బకాయిలు ఉండగా వారు అప్పులు చేసి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి విద్యార్థులకు వండిపెడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న బిల్లులతో పాటు నిర్వాహకుల వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఆశతో ఉన్నాం నాలుగు నెలలుగా నిర్వాహకులకు గౌరవ వేతనం అందడం లేదు. రెండు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రాక కిరాణ దుకాణాల్లో అప్పులు చేస్తున్నాం. ఇంకో పని చేసుకోలేక మధ్యాహ్న భోజనాన్ని నమ్ముకొని అప్పుల పాలవుతున్నాం. గౌరవ వేతనం, భోజన బిల్లులు చెల్లించి మమ్మల్ని ముందుకు నడుపాలి. – పోతుల లక్ష్మి, నిర్వాహకురాలు, ఎల్లారెడ్డిపేట బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమచేస్తాం బడ్జెట్ రాగానే గౌరవ వేతనాన్ని నిర్వాహకుల ఖాతాల్లో జమచేస్తాం. నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. గౌరవ వేతనం, మధ్యాహ్న బిల్లుల బకాయిలపై ప్రతిపాదనలు పంపాం. డబ్బులు రాగానే అందరికి పంపిణీ చేస్తాం. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట -
నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ హైదరాబాద్: ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల నవంబర్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని బీజేవైఎం కార్యకర్తలకు, విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువకుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో వారి హక్కులనే కాలరాచే విధంగా సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెబుతూ కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది లేరని, రేషనలైజేషన్ పేరుతో దాదాపు 450 పాఠశాలలను మూసివేశారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఫీజు బకారుులు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు, రెండు లక్షల యాభై వేలమంది లెక్చరర్లు, సిబ్బంది, 3 వేల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆర్థికభారం పేరుతో రీరుుంబర్స్‌మెంటు పథకాన్ని నీరుగార్చడం తగదని సూచించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని, విద్యార్థుల ఫీజు బకారుులు చెల్లించడానికి సీఎంకు చేతులు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి వస్తున్న వివిధ రకాల నిధులు, స్కాలర్షిప్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన పేదలకు ఉన్నత విద్య అవకాశాలు అందించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారని, దీనితో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారయ్యారని అన్నారు. బకారుులను చెల్లించి బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, మహిపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, ప్రధానకార్యదర్శి భరత్‌గౌడ్ పాల్గొన్నారు. -
సహారా ఆస్తుల విక్రయానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ ఆస్తులను విక్రయించాలన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల మేరకు రంగం సిద్ధమైంది. సహారా అధిపతి సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి మాండేటరీ ఆదేశాలను సుప్రీం జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహారా ఆస్తుల ఆన్లైన్లో వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంలో హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)కు సెబీ నియమించింది. దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించాయి. హెచ్డీఎఫ్సీ రియాల్టీ 31 ఆస్తులను వేలం వేయనుండగా, మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు రూ.2,400 కోట్ల ధర పలకొచ్చని అంచనా. అటు ఎస్బీఐ కాపిటల్స్ మార్కెట్స్ మరో కొన్ని ఆస్తులను వేలం వేయనుండగా, వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే మొత్తం రూ.6,500 కోట్ల ఆస్తులను వేలం వేయనున్నారు. దేశంలోని పలు నగరాల్లోని ప్లాట్లు, వ్యవసాయ, నివాసిత, వాణిజ్య-పారిశ్రామిక భూములు వంటివి ఈ ఆస్తుల్లో ఉన్నాయి. ప్లాట్లను ఆన్లైన్ ద్వారా వేలం వేసే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మరోవైపు ఇది భారీ అమ్మకమని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నాన్నారు. దేశంలో 30 నగరాల్లో విస్తరించి ఉన్న 87 రకాల ఆస్తులను విక్రయానికి రంగం సిద్దమైందన్నారు. దీనికి సంబంధించిన బ్యాంకు ప్రకటన త్వరలోనే వార్తాపత్రికలలో రావచ్చని సమాచారం. అయితే ఈ విక్రయంలో విదేశాల్లోని మూడు ప్రముఖ హెటెళ్లు, ప్రముఖ ఆంబీ వాలీ రిసార్ట్ ,ముంబైలోని సహారా స్టార్ హెటల్ ను మినహాయించారు. కాగా ఆర్ధిక నేరాల ఆరోపణలతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) మార్చి 4 , 2014నుంచీ తీహార్ జైల్లో ఉన్నారు. రాయ్‌కి బెయిల్ మంజూరు చేయాలంటే రూ.5 వేల కోట్ల నగదు, అంతేమొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని, ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.36 వేల కోట్లను పూర్తిగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. ఇటీవల ఆయన తల్లి అంత్యక్రియల నిమిత్తం మే 6 న నాలుగు వారాల బెయిల్ (పెరోల్) మంజూరైన సంగతి తెలిసిందే. -
బకాయిలు చెల్లించకుంటే 'ఆరోగ్య శ్రీ' నిలిపేస్తాం
హైదరాబాద్ : మే 1వ తేదీలోగా రావాల్సిన బకాయిలను చెల్లించకుంటే.. మే 2 నుంచి ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశ్రీ కి సంబంధించిన బకాయిలు రూ. 200 కోట్లను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని అందులో పేర్కొన్నారు. -
మాల్యా.. బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకో!
న్యూఢిల్లీ: ''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాలాంటి ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు. బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్ పారిపోయే ముందు... అతని గ్రూప్ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జైట్తీ తెలిపారు. -
మున్సిపాలిటీ భవనానికి కరెంట్ కట్!
సిరిసిల్ల (కరీంనగర్) : బిల్లులు చెల్లించడం లేదంటూ విద్యుత్ సరఫరాలు నిలిపివేయడం గురించి మనం వింటూనే ఉంటాం. అయితే అదే రూల్ మున్సిపాలిటీ భవనానికి కూడా వర్తించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటి భవనానికి శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీవారు గత ఏడాది కాలంగా బిల్లు కట్టకపోవడంతో.. ప్రస్తుతం కోటి పదిలక్షల రూపాయలు బకాయి పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటిలో అంధకారం అలుముకుంది. ఈ మేరకు సెస్ అదికారులు వివరాలు తెలిపారు. -
ఇంటి బిల్లులకు వ్యవసాయ బకాయిలతో ముడి
మోమిన్‌పేట: ‘మోకాలికి.. బోడి గుండు కు ముడిపెట్టినట్లు’ వ్యవహరిస్తున్నారు విద్యుత్ అధికారులు.. రైతుల వ్యవసా య బకాయిలను గృహ విద్యుత్ వినియోగానికి అధికారులు ముడిపెడుతున్నారు. వ్యవసాయ బకాయిల సర్‌చార్జి, ఇండ్ల విద్యుత్ బిల్లుకు జతచేసి చేతికి అందిస్తున్నారు. ఒక్కసారిగా వేలల్లో వచ్చిన బిల్లును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. నిర్ణీత గడువులోపు ఈ బకాయిలు చేల్లించకుంటే గృహ విద్యుత్ కనెక్షన్లు కత్తిరిస్తామని అధికారులు చేస్తున్న హెచ్చరికలతో రైతులు లబోదిబోమంటున్నారు. అనావృష్టితో పంటలు నష్టపోయి కరువు కోరల్లో చిక్కి అల్లాడుతున్న ఈ తరుణంలో విద్యుత్ సిబ్బంది రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఉచితమే.. వ్యవసాయానికి 2004 నుంచి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. ఉచితం కదా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని రైతు మొదట భావించారు. అధికారులు మాత్రం నెలకు రూ.30లు సర్వీసు చార్జి చెల్లించాలని ప్రకటించారు. కానీ ఈ విషయం రైతులకు బోధపడలేదు. అధికారులు కూడా సరైన ప్రచా రం నిర్వహించలేదు. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు చెల్లించాల్సిన సర్వీసుచార్జిలను రైతులు చెల్లించలేదు. ప్రస్తుతం అవి తడిసి మోపెడయ్యాయి. ఏడాదికి రూ.360లు చెల్లించాలి. చెల్లించలేని రైతులకు రూ.3600 కలిపి ఇంటి బిల్లుకు జోడిస్తున్నారు. రైతులకు ఆరు నెలలకోసారి రూ.180లు చెల్లించాలని బిల్లులు ఇవ్వాలి. ఈ విషయంలో విద్యు త్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలలకు ఇవ్వాల్సిన బిల్లు ఏడాదికి కూడా ఇవ్వలేదు. ఓవైపు రైతులు, మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పదేళ్లుగా సర్వీసుచార్జి కింద చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. మండలంలో.. మండలంలో ఆధికారికంగా వ్యవసాయ కనెక్షన్లు, ఇంటి సర్వీసులు కలిపి 10,673 ఉన్నాయి. వ్యవసాయ బకాయిలు రూ.38లక్షలు, ఇంటి బిల్లుల బకాయిలు రూ.2.50 కోట్లు, కేటగిరీ -7 కింద ప్రభుత్వ పాఠశాలల బకాయిలు రూ.3.5లక్షలకు పేరుకుపోయాయి. ఇంటి బిల్లు, పదేళ్ల వ్యవసాయ బకాయిలు కలిపి ఏకమొత్తంలో చెల్లించాల్సి రావడంతో రైతులకు తలకు మించిన భారంగా మారింది. ఒక్కో రైతుకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రైతుల బకాయిలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం
నందిగామ : ఎస్పీఎం కంపెనీ సుబాబుల్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎస్పీం కంపెనీ ఏఎంసీకి కేవలం రూ. రెండు కోట్ల విలువ చేసే బ్యాంకు గ్యారంటీ ఉండగా రూ.14 కోట్ల వరకు ఎలా అప్పు పెట్టారని ప్రశ్నించారు. కంపెనీ వారు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ కలెక్టర్ కంపెనీకి నోటీసుల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏఎంసీ నిధుల నుంచి కానీ, ప్రభుత్వం కానీ వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కంపెనీ వారు ఈ ప్రాంత రైతులకు డబ్బులు ఇవ్వకుండా వేరే ప్రాంతంలో సుబాబుల్ కర్ర కొంటున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీక్ష చేస్తున్న రైతులు, రైతు నాయకులకు జగన్మోహన్రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కోవెలమూడి ప్రమీల, ఎంపీపీ వల్లంకొండ భద్రఖాళి, పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకట నారాయణ, కార్యాలయ ఇన్చార్జి డాక్టర్ ఎం. అరుణకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, మండల రైతు కన్వీనర్ చిలుకూరి బుచ్చిరెడ్డి, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యుడు కత్తురోజు శ్రీనివాసాచారి, పలు విభాగాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాకాలపాటి రోజానమ్మ, జిల్లేపల్లి రంగారావు, మువ్వల శ్రీనివాసరావు, కొండా కృష్ణారెడ్డి, నెలకుర్తి సత్యనారాయణ, రవికిరణ్ రెడ్డి, షేక్ ఫాతిమా, ఆవుల విజయ్, కిరణ్ పాల్గొన్నారు. -
బ్యాంకు నోటీసుల కలకలం
కాకుమాను/రెంటచింతల/చుండూరు: జిల్లాలోని రైతాంగానికి బ్యాంకులు పంపిస్తున్న నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. రైతు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందునుంచీ విస్తృత ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసలు బ్యాంకులకు బకాయిలు చెల్లించొద్దంటూ సలహా కూడా ఇచ్చేశారు. దీంతో ఆయనకు అధికారం కట్టబెట్టిన అన్నదాతలకు బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకులు పంపిస్తున్న నోటీసులు వెక్కిరిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నోటీసులు అందుకున్న రైతులు లబోదిబో మంటున్నారు. సకాలంలో బకాయిలుచెల్లించకుంటే కుదువపెట్టిన ఆస్తులు వేలం వేస్తామంటూ వారు హెచ్చరిస్తుండటంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. కాకుమానులో బ్యాంకు ముట్టడి కాకుమాను మండలానికి చెందిన పలువురు రైతులు ఆగ్రహంతో గురువారం ఎస్బీఐ బ్రాంచ్‌ను ముట్టడించారు. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన రాకముందే బ్యాంకులు ఇలా నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని నిలదీశారు. కాకుమాను ఎస్బీఐ బ్రాంచ్ పరిధిలో గత కొన్నేళ్లనుంచి పంట రుణాలుగా 4200 మంది రైతులు రూ. 42కోట్లు తీసుకున్నారు. మూడు సంవత్సరాల నుంచి అధిక వర్షాలు, వరదల కారణంగా పంటపోయి రైతులంతా అప్పుల్లో కూరుకొని పోయారనీ, చంద్రబాబు సీఎం అయితే తమ నష్టాలు తీరుతాయనుకుంటే ఇలా నోటీసులు పంపించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చుండూరు ఆంధ్రాబ్యాంక్ నుంచి సుమారు 600 మంది రైతులు ఆరుకోట్ల రూపాయల మేరకు పంట రుణాలు పొందారు. బంగారు ఆభరణాలు కుదువపెట్టి పంట రుణాలు పొందినవారు రుణాలు చెల్లించకపోతే బంగారు నగలు వేలం వేస్తామని నోటీసులు రావడంతో కౌలు రైతుల్లో కలవరం మొదలైంది. నమ్మించి నయవంచన తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని టీడీపీ అధినేత చెబితే నమ్మి గద్దెనెక్కించామనీ, తీరా ఇప్పుడు కమిటీలంటూ కాలయాపన చేయడంపై వారంతా మండిపడుతున్నారు. రెంట చింతల ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని రెంటచింతల, రెంటాల, గోలి, మిట్టగుడిపాడు తదితర గ్రామాలకు చెందిన సుమారు 15వందల మంది రైతులకు బ్యాంక్ అధికార్లు నోటీసులు జారీచేయడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ బ్యాంక్ పరిధిలో బంగారం కుదువ పెట్టి పెట్టుబడులకోసం 1000మందికి పైగా రైతులు రూ. 7కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకుంటే బంగారాన్ని వేలం వేస్తామని నోటీసుల్లో హెచ్చరికలు ఒకవైపు... రుణమాఫీ విధివిధానాలకోసం మరో 45రోజులు ఆగాలంటున్న సీఎం చంద్రబాబు ప్రకటన మరోవైపు.. రైతులను ఎటూ తేల్చుకోనీయడం లేదు. ఎలా చెల్లించాలో తెలీడం లేదు సాగు పెట్టుబడికోసం 2012 జూలైలో బంగారం పెట్టి రూ.37 వేల రుణం తీసుకున్నా. అధికార్లు 20వ తేదీలోగా దానిని తీర్చాలని నోటీసు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణం చెల్లిం చలేను. చంద్రబాబు రుణమాఫీ చేస్తారనుకుంటే కాలయాపన చేస్తున్నారు. ఏంచేయాలో తెలీడంలేదు. - జఠావత్ జోజినాయక్, రెంటచింతల ఉన్నతాధికారుల ఆదేశాలే అమలు చేస్తున్నాం బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నాం. రైతులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తాల వివరాలను తెలియచేయాలని నోటీసులు ఇచ్చాం . 2011 సంవత్సరంలో రీ షెడ్యూల్ చేసిన తరువాత ఒకసారి కూడా వాయిదా నగధును చెల్లించని వారికే నోటీసులు జారీ చేశాం. బ్యాంక్‌లో అన్ని రకాల రుణాలు తీసుకుని 30నెలలు పూర్తి అయిన అందరికీ ఈ నోటీసులు పంపించాం. - ఎ.వి.ఎస్.చంద్రమోహన్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్, రెంటచింతల -
రుణమాఫీ రగడ!
రైతు రుణమాఫీపై రగడ మొదలైంది. లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్ఎస్... తాజాగా ఒక సంవత్సర పంట రుణాలకే మాఫీని పరిమితం చేసే ఆలోచన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. తాము తీసుకున్న పంట రుణాలన్నీ మాఫీ అవుతాయనే ఆశతో ఎదురుచూస్తోన్న రైతుల్లో ఆందోళన మొదలైంది. సాక్షి, కరీంనగర్ : ఎన్నికల్లో ప్రధానహామీ అయిన రుణమాఫీపై గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పంట రుణాలన్నీ మాఫీ అవుతాయని ఆశిస్తున్న రైతుల ఆందోళన మొదలైంది. జిల్లాలోని 386 బ్యాంకు బ్రాంచీల నుంచి 4,77,663 మంది రైతులు రూ.లక్షలోపు పంట రుణాలు పొందారు. టీఆర్ఎస్ హామీ ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తే రూ.1895 కోట్ల రుణాలు మాఫీ అవుతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైం ది. ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోగా... రుణాలు మాఫీ అవుతాయనే సంతోషంలో రైతులు మునిగితేలారు. సీఎం కేసీఆర్ రుణమాఫీపై ఎప్పుడు ప్రకటన చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బు దవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. గత ఆర్థికం సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలనే ప్రా థమిక నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. పంట రుణా లు తీసుకున్న రైతుల వివరాలతో ఈ నెల 9న హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు.. ఇప్పటికే రాజకీయ పార్టీల నుంచి కొత్త ప్రభుత్వంపై విమర్శలు మొదల య్యాయి. షరతులు, కాలపరిమితి లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం కరీంనగర్లో విలేకరుల స మావేశంలో డిమాండ్ చేశారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు. అఖిల భారత కిసాన్‌సభ జిల్లా అధ్యక్షుడు పి.కేదారి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండపల్లి రాజయ్య సైతం... ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలన్నారు. లేదంటే రైతులకు మద్దతుగా ఉద్యమించి... తగిన గుణపాఠం చెప్తామని వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు. హుస్నాబాద్‌లో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. బంగారం రుణాల సంగతేంటో? జిల్లాలో లక్షపైనే మంది రైతులు వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. కానీ, బంగారంపై తీసుకున్న డబ్బులకు రుణ మాఫీ వర్తించదంటూ టీఆర్ఎస్ తాజాగా ప్రకటి ంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారంపై తీసుకున్న.. దీర్ఘకాలిక రుణాలకూ మాఫీ వర్తింపజేయాలంటూ కోరుతున్నారు. మరోపక్క.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. -
బకాయిలు చెల్లించండి
సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పడిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడ ంతో నోటీసు జారీ చేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించే విషయంపై ఈసీ నోరు విప్పడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వాటిని చెల్లించాలని నోటీస్‌లో హెచ్చరించనున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని స్పష్టం చేశారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎంసీకి చెందిన 63 వాహనాలు, స్థలాలు, కార్యాలయాలు, సుమారు ఐదు వేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ వినియోగించుకుంది. ప్రతీ వాహనానికి రోజుకు రూ.2,000 అద్దె, స్థలాలు, కార్యాలయాలు, సిబ్బంది వేతనాలకు.. ఇలా కోట్ల రూపాయల బకాయిలు పడింది. వీటిని చెల్లించేంతవరకు బీఎంసీ వాహనాలు, స్థలాలు, సిబ్బందిని ఈసీకి మరోసారి ఇవ్వబోమని అడ్తాని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పనులకు 8,000 మంది సిబ్బంది కావాలని బీఎంసీ పరిపాలన విభాగాన్ని ఈసీ కోరింది. అయితే 6,500 మంది సిబ్బందిని ఇచ్చేందుకు బీఎంసీ అంగీకరించింది. మిగతా సిబ్బందిని ఈసీ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకుంది. వీరంతా గురువారం ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతారని అడ్తాని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం నగరంలో మొత్తం 10,600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద అధికారులను నియమిస్తారు. ఎన్నికల విధుల్లో ముంబైలోని బీఎంసీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 75 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.