బిల్లులివ్వండి మహాప్రభో..
►నాలుగు నెలలుగా నిర్వాహకులకు అందని గౌరవ వేతనం
►రెండు నెలలుగా పెండింగ్‌లో భోజన బిల్లులు
ఎల్లారెడ్డిపేట: బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణకు నిధులు కరువయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 64ప్రభుత్వ పాఠశాలల్లో 132మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం తయారు చేసిపెడుతున్నారు. ఈపథకం ద్వారా సుమారు 6280మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వంట నిర్వాహకులకు ప్రతీనెల ప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. ఇప్పటివరకు ఆరు నెలలుగా గౌరవ వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసిపెడుతున్నారు.
పేరుకుపోయిన రూ.5.28లక్షల వేతనాలు
మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకులు మరోపని చేసుకోకుండా దీనిపైనే ఆధారపడగా నాలుగు నెలలుగా వేతనాలు అందక పూటగడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 132మంది నిర్వాహకులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నాలుగు నెలలకు సంబంధించి రూ.5.28లక్షలు బకాయిలు రావాల్సి ఉంది.
రూ. 4.50లక్షల మధ్యాహ్న భోజన బకాయిలు
64పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు కొనసాగుతుండగా డిసెంబరు వరకు రెండు నెలల భోజన బిల్లులు రాలేదు. ఇప్పటి వరకు రూ.4.50లక్షల బకాయిలు ఉండగా వారు అప్పులు చేసి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి విద్యార్థులకు వండిపెడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న బిల్లులతో పాటు నిర్వాహకుల వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
ఆశతో ఉన్నాం
నాలుగు నెలలుగా నిర్వాహకులకు గౌరవ వేతనం అందడం లేదు. రెండు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రాక కిరాణ దుకాణాల్లో అప్పులు చేస్తున్నాం. ఇంకో పని చేసుకోలేక మధ్యాహ్న భోజనాన్ని నమ్ముకొని అప్పుల పాలవుతున్నాం. గౌరవ వేతనం, భోజన బిల్లులు చెల్లించి మమ్మల్ని ముందుకు నడుపాలి. – పోతుల లక్ష్మి, నిర్వాహకురాలు, ఎల్లారెడ్డిపేట
బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమచేస్తాం
బడ్జెట్ రాగానే గౌరవ వేతనాన్ని నిర్వాహకుల ఖాతాల్లో జమచేస్తాం. నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. గౌరవ వేతనం, మధ్యాహ్న బిల్లుల బకాయిలపై ప్రతిపాదనలు పంపాం. డబ్బులు రాగానే అందరికి పంపిణీ చేస్తాం. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట