mid-day meal scheme
-
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ఖర్చును పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. రెండేళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యార్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు(ఆహార దినుసులు, గ్యాస్ తదితరాలు కలిపి)ను 9.6 శాతం మేర పెంచింది. 2020లో చివరిసారి వంట ఖర్చును పెంచిన సమయంలో ప్రాథమిక తరగతి (1–4వ తరగతి వరకు)లో ఒక్కో చిన్నారికి భోజనానికి రోజుకు రూ.4.97 చెల్లించగా, దానిని ఇప్పుడు రూ.5.45కు సవరించింది. ప్రాథమికోన్నత (6– 8వ తరగతి వరకు) స్థాయిలో భోజనం ఖర్చు రూ.7.45 నుంచి రూ.8.17కు పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు సమకూరుస్తాయి. 2022–23 బడ్జెట్లో కేంద్రం ఈ పథకానికి రూ.10,233 కోట్లు కేటాయించగా, రాష్ట్రాలు రూ.6,277 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రంపై అదనంగా రూ.600 కోట్ల భారం పడనుందని సమాచారం. -
యోగి సార్ ఇటూ చూడండి! మిడ్డే మీల్లో విద్యార్థులకు 'సాల్ట్ రైస్'
లక్నో: ఒక ప్రభుత్వ స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు మిడ్ డే మీల్లో భాగంగా సరైన భోజనం అందించకుండా నిర్లక్ష పూరితంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఐతే యూపీలోని అయోధ్య జిల్లాలో ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ విషయమై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ గ్రామాధికారి గానీ భాద్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి యోగి సార్ ఇలాంటి పాఠశాలకు ఎవరైన తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు. యోగి బాబా మీరైన ఈ వీడియో చూసి పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్ గోడలపై ఉన్న మిడ్ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ అధికారి నితిష్‌కుమార్ స్పందించి...మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్షపూరిత వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాదు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడుని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. (చదవండి: అయోధ్యలో రూ. 7.9 కోట్లతో భారీ వీణ... లెజండరి సింగర్ పేరిట చౌక్) -
ఆధార్ లేని విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రతి ఒక్క విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందుతుందని, అలాగే ఆధార్‌కార్డును అందిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి కూడా అందజేస్తామన్నారు. ఆధార్ మంజూరుకు సదుపాయాలు లేనిచోట, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విశిష్ట గుర్తింపు నంబర్లను అందజేస్తాయని తెలిపారు. -
ఆధార్ ఉంటేనే భోజనం
⇒మధ్యాహ్న భోజన పథకం అమలులో పారదర్శకత ⇒పాఠశాలలకు త్వరలోనే నోటిఫికేషన్ ⇒వంట చేసే కార్మికులూ వివరాలు ఇవ్వాల్సిందే.. ⇒కార్డులు లేని వారికి జూన్ 30వరకు గడువు ⇒జిల్లాలో 45,521 మంది విద్యార్థులు, 1,209 మంది కార్మికులు వరంగల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కేంద్రప్రభుత్వం కొత్త నిబంధన చేర్చనుంది. ఈ పథకంలో భాగంగా భోజనం చేసే విద్యార్థులే కాకుండా వంట చేసే కార్మికుల ఆధార్ కార్డు వివరాలు సేకరించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ శాఖ ఆధీనంలోని ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ’ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే పాఠశాలలకు పంపించనుంది. నిధుల వినియోగంలో పారదర్శకత పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండొద్దన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్నేళ్లుగా అమలుచేస్తున్నాయి. అయితే, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు, బియ్యాన్ని అందజేస్తాయి. ఈ మేరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తప్పుగా చూపిస్తూ నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకం నిర్వహణలో పారదర్శకత కోసం విద్యార్థులు, వంట కార్మికుల ఆధార్ కార్డుల నంబర్లు సేకరించాలని నిర్ణయించింది. విద్యార్థులు భోజనం చేస్తున్నందున.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నందున కార్మికుల నంబర్లు కూడా సేకరించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆధార్ కార్డులు లేని వారు జూన్ నెల 30వ తేదీలోగా పొందేందుకు గడువు ఇస్తారు. జిల్లాలో 45,521మంది విద్యార్థులు వరంగల్ రూరల్ జిల్లాలోని 15 మండలాలకు చెందిన 694 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతోంది. ఇందులో 472 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 141 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 45,521 మంది విద్యార్థులు ఉండగా, 1,209 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. వంట చేసే వర్కర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా మొత్తం రూ.1,20,900 చెల్లిస్తున్నారు. అలాగే, విద్యార్థుల ఆహారానికి సంబంధించి రోజుకు రూ.3,25,021, నెలకు రూ.78,00,507 ఖర్చు అవుతోంది. -
బిల్లులివ్వండి మహాప్రభో..
►నాలుగు నెలలుగా నిర్వాహకులకు అందని గౌరవ వేతనం ►రెండు నెలలుగా పెండింగ్‌లో భోజన బిల్లులు ఎల్లారెడ్డిపేట: బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణకు నిధులు కరువయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 64ప్రభుత్వ పాఠశాలల్లో 132మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం తయారు చేసిపెడుతున్నారు. ఈపథకం ద్వారా సుమారు 6280మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వంట నిర్వాహకులకు ప్రతీనెల ప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. ఇప్పటివరకు ఆరు నెలలుగా గౌరవ వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసిపెడుతున్నారు. పేరుకుపోయిన రూ.5.28లక్షల వేతనాలు మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకులు మరోపని చేసుకోకుండా దీనిపైనే ఆధారపడగా నాలుగు నెలలుగా వేతనాలు అందక పూటగడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 132మంది నిర్వాహకులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నాలుగు నెలలకు సంబంధించి రూ.5.28లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. రూ. 4.50లక్షల మధ్యాహ్న భోజన బకాయిలు 64పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు కొనసాగుతుండగా డిసెంబరు వరకు రెండు నెలల భోజన బిల్లులు రాలేదు. ఇప్పటి వరకు రూ.4.50లక్షల బకాయిలు ఉండగా వారు అప్పులు చేసి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి విద్యార్థులకు వండిపెడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న బిల్లులతో పాటు నిర్వాహకుల వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఆశతో ఉన్నాం నాలుగు నెలలుగా నిర్వాహకులకు గౌరవ వేతనం అందడం లేదు. రెండు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రాక కిరాణ దుకాణాల్లో అప్పులు చేస్తున్నాం. ఇంకో పని చేసుకోలేక మధ్యాహ్న భోజనాన్ని నమ్ముకొని అప్పుల పాలవుతున్నాం. గౌరవ వేతనం, భోజన బిల్లులు చెల్లించి మమ్మల్ని ముందుకు నడుపాలి. – పోతుల లక్ష్మి, నిర్వాహకురాలు, ఎల్లారెడ్డిపేట బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమచేస్తాం బడ్జెట్ రాగానే గౌరవ వేతనాన్ని నిర్వాహకుల ఖాతాల్లో జమచేస్తాం. నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. గౌరవ వేతనం, మధ్యాహ్న బిల్లుల బకాయిలపై ప్రతిపాదనలు పంపాం. డబ్బులు రాగానే అందరికి పంపిణీ చేస్తాం. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట -
అవినీతిపరులకు బయోందోళనే
మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు చెక్ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ జిల్లాలో తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు జాబితా విడుదల చేసిన ప్రభుత్వం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓ పాఠశాలలో 120 మంది విద్యార్థులుంటే వారిలో 30 మంది పాఠశాలకు హాజరుకాలేదు. కానీ మధ్యాహ్న భోజనం అటెండెన్స్ రిజిష్టర్‌లో మాత్రం అందరూ వచ్చినట్లు నమోదు చేశారు. గైర్హాజరు పిల్లలకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని సదరు ఏజెన్సీ, హెచ్ఎం ఇద్దరూ స్వాహా చేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే..ఇలాంటి పరిస్థితి చాలా స్కూళ్లలో ఉంది. చాలా రోజులుగా ఈ అక్ర మాల తంతు జరుగుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పాఠశాలల్లో బోగస్ అటెండెన్స్‌కు చెక్ పెట్టేందుకు, అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం బయో మెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఎంత మంది మధ్యాహ్న భోజనం తిన్నారో.. అంత మందికి మాత్రమే బిల్లు మంజూరవుతుంది. జిల్లాలో 3783 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆయా స్కూళ్లలో 3,43,557 మంది విద్యార్థులు భోజనం తింటున్నారు. టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్ బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అమలుకు పూనుకున్నారు. వేలిముద్ర పడితేనే బిల్లు : విద్యార్థి వేలిముద్ర పడితేనే ఏజెన్సీకి బిల్లు మంజూరవుతుంది. బయో అటెండెన్స్ ఆధారంగానే ఏరోజుకారోజు ఆన్లైన్లో బిల్లు జనరేట్ అవుతుంది. నెలలో ఏ విద్యార్థి ఎన్ని రోజులు మధ్యాహ్నం భోజనం చేశాడో క్రోడీకరించి, బిల్లు పంపుతారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు ఓసారి, మధ్యాహ్నం భోజన సమయంలో మరోసారి అటెండెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం ఆలస్యమైనా కొందరు విద్యార్థులు భోజన సమయానికి వస్తారు. ఉదయం వచ్చీ మధ్యాహ్న భోజనానికి హాజరుకాని విద్యార్థులూ ఉంటారు. దీంతో రెండు పూటలా అటెండెన్స్ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్లైన్ అంటెండెన్స్ తీసుకోదు. తర్వాత నమోదు చేసినా లాభం ఉండదు. ఎంతసేపూ గడువులోపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లకు సమయం కాస్త ఎక్కువగా కేటాయిస్తారు. నిన్నటి రోజు కొందరి పిల్లలు నమోదు చేయలేదు.. ఈరోజు చేస్తామంటే కుదరదు. ఏరోజుకారోజు అటెండెన్స్ వేయాలి. తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు : జిల్లాలోని 3,783 స్కూళ్లకు గాను తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూళ్లు ఉంటాయి. జాబితాను ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు పంపింది. అనంతపురం డివిజన్లో 268 పాఠశాలలు, ధర్మవరం డివిజన్లో 428, గుత్తి డివిజన్లో 447, పెనుకొండ డివిజన్లో 365 స్కూళ్లలో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్కూళ్లలో బయోమెట్రిక్ మిషన్లు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్మెంట్ చేసేందుకు, ఏజెన్సీ నిర్వాహకులు, హెచ్ఎంలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేనాటికి ఈ ప్రక్రియ పూర్తయి అమలు చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వేలిముద్రలు నమోదు చేస్తున్నాం : శామ్యూల్, డీఈఓ బయోమెట్రిక్ అమలు నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నాం. మీసేవ, ఆన్లైన్ కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లి వేలిముద్రలు నమోదు చేయిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 1,505 స్కూళ్లలో అమలు కానుంది. ముందుగా ఆయా స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే తర్వాత చెప్తాం. -
ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం
► విద్యార్థులకు కడుపునిండా తిండి ► ఆక్రమాలకు అడ్డుకట్ట ► సంచులపై టీఎస్ఎస్సీఎల్ ముద్ర ఆదిలాబాద్ టౌన్ : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి, దీంతో అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు సరిగా తినలేక పోయేవారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. సన్నబియ్యం రాక అక్రమార్కులకు వరంగా మారింది. ఇటు చౌక దుకాణాలు, అటు పాఠశాలలు, వసతి గృహలకు ఒకే రకమైన సంచుల్లో సన్న, దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇన్నాళ్లు అక్రమార్కులకు కాసులు కురిపించారుు. ఈ క్రమంలో అవి పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. అక్రమాలను నిరోదించడానికి పాలిథీన్ సంచుల్లో బడి బియ్యం సరఫరా చేస్తున్నారు. నియోజక వర్గంలో.. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ఆదిలాబాద్ మండలంలో101 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీఎస్, 21 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. జైనథ్ మండలంలో 39 పీఎస్‌లు, 9 యూపీఎస్‌లు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. బేల మండలంలో 34 పీఎస్‌లు, 11 యూపీఎస్, 5 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటితో పాటు నియోజక వర్గంలోని ఆశ్రమ, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని వడ్డిస్తున్నారు. మొత్తం నియోజక వర్గంలో 20 వేల వరకు విద్యార్థులు ఉన్నారు. పక్కదారి పట్టించకుండా... ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఇప్పటిదాకా పాఠశాలలు, వసతి గృహలు, రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం అన్ని సంచులు ఒకే విధంగా ఉండేవి. 50 కిలోల గోనే సంచుల్లో అందజేసేవారు. దీంతో ఏవి దొడ్డు రకం..ఏవి సన్న రకమో.. సంచి తెరచి పరిశీలిస్తే కానీ తెలిసేది కాదు. దీన్ని ఆసరాగా చేసుకోని అక్రమార్కులు పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నారుు. అలాగే సంచుల్లో బియ్యం తూకం తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి 50 కిలోల ప్రత్యేక సంచి (తెలుపురంగు)లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. సంచులపై టీఎస్ఎస్సీఎల్ (తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ)ముద్రతో పాటు వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం బియ్యం, ప్యాకింగ్ చేసిన తేదిని ముద్రించారు. ఆక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఇది వరకు గోనే సంచుల్లో చౌకదరల దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో ఇవి కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన పాలిధీన్ సంచుల్లో 50 కిలో సంచుల్లో సరఫరా చేస్తున్నాం. దీంతో దొడ్డు బియ్యం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు. -శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
ఫస్ట్ డే..పస్తులే..!
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల కడుపులు మాడ్చింది. డ్వాక్రా మహిళలు, ఏజెన్సీల స్థానంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ (ఎండీఎం)ను ఆర్భాటంగా ప్రభుత్వం కట్టబెట్టిన ప్రైవేటు సంస్థ పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఆహారం అందించకుండా చేతులెత్తేసింది. ఫలితంగా తొలి రోజు ఉదయం ఎంతో ఆనందంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకూ ఖాళీ కడుపులతో గడిపారు. ఆ మూడు మండలాల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను సంవత్సరాల తరబడి డ్వాక్రా మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన పలువురు మహిళలు నిర్వహిస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని పాఠశాలలను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మధ్యాహ్నం ఆయా మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఆహారం సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడండి .. పెనుమాకలోని పాఠశాలను పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మూడు మండలాల పరిధిలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా కాలేదని తెలుసుకున్న అధికారులు అక్కడి నుంచి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. మొదటి రోజు కావడంతో రవాణా సమస్య తలెత్తి భోజనం సరఫరా చేయలేకపోయామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వారికి సూచించారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే : ఎమ్మెల్యే ఆర్కే రాజధాని (తాడేపల్లి రూరల్) : పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్‌ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పిల్లలలను పస్తులుంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో మోసాలు చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. కలెక్టర్ కాంతిలాల్ దండేకు విషయాన్ని తెలియజేయడంతో విషయం తనకు తెలియదని, దీనిపై వివరణ తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. దీనిపై మంగళగిరి, తాడేపల్లి ఎంఈవోలను ప్రశ్నించగా వారు సైతం పరిశీలిస్తున్నామన్నారేగానీ, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘మధ్యాహ్న భోజనాన్ని’ ప్రైవేట్‌పరం చేయవద్దు
శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కమల గాంధీనగర్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎ. కమల డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కట్టబెట్టాలన్న ఆలోచనను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అరకొర వసతులతోనే పదిహేనేళ్లుగా భోజనపథకం నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. భోజన పథకం కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, సరైన సౌకర్యాలు కల్పించి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకే మధ్యాహ్న భోజన పథకం అప్పగించాలని డిమాండ్‌చేశారు. సమస్యల ప రిష్కరించాలని కోరుతూ విజయవాడ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నగర అధ్యక్షురాలు దుర్గాభవానీ, పి. లక్ష్మీ, రమాదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న భోజన’ తీరు అధ్వానం
రాష్ట్రంలో పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో భోజనాన్ని ఆలస్యంగా అందిస్తున్నారని, తల్లిదండ్రులెవరూ కూడా ఆ భోజనాన్ని రుచి చూడటంలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. చిత్తూరు జిల్లాలో ఒక ఎన్జీవో తమ వంట గది నుంచి దాదాపుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తోందని, దీనివల్ల రెండు గంటల ఆలస్యంగా పిల్లలకు భోజనం అందుతోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉందని తెలిపింది. 2015-16 సంవత్సరానికి గాను ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలును కేంద్ర మానవ వనరుల అభివృధ్ది మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేవలం 37 శాతం స్కూళ్లలోనే తల్లిదండ్రులు భోజనాన్ని రుచిచూడటం పట్ల కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించే సమయంలో ప్రతి స్కూల్లో కనీసం ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. -
సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
ఆదిలాబాద్ అర్బన్ : కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యా శాఖఅధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డీఈవో శ్యాం పాల్గొన్నారు. -
మొక్కు‘బడి’గా భోజనం
► మండుతున్న ఎండలే ప్రధాన కారణం ► చాలా చోట్ల ప్రారంభం కాని పథకం కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ఫలితమివ్వలేదు. మండుతున్న ఎండలు, నెలరోజుల ముందే పరీక్షలు ముగియడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలో 1955 ప్రాథమిక, 327 ప్రాథమికోన్నత, 644 ఉన్నత పాఠశాలల్లో సుమారు 2.12 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు తక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. పెద్దపల్లి, హుజూరాబాద్, ధర్మపురి, గోదావరిఖని, మంథని నియోజకవర్గాల్లో భోజన పథకం అసలే ప్రారంభంకాలేదు. వేములవాడ, మాన కొండూర్, చొప్పదండి, కరీంన గర్, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోని కొన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభమైనా.. మరికొన్నింటిలో అసలే ప్రారంభం కాలేదు. ఎండలు...వసతుల లేమి.... జిల్లాలోని 57 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేలా జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసినా.. ఎండ కారణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చి భోజనం చేయడానికి ఆసక్తి చూపలేదు. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు పక్క గ్రామాల నుంచి తాము చదువుకునే పాఠశాలకు వచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు పాఠశాలల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఏజెన్సీల నిర్వాహకులూ ఎండలు చూసి భయపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వ్యాసరచన, ఆటపాటలు, పెయింటింగ్‌పై శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలనే ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఉపాధ్యాయులూ పాఠశాలలకు వచ్చేందుకు ముందుకు రావడంలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో 136 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 98 పాఠశాలల్లో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించారు. 13,320 మంది విద్యార్థులకు కేవలం 1400 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 180 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 12,859 మంది విద్యార్థులున్నారు. అయితే మధ్యాహ్న భోజనం ఆరగించేందుకు కేవలం 3,223 మంది విద్యార్థులే హాజరయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో 4,465 మంది విద్యార్థులకు గాను 2,680 విద్యార్థులు హాజరయ్యారు. మెట్పల్లి మండలంలో 4,163 మంది విద్యార్థులకు గాను 1,050 మంది హాజరయ్యారు. కోరుట్ల అర్బన్, రూరల్ పరిధి పాఠశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను 580 మంది హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపించింది. మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో 3,466 మంది విద్యార్థులకుగాను 803 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఇల్లంతకుంట మండలంలో 51 పాఠశాలల్లో 3,508 మంది విద్యార్థులకుగాను 948 మంది హాజరయ్యారు. మానకొండూరు మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో 4005 మంది విద్యార్థులకు గాను 719 మంది మాత్రమే భోజనం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 237 ప్రభుత్వ పాఠశాలల్లో 27842 మంది విద్యార్థులకు గాను 4656 మంది మధ్యాహ్న భోజనానికి వచ్చారు. తొమ్మిది స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా తినేందుకు రాకపోవడం విశేషం.వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ అర్బన్, రూరల్‌తో పాటు చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 21,026 మంది విద్యార్థులకు గాను 3,420 మంది విద్యార్థులు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క చిగురుమామిడి మండలంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, బోయినపల్లి మండలాల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించారు. పూర్తి వివరాలు అందలేదు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మొదటి రోజు సగం నియోజకవర్గాల్లోనే కొనసాగింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలవుతుం ది. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ఇతర గ్రామాల నుంచి వచ్చేవారు కాబట్టి హాజరు శాతం ఉండడంలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల హాజరు శాతం 45 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా భోజనం చేసిన విద్యార్థుల వివరాలు అందలేదు. గురువారం నుంచి ఎస్ఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పాఠశాల యూడైస్ కోడ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఎండీఎంటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విద్యార్థుల సంఖ్యను టైప్ చేసి 99634 72066 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. - శ్రీనివాసాచారి, డీఈవో -
నేటి నుంచే భోజనం
♦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు ♦ 1.48 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ♦ వలసల నివారణకు చర్యలు ♦ రోజూ విద్యార్థుల సంఖ్యను పేర్కొనాలని ఆదేశాలు పాపన్నపేట: కరువు వేళ విద్యార్థుల ఆకలి తీర్చి.. వలసలు నివారించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆహార భద్రత చట్టం అమలు చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింప చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. లక్షన్నర మందికి లబ్ధి జిల్లాలోని 46 మండలాల్లో 2,358 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,324 మంది విద్యార్థులకు భోజనాన్ని ఇవ్వనున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. 10.30 వరకు విద్యార్థులకు బేసిక్స్‌తో పాటు ఆటపాటలు, సాంస్క ృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ మేరకు అన్ని మండలాల్లో ఎంఈఓలు ప్రధానోపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించే చర్యలు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథక అమలు గురించి గ్రామాల్లో దండోరా వేయించారు. రోజు భోజనం కాగానే విద్యార్థు ల సంఖ్యను ఎస్ఎంఎస్ల రూపంలో ఎంఈఓ కార్యాలయాలకు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2009లోనూ ఇలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవుల్లో కొనసాగించారు. -
బాధ్యతలు ఎవరికి?
♦ సెలవుల్లో మధ్యాహ్న భోజనంపై కరువు మండలాల్లో సందిగ్ధత ♦ జిల్లా కలెక్టర్లు చూసుకుంటారు: ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 231 కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై కొంత గందరగోళం నెలకొంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని, అప్పటినుంచి మధ్నాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను ఈనెల 16 నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కరువు మండలాల్లో 16 నుంచి మధ్యాహ్న భోజనం పథకం కొనసాగిస్తారా? లేక ఈనెల 23నుంచి అమలు చేస్తారా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. శుక్రవారం రాత్రి వరకు కూడా దీనిపై ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో భోజనం బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేదానిపై ప్రధానోపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. అయితే మౌఖికంగా మాత్రం స్థానికంగా ఉండే గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వివరణ కోరగా.. ఆ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించామని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి వారు చూసుకుంటారని ఆయన తెలిపారు. -
‘మధ్యాహ్న భోజనం’పై అసంతృప్తి
పథకంలో లోటుపాట్లు సరిచేయాలని కేంద్రం సూచన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. మెదక్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో వంటగదులు, వాటిని నిర్మించడానికి స్థలం ఉన్నప్పటికీ, ఓ ఎన్జీవో ఏర్పాటు చేసిన సెంట్రల్ కిచెన్ నుంచి మాత్రమే మధ్యాహ్న భోజనం చేరుతోందని, ఇది కచ్చితంగా ఈ పథకం మార్గదర్శకాల ఉల్లంఘనేనని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఈ పథకం కింద పిల్లల కవరేజ్ కూడా తక్కువేనని, రెండు ఎన్జీవోలు కేంద్రీయ వంటగదుల నుంచి భోజనాన్ని సరఫరా చేస్తున్నాయంది. పథకం కింద స్కూల్ ఆధారిత వంట గదులను, ఆ ప్రాంతంలోని ప్రజల ప్రమేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించింది. 2015-16కి గాను ఏప్రిల్- డిసెంబర్ మధ్య పథకం అమలును మంత్రిత్వశాఖ సమీక్షించింది. 30,408 వంటగదులు, స్టోర్లు మంజూరు కాగా, 25 శాతం మాత్రమే పూర్తయ్యాయని, 15,348 వంటగదులు, స్టోర్ల నిర్మాణపు పనులు ప్రారంభమే కాలేదంది. తెలంగాణలో 48 శాతం పాఠశాలలోనే ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, అన్ని పాఠశాలలకు అందించాలని శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పిల్లల కవరేజ్ తక్కువ: రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద తెలంగాణలో పిల్లల కవరేజ్ అతి తక్కువని, నమోదైన పిల్లలలో కేవలం 69శాతం మందికే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని కేంద్రం గుర్తించింది. 58శాతం పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్(ఐఎఫ్ఏ), 14శాతం మందికి విటమిన్ ‘ఏ’, 40శాతం మందికి డీవార్మింగ్ టాబ్లెట్లు అందించారని గమనించింది. ఈ పథకం కింద మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్నిధులు12 శాతం మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. -
హమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం పెంచింది. ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను కొంత వరకు తగ్గించింది. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడానికి వెసులుబాటు కల్పించింది. పెరిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిధులు ‘జీవో 31’ జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి నెలా జిల్లాపై రూ.30 లక్షల అదనపు భారం సత్తెనపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిర్వహణ నిధులు పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే నిధులను కొంత పెంచుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా శుక్రవారం జీవో 31 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అయ్యే ఖర్చును ఆయా ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తాయి. 9,10 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మధ్యాహ్న భోజన నిర్వహణ నిధులు అప్పటికి అమల్లో ఉన్న మెస్ ఛార్జీలను బట్టి ఏటా 7.5 శాతం తక్కువ కాకుండా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెంచింది. కొంత ఆలస్యమైనప్పటికీ గత ఏడాది జూలై నుంచి వర్తింపు జేయడంతో నష్టపోయిన మొత్తాన్ని పూడ్చినట్లు అయింది. జిల్లాపై రూ.30 లక్షల భారం... జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,739, ప్రాథమికోన్నత పాఠశాలలు 439, ఉన్నత పాఠశాలలు 408 ఉన్నాయి. మొత్తం 3,586 పాఠశాలలు ఉండగా వీటిలో 3,21,307 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 2,11,916 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం తాజాగా మెస్ చార్జీలు పెంచడంతో ప్రతి నెలా రూ. 30 లక్షల వరకు జిల్లా పై అదనపు భారం పడుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని 3,696 నిర్వాహణ ఏజన్సీలు అమలు చేస్తున్నాయి. మొత్తం 6,647 మంది వంట సిబ్బంది పని చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో అప్పుల భారం నుంచి కొంత మేరకు వీరికి ఉపశమనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు ఇలా.. ఒక్కో విద్యార్థికి ఒక రోజుకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి పాఠశాల ప్రస్తుత ధర కొత్త ధర పెరిగిన మొత్తం ప్రాథమిక రూ. 4.60 రూ. 4.86 26 పైసలు ప్రాథమి కోన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు ఉన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు -
‘అప్పు’ చేసి.. పప్పు కూడు
మధ్యాహ్న భోజన పథకం మెనూ ఇలా.. సోమ, గురువారం : అన్నం + కూరగాయలతో కూడిన సాంబారు మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+ రసం బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు వీటితో పాటు వారానికిరెండు రోజులు కోడిగుడ్డును అందించాలి. ధర్మవరం : మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు ఐదు నెలలుగా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఏజెన్సీలను నడిపేందుకు నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. అప్పో సప్పో చేసి అన్నం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేక పోతున్నామని వారు వాపోతున్నారు.జిల్లా వ్యాప్తంగా 3,742 ప్రాథమిక, 596 ప్రాథమికోన్నత, 603 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,90,782 మంది చదువుతున్నారు. 4,491 ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి పిల్లలకు ఒక్కొక్కరికి రూ.4.60 పైసలు, 9,10 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.30 చొప్పున చెల్లిస్తోంది. రూ. లక్షల్లో బకాయిలు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వేతనాలు, బిల్లుల రూపంలో రూ.లక్షల్లో బకాయిలున్నాయి. సగటున వంద మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.20 వేల దాకా బిల్లు అందాల్సివుంది. అంటే ఐదు నెలలకు కలిపి రూ.లక్ష దాకా బకాయి ఉంది. ప్రాథమిక పాఠశాలలకు 2015 నవంబర్ నుంచి.. ఉన్నత పాఠశాలలకు అక్టోబర్ నుంచి బిల్లులు చెల్లించాల్సివుంది. -
కాలేజీల్లో ‘మధ్యాహ్నం’
డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పానికి జిల్లా యంత్రాంగం కార్యరూపం ఇచ్చింది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆకలి కడుపుతో కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు అక్కడే ఆహారా న్ని వడ్డించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. శనివారం కూకట్పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూ రు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. కటిక దారిధ్యం అనుభవిస్తున్న విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థుల కడుపు నింపాలని నిర్ణయించారు. ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం స్పష్టం కావడంతో ప్రయోగాత్మకంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజ నం వడ్డించాలనే ఆలోచనకు వచ్చారు. తన విచక్షణాధికారంతో ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించారు. వంట సామగ్రి, కూరగాయలు, ప్లేట్లను సమకూర్చుకోవడానికి నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా డిగ్రీ మూడో ఏడాది చదివే 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా ఈ పథకాన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ ఒకటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం పూట అ ల్పాహారం తీసుకోకుండానే కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అదేసమయంలో మధ్యాహ్న వేళల్లో నడిచే విద్యార్థులకు ఆహారం తీసుకున్న తర్వాతే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఫ్యాకల్టీకి కూడా అక్కడే! డిగ్రీ కాలేజీల్లోని ఫ్యాకల్టీ కూడా అక్కడే భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుండడం.. అరకొరగా బోధనలు సాగుతుం డడం కూడా సర్కారు కాలేజీల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమని అంచనాకొచ్చిన ఆయన.. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన కళాశాలల్లో వార్షిక పరీక్షల వరకు అదనంగా మూడు తరగుతులు బోధించాలని లెక్చరర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థు లు కడుపునిండా తిని.. మెదడుకు పనిపెడితే ఉత్తీర్ణతాశాతం అదంతట అదే పెరుగుతుంద ని భావిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే జూనియర్ కాలేజీల్లో చదివే 4,140 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజనం పెట్టేలా నిర్ణయం తీసుకోనున్నారు. -
మధ్యాహ్న భోజనంపై ‘మూడో కన్ను’
♦ జనవరి 18 నుంచి ప్రత్యేక బృందాలతో తనిఖీలు ♦ నిర్ణయించిన విద్యాశాఖ.. షెడ్యూలు ఖరారు ♦ వంట నుంచి పాత్రలు కడిగే వరకు పరిస్థితులపై అధ్యయనం ♦ సెస్, ఎన్ఐఎన్, హోంసైన్స్ కాలేజీ ప్రతినిధులతో తనిఖీ బృందాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును తెలుసుకునేందుకు విద్యాశాఖ ‘మూడో కన్ను’ను ప్రయోగించనుంది. సేవాసంస్థలతో ఏర్పాటైన బృందాలు ‘థర్డ్ పార్టీ’ తనిఖీలను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ తనఖీలను జనవరి 18, 19, 20, 21 తేదీల్లో నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. భోజనం వండటం మొదలుకొని నిల్వ చేయడం, విద్యార్థులకు పెట్టడం, ఆ తరువాత పాత్రలు శుభ్ర పరిచే వరకూ అన్నింటా ఎలా పని చేస్తున్నారన్న అంశాలను తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి వంటి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో ఉదయం 5 గంటలకు వండిన భోజనం మధ్యాహ్నం విద్యార్థులకు పెడుతున్నారని, దీంతో అది పాడవుతోందని, దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదులు ఇటీవల విద్యాశాఖకు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ఈ తనిఖీలను విద్యాశాఖ నేతృత్వంలో కాకుండా ‘థర్డ్ పార్టీ’ నేతృత్వంలో చేపట్టాలని, తద్వారా కచ్చితమైన నివేదిక వస్తుందన్న ఆలోచనలతో ఈ చర్యలు చేపట్టింది. దాంతో తదుపరి చర్యలపై పక్కాగా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హోంసైన్స్ కాలేజీ, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా కలిగిన బృందాల నేతృత్వంలో ఈ తనిఖీలకు చర్యలు చేపడుతోంది. మొదటి దశలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తనిఖీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బృందం ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలల్లో పర్యటించి భోజనం అందిస్తున్న తీరుపై అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఆయా బృందాలను విద్యాశాఖకు అందజేసే నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటో నుంచి 8వ తరగతి వరకున్న 22,44,322 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ.324 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే 9, 10 తరగతుల 4,70,571 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. ఇలా మధ్యాహ్న భోజనం అందించేందుకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న మొత్తంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రోజుకు రూపాయి వంతున వారంలో రెండు కోడిగుడ్లు అందించేందుకు అదనంగా చర్యలు చేపట్టింది. సన్నబియ్యంతో వండిన భోజనం అందిస్తోంది. అయినా ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి సిద్ధమైంది. ఆహార నాణ్యతపైనా పరీక్షలు భోజనం నాణ్యత, పోషక విలువలపైనా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్ఐఎన్ వంటి జాతీయ స్థాయి ఆహార పరిశోధన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించకపోతే వృథానేనన్న భావనతో ఈ చర్యలకు సిద్ధం అవుతోంది. ఆకస్మిక తనిఖీల ద్వారా ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. -
ఆన్లైన్లో భోజన పథకం వివరాలు
విశాఖ : ఇకపై మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పథకం రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ గౌరీశంకర్ తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తదితర వివరాలను ప్రతి నెలా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు దగ్గర నుంచి తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలతో కూడిన యు డైస్‌ను సిద్ధం చేయాలని ప్లానింగ్ అధికారులకు సూచించారు. తరువాత రైల్వే న్యూ కాలనీలో గల కె.ఎన్.ఎం.స్కూల్, ఎంసీహెచ్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులు ఆదేశించగా మధ్యాహ్న భోజన పథకం బకాయిలు విడుదల చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. -
ఇంటర్లో మధ్యాహ్న భోజనం
గోదావరిఖని కళాశాలలో ప్రారంభం గోదావరిఖని టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కళశాల విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు. కానీ, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో సోమవారం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండాల్సి వస్తుంది. అయితే, చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నమే కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ మాధవి, అధ్యాపకులు.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించారు. ఇందు కోసం జిల్లా అధికారుల చర్చించిన ప్రిన్సిపాల్ వారి అనుమతి పొందారు. పట్టణంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల వారిని కలిశారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, సానుకూల స్పందన వచ్చింది. దాతల బియ్యం, వంట సామగ్రి ఇచ్చారు. కళాశాలలో మొత్తంగా 800 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పెరుగన్నం, చట్నీలతో వారికి భోజనం వడ్డిస్తున్నారు. -
వెతల నడుమ కుతకుతలు
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల అవస్థలు సగం కూడా పూర్తికాని వంట షెడ్ల నిర్మాణం మంజూరైనవి 1043...నిర్మాణం పూర్తయినవి 405 అసలు పనులు ప్రారంభించనవి 232 షెడ్లు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిమిత్తం సర్వశిక్ష అభియాన్ కింద 1043 వంటషెడ్లు మంజూరైనా అందులో సగం కూడా నిర్మాణం పూర్తి చేసుకోలేదు. దీంతో పథకం నిర్వాహక ఏజెన్సీ మహిళలు అవస్థలు పడుతున్నారు. ఎండైనా...వానైనా.. ఆరు బయటే వంటలు చేసి సమయానికి అందజేయాల్సిన బాధ్యతను మోయలేకపోతున్నారు. కొవ్వూరు : సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాకు 1043 వంటషెడ్లు మంజూరు కాగా వీటి నిర్మాణ బాధ్యతలను తొమ్మిది ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించారు. ఒక్కో వంట షెడ్డుకి రూ.1.50 లక్షలు చొప్పున 2012-13 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షాభియాన్ నుంచి జిల్లాకు రూ.15.64 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా జిల్లాకు రూ.9.62 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.6.02 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. జిల్లాకు కేటాయించిన వంట షెడ్ల నిర్మాణ బాధ్యతలను గృహానిర్మాణ శాఖ, రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం), ఐటీడీఏ, భీమవరం, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీలకు అప్పగించారు. మంజూరైన వంట షెడ్లల్లో ఇప్పటి వరకు 405 షెడ్లు పూర్తిచేయగా 232 షెడ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 276 షెడ్లు రూఫ్లెవల్లోనూ, 38 లెంటల్ లెవెల్, 65 బేస్మెంట్ లెవెల్ ఉండగా, 27 షెడ్ల పనులు ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 8 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం పథకం నిర్వహణకు కనీసం నిలువ నీడ లేదు. దీంతో కొన్నిచోట్ల తాటాకు పాకల్లోను, మరికొన్నిచోట్ల సైకిల్ షెడ్లలో, ఆరుబయట, పాఠశాల అరుగులపైన వంటలు చేస్తూ మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. పురోగతి లేని వంటషెడ్ల నిర్మాణం గృహనిర్మాణ శాఖకు 449 షెడ్ల నిర్మాణం కేటాయించారు. నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో వీటిలో 125 షెడ్లను రాజీవ్ విద్యామిషన్‌కు అప్పగించారు. వీటిలో కేవలం 44 షెడ్లే పూర్తయ్యాయి. 67 షెడ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఐటీడీఏకు 33 కేటాయించగా 28 పూర్తిచేశారు. మరో 5 ప్రారంభం కాలేదు. ఆర్వీఎంకు 634 కేటాయించగా 324 షెడ్లు పూర్తిచేశారు. మరో 125 షెడ్లు ప్రారంభం కాలేదు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. భీమవరం, పాలకొల్లు మునిసిపాలిటీలకు 12 వంట షెడ్లు చొప్పున కేటాయించగా రెండుచోట్ల ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. ఏలూరు కార్పొరేషన్‌కు ఏడు కేటాయించగా ఆరు పూర్తి చేశారు. మరొకటి నిర్మించాల్సి ఉంది. నిడదవోలు పురపాలక సంఘానికి ఐదు కేటాయించగా నాలుగు షెడ్లు నేటికీ ప్రారంభించలేదు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి 11 కేటాయించగా అతి కష్టం మీద 3 పూర్తిచేశారు. ఒక షెడ్డు ఇప్పటికీ ప్రారంభించకపోగా మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నరసాపురం మునిసిపాలిటీకి ఐదు కేటాయించగా ఒక షెడ్డు పనులు ప్రారంభించలేదు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం అసంపూర్తిగా ఉన్న వంటషెడ్లను ఈనె ల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తాం. ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పనులు అప్పగించిన ఏజెన్సీలు నెలరోజులు గడువు అడుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలో అన్ని షెడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం..
♦ అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు ♦ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ♦ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేగోడ్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించి విద్యార్థు లకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. సన్న బియ్యం సరఫరా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు మచ్చుకైనా కానరావడం లేదు. పర్య వేక్షించాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు బక్కచిక్కిపోతున్నారు. - రేగోడ్ సర్కారు బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ సన్నబియ్యం వంట మూన్నాళ్ల ముచ్చటగా మారింది. పాలకులకు.. అధికారులు పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ ఇపుడు కనిపించడం లేదు. ఫలితంగా రేగోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం పెడుతున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదవతరగతి నుంచి పదోతరగతి వరకు 385 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మంగళవారం అక్షయపాత్ర ద్వారా వచ్చిన వంటకాల ను వడ్డించారు. ఈ సమయంలో పాఠశాలను సందర్శించిన విలేకరులు విద్యార్థులకు పెట్టిన భోజనంలో పురుగులు ఉండడం, సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం ఉండడం కనిపించింది. అప్పటికే 300 మం దికి పైగా విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు భోజనం చేశారు. మరికొంత మంది భోజనాన్ని బహిష్కరించి అరటిపళ్లతో సరిపెట్టుకున్నారు. విద్యార్థులకు బొడ్డుబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నా ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుక వెళ్లకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఐ విచారణ దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఐ మర్రి ప్రదీప్, వీఆర్ఓ ఆదర్శ్ స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్షయపాత్ర ద్వారా విదార్థుల కోసం వండి తెచ్చిన అన్నాన్ని పరిశీలించారు. దొడ్డుబియ్యం.. అన్నంలో పురుగులు ఉండటాన్ని గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. అన్నం తినలేదు పురుగులు ఉన్నాయని అన్నం తినలేదు. అరటిపళ్లను తిని క్లాసుకు వెళ్లాను. రోజూ దొడ్డుబియ్యం అన్నం పెడుతున్నారు. సన్నబియ్యం అన్నమాటేగానీ కనిపించడం లేదు. కూరల్లో కూడా నాణ్యత ఉండడం లేదు. - ప్రశాంత్, పదోతరగతి పర్యవేక్షణ కరువైంది సన్నబియ్యం పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దొడ్డు బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం దారుణం. కలెక్టర్ చొరవ చూపి ఈ ఘనటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. - పూర్ణచందర్, నోబుల్యూత్ బాధ్యుడు -
ఆ భోజనం మాకొద్దు
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన క్షీరభాగ్యతో పాటు మధ్యాహ్న భోజన పధకాన్ని లక్షలాది మంది చిన్నారులు వద్దంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2.67లక్షల మంది భోజనాన్ని వద్దనుకుంటే, మరో 2.46లక్షల మంది క్షీరభాగ్య పథకానికి దూరంగా ఉంటున్నారు. ఇవి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడవుతున్న అంశాలు. బెంగళూరు: రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి పాఠశాలలతోపాటు మదరసాల్లో సైతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,582 పాఠశాలలుండగా, వీటిలో మొత్తం 64.74లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో గత ఏడాది 62.07లక్షల మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటే, 61.28 లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యలో భాగంగా అందజేసే పాలను తీసుకున్నారు. అంటే పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల్లో 2.67లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి, 2.46లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యకు దూరంగా ఉండిపోయారు. వీరంతా కావాలనే మధ్యాహ్నభోజనాన్ని, క్షీరభాగ్యలో ఇచ్చే పాలను వద్దనుకుంటున్నారని అధికారులే చెబుతున్నారు. కారణాలివే: విద్యార్థులు తమంతట తామే మ ధ్యాహ్న భోజ నాన్ని, క్షీరభాగ్య పథకాన్ని వద్దనుకోవడానికి కొన్ని కారణాలను అధికారులు అన్వేషించారు. ప్రస్తుతం క్షీరభాగ్య పథకంలో పాలను పాల పొడిని కలపడం ద్వారా వి ద్యార్థులకు అందజేస్తున్నారు. 18 గ్రాముల పాలపొడిని నీటిలో కలపడం ద్వారా 150 మిల్లీలీటర్ల పాలను తయారు చేసి ఒక్కో విద్యార్థికి వారంలో మూడు రోజుల పాటు అందజేస్తున్నారు. అయితే పాలపొడి ద్వారా తయారుచేసిన పాలను తాగడం ద్వారా ఆడపిల్లలు లావుగా తయారవుతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. తమ ఆడపిల్లలు ఊబకాయం బారిన పడతారనే ఉద్దేశంతోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షీరభాగ్యకు దూరంగా ఉంచుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట మధ్యాహ్న భోజనాన్ని తీసుకున్న చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మ ధ్యా హ్న భోజనానికి దూరంగా ఉంచుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే భోజనంలో నాణ్యత లేదని, ఆ భోజనం తయారీలో ఉపయోగించే సరుకులు నాసిరకమైనవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల లక్షల సంఖ్యలో చిన్నారులు మ ధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటున్నారని అక్షర దాసోహ అధికారులు చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించలేదు పాఠశాలల్లోని విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య పథకాల్లో భాగస్వాములను చేసేందుకు అక్షర దాసోహ అధికారులు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు అక్షర దా సోహ అధికారులు ఇంటింటికీ వెళ్లి జాగృతి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అం దువల్ల వచ్చే విద్యా ఏడాది మధ్యాహ్న భోజ నం, క్షీరభాగ్యలో భాగస్వాములయ్యే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.