పాములపాడు: విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండల పరిధిలోని వాడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా పథకం నిలిచిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి భోజనం చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.
పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 119 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు త్రిసభ్య కమిటీకి విషయాన్ని తెలియజేయడంతో చేతులు దులిపేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో ఆశ గ్రూపు వంట బాధ్యతలను నిర్వహిస్తోంది.
ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేశారు. గిట్టుబాటు కావడం లేదనే సాకుతో విద్యార్థుల సంఖ్యను పెంచి చూపడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు తరచూ గొడవ చేస్తున్నారు. సమస్య తలెత్తినప్పుడు మండల అధికారులు పరిష్కారం చూపడం.. ఆ తర్వాత షరా మామూలు కావడంతో మధ్యాహ్న వేళ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా పథకం సక్రమంగా అమలయ్యేలా అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
‘మధ్యాహ్నం’ ఇంటికే!
Published Sat, Jul 12 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement