సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. రెండేళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యార్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు(ఆహార దినుసులు, గ్యాస్ తదితరాలు కలిపి)ను 9.6 శాతం మేర పెంచింది. 2020లో చివరిసారి వంట ఖర్చును పెంచిన సమయంలో ప్రాథమిక తరగతి (1–4వ తరగతి వరకు)లో ఒక్కో చిన్నారికి భోజనానికి రోజుకు రూ.4.97 చెల్లించగా, దానిని ఇప్పుడు రూ.5.45కు సవరించింది.
ప్రాథమికోన్నత (6– 8వ తరగతి వరకు) స్థాయిలో భోజనం ఖర్చు రూ.7.45 నుంచి రూ.8.17కు పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు సమకూరుస్తాయి. 2022–23 బడ్జెట్‌లో కేంద్రం ఈ పథకానికి రూ.10,233 కోట్లు కేటాయించగా, రాష్ట్రాలు రూ.6,277 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రంపై అదనంగా రూ.600 కోట్ల భారం పడనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment