Finance department
-
Telangana: సర్కారు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధులను అన్వేషించే పనిలో ఆర్థిక శాఖ పడింది. ఆయా పథకాల అమలు కోసం తక్షణమే ఎన్ని నిధులు అవసరం? ఏ నెలలో ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించాల్సి ఉంటుంది? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లకు తోడు కొత్త పథకాలకు కలిపి నిధుల సమీకరణ ఎలా? రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో రుణాలు ఏ మేరకు సాధ్యమవుతాయనే లెక్కలు వేసుకుంటోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతోపాటు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీతో పెరిగే సబ్సిడీ వ్యయం కలిపి తక్షణమే రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాబడులకు తోడు అప్పులతో.. పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వస్తున్న రాబడులకు తోడు గణనీయంగానే అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం సమకూరుతోంది. వచ్చే మూడు నెలల్లో అదనంగా నెలకు మరో రూ.2వేల కోట్ల వరకు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రూ.30 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు ద్వారా సేకరించనుంది. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల చొప్పున కావాలని ఆర్బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది. మొత్తంగా సమకూరే నిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఖర్చుతోపాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే గత రెండు నెలలుగా పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్టు తెలిసింది. వచ్చే మూడు నెలలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని, ప్రస్తుతానికి నిధుల లోటు లేకుండా సర్దుబాటు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ సిద్ధమైందని వెల్లడించారు.మొత్తంగా రూ.45 వేల కోట్ల దాకా...ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా కింద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇక భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలి విడత సాయంగా రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మరో రూ.600 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మంది రైతు కూలీలు లబ్ధిపొందుతారని అంచనా. ఈ రెండు పథకాలకు ఈనెల 31లోపు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.8,800 కోట్లను ఖజానాకు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ రెండు నెలలుగా కార్యాచరణ అమలు చేస్తోంది. ⇒ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలోపు గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.10లక్షలలోపు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ⇒ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (తొలి విడతలో స్థలమున్న పేదలకు రూ.5 లక్షల సాయం) కోసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకుపైగా అవసరమని భావిస్తున్నారు. దశల వారీగా ఈ నిధులు విడుదల చేసే నేపథ్యంలో... ఏ నెలలో ఎంత అవసరమన్న దానిపైనా ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటోంది. ⇒ ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కార్డుల జారీ పూర్తయ్యాక మార్చి నెల నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల వరకు రేషన్‌కార్డులు ఉండగా.. మరో 10లక్షల వరకు కొత్తవి జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద కోటి కార్డులకు గాను ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు గణనీయంగా నిధులు కావాలి. ⇒ మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి నెలాఖరు)లోనే రూ.45 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నారు. -
ఊహాజనిత అంచనాలొద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను వార్షిక బడ్జెట్ తయారీ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు తమ అంచనాలను జనవరి 4వ తేదీలోగా పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం... » అన్ని ప్రభుత్వ విభాగాలు ఈనెల 4వ తేదీలోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపాల్సి ఉంటుంది. అదే రోజున ఆయా శాఖాధిపతులు వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేసిన అనంతరం ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది. » ఊహాజనిత అంచనాలకు పోకూడ దు. తమకు అవసరమయ్యే వాస్తవిక నిధుల కంటే ఎక్కువ లేదా తక్కువ మొత్తాలను ప్రతిపాదించకూడదు. » గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద చేసే ఖర్చును అన్ని శాఖలు తగ్గించుకోవాలి. »ప్రతి శాఖ విధిగా వ్యవస్థీకృత వ్యయాన్ని ప్రతిపాదించాలి. ఆఫీసుల నిర్వహణ, వాహనాలు, అద్దెలు, విద్యుత్, తాగునీటి ఖర్చులు, ఔట్సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాలకు అయ్యే వ్యయ అంచనాలను పంపాల్సి ఉంటుంది. » డిసెంబర్ 31, 2024 వరకు ఉన్న నికర అప్పుల వివరాలను పంపాలి. ప్రతి శాఖలో ఉన్న శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు పంపాలి. » అన్ని శాఖలు 2024–25 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాలను కూడా పంపాలి. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలను రాబడి శాఖలు ప్రతిపాదించాలి. » వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాల్సి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, అయ్యే ఖర్చును విధిగా ప్రతిపాదించాలి. »ప్రభుత్వ శాఖల్లో అమలు పరిచేందుకు వీలున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్ఎస్) గుర్తించడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే వీలున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిని పేర్కొంటూ ప్రతిపాదనలు పంపాలి. -
ఆర్థిక శాఖలో ఆరుగురు కన్సల్టెంట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు.. విదేశీ సంస్థలకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కన్సల్టెంట్ల రాజ్యానికి చంద్రబాబు సర్కారు గేట్లు తెరిచింది. ఆర్థికశాఖలో ఆరుగురు కన్సల్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో ఏడాదిపాటు ఆర్థిక శాఖ కార్యదర్శులకు సహాయకులుగా ఈ కన్సల్టెంట్లు పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వారికి నెలకు రూ.55 వేల నుంచి రూ.2.75 లక్షల వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు తెపారు. డేటా విశ్లేషణ, విధాన పరిశోధన, పీపీపీ ప్రాజెక్టులు, చట్టపరమైన విషయాల్లో ఈ కన్సల్టెంట్లు సహాయకులుగా పనిచేయనున్నారు. కాగా, ఇప్పటికే ఏపీ సీఆర్డీఏలో 68 మంది కన్సల్టెంట్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కన్సల్టెంట్లకు రెండు, మూడేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. -
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది. -
సవాళ్లలోనూ పీఎస్‌బీల బలమైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్, కెనరా బ్యాంక్ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి. ‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితమిస్తున్న చర్యలు.. ‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్/బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు. -
కేటీఆర్ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. రంగంలోకి ఈడీ? ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది. ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. -
Telangana: ఖజానా కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో రూ.100 ఆదాయం కింద ప్రతిపాదిస్తే, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగిసే సమయానికి రూ.39.41 మాత్రమే వచ్చాయి. కానీ బడ్జెట్లో రూ.100 ఖర్చు కింద ప్రతిపాదించగా, ఇదే ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది మాత్రం రూ.39.75. అంటే బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఆదాయం కంటే ప్రభుత్వ ఖర్చే ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పన్ను రాబడుల్లో మందగమనం, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం రాకపోవడం, పన్నేతర ఆదాయం భారీగా తగ్గడం లాంటి పరిణామాలతో ఆరు నెలల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో పడిందని ఈ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే అమ్మకపు పన్ను మినహా మిగిలిన పన్ను రాబడుల్లోనూ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వచ్చింది రూ.లక్ష కోట్లే 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి ఆరు నెలలు ముగిసే సమయానికి ఈ ప్రతిపాదనల్లో కేవలం 39.41 శాతం అంటే రూ.1.08 లక్షల కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఇందులో పన్ను రాబడులు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.64 లక్షల కోట్లు పన్ను రాబడుల రూపంలో సమకూరాలి. అంటే ఆరు నెలలకు అందులో సగం లెక్కన కనీసం రూ.82 వేల కోట్లు రావాల్సి ఉంది. కానీ ఏకంగా రూ.13 వేల కోట్లు తక్కువగా కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే పన్నుల రూపంలో సమకూరాయి. జీఎస్టీ కింద రూ. 24,732 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,251 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.16,081 కోట్లు, ఎక్సైజ్ పద్దు కింద రూ.9,492 కోట్లు వచ్చాయి. ఇందులో అమ్మకపు పన్ను మినహా అన్ని శాఖల్లోనూ గత ఏడాది కంటే తగ్గుదల కనిపించింది. ఇక పన్నేతర ఆదాయం అయితే గత ఏడాదితో పోలిస్తే చాలా దూరంలో ఉంది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో సెప్టెంబర్ నాటికి 74 శాతం పన్నేతర ఆదాయం రాగా, ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇప్పటివరకు కేవలం 11.65 శాతం అంటే రూ.4,101 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు రాగా, మరో రూ.1.70 లక్షల కోట్లు రావాల్సి ఉందని, కానీ పరిస్థితి ఇలా కొనసాగితే మరో రూ.లక్ష కోట్లు రావడం కూడా గగనమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. 30 శాతానికి పైగా అప్పులే రెవెన్యూ రాబడులు పోను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పుల మీదనే ఆధారపడి నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రూ.1.08 లక్షల కోట్ల ఆదాయంలో అప్పులు రూ.32,536 కోట్లు ఉండటం గమనార్హం. అంటే మొత్తం వచ్చిన దాంట్లో 30 శాతానికి పైగా అప్పుల ద్వారానే సమకూరిందన్నమాట. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం అప్పుల్లో ఇప్పటికే 66 శాతం సమీకరించిన నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో అప్పుల సమీకరణకు కూడా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా రుణాల సమీకరణ జరగాల్సిన నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు సొంత ఆదాయం పెంచుకోవడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని, లేదంటే ఖజానాకు తిప్పలు తప్పవని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇక కేంద్రం నుంచి సాయం కూడా ఆశించిన మేర అందడం లేదని ఆరునెలల లెక్కలు చెపుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం రూ.21 వేల కోట్లకు పైగా ఇస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఆరు నెలల్లో కేవలం రూ.2,447 కోట్లు (11 శాతం) మాత్రమే వచ్చాయి. ఖర్చులు పైపైకి.. ఓ వైపు ఆదాయం తగ్గుతుండగా, మరోవైపు ఖర్చుల అనివార్యత రాష్ట్ర ఖజానాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఏడాది రూ.2.54 లక్షల కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లు (39.75 శాతం) ఖర్చయినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ పద్దు కింద రూ.41,802 కోట్లు, అప్పులకు వడ్డీల కింద రూ.13,187 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం రూ.21,279 కోట్లు, పింఛన్ల కోసం రూ. 8,560 కోట్లు, సబ్సిడీల రూపంలో రూ.6,376 కోట్లు వ్యయం జరిగింది. ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9,924 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనివార్య ఖర్చులు పెరిగాయని అర్థమవుతోందని, ఈ ఏడాదిలో కొత్త పథకాల అమలుకు ఎలాంటి అవకాశం లేదని, ఉన్న పథకాలనే కనాకష్టంగా కొనసాగించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పొదుపుగా వ్యవహరించడంతో పాటు వీలున్నంత త్వరగా రాబడి మార్గాలను పెంచుకునే ప్రయత్నాలను ప్రారంభించకపోతే ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదనపు రాబడులొచ్చే ప్రణాళికలు చూడండి – సీఎస్‌తో సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ రాష్ట్ర ఆదాయ వనరులపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల జేఏసీలతో సమావేశం అనంతరం ఈ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితులను బేరీజు వేసుకుని అదనంగా ఖజానాకు రాబడులు వచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపడతారో వివరిస్తూ వీలున్నంత త్వరగా నివేదికలు ఇవ్వాలని సీఎస్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు ఆదేశించినట్టు సమాచారం. -
పీఎస్బీల్లో సీజీఎం పోస్టుల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వ్యాపారం, లాభదాయకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పోస్టులను పెంచే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. 2019 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం పీఎస్బీల్లో ఒక సీజీఎం, నలుగురు జనరల్ మేనేజర్లు ఉండొచ్చు. అప్పట్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిలో విలీనం చేసిన అనంతరం జీఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు మధ్య సీజీఎం పోస్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వ్యాపారం మెరుగుపడిన నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా పోస్టులను పెంచుకునే అవకాశాలు కలి్పంచాలని కేంద్ర ఆర్థిక శాఖను పీఎస్‌బీలు కొన్నాళ్లుగా కోరుతున్నాయి. దీంతో తదుపరి వృద్ధి అవకాశాలను బ్యాంకులు అందిపుచ్చుకోవడంలో తోడ్పాటు అందించే దిశగా సీజీఎం పోస్టుల పెంపు ప్రతిపాదనలను ఆర్థిక సేవల విభాగం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 పీఎస్బీల్లో దాదాపు 4 లక్షల మంది ఆఫీసర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు 35 శాతం పెరిగి రూ. 1.4 లక్షల కోట్ల స్థాయిని దాటాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటా ఏకంగా 40 శాతం పైగా (రూ. 61,077 కోట్లు) ఉంది. -
వారసులకు ఉద్యోగాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేస్తూ 61 ఏళ్లు నిండిన వారి వారసులకు కారుణ్య నియామకాలిచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి, వీరికి ఉద్యోగాలివ్వాలంటూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల మేరకు అవసరమైన పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెవెన్యూ సేవల్లో ఉన్న 3,797 మంది వీఆర్ఏల వారసులకు అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా నియామక ఉత్తర్వులు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రకాలుగా ప్రభుత్వ వర్గాల అనుమతులున్నా తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం పట్ల వీఆర్ఏలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన ప్రజావాణికి పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి డి.దివ్యలకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల సమస్యలు విన్న ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 906 దరఖాస్తులు కాగా, మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణికి 906 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖ (306), రెవెన్యూ (138), విద్యుత్ (138), మైనార్టీ సంక్షేమ శాఖ (134), పంచాయతీరాజ్ (130)లతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 192 దరఖాస్తులు అందినట్టు ప్రజావాణి అధికారులు వెల్లడించారు. కాగా, యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ తమవద్ద పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిందంటూ బాధితులు ప్రజావాణికి రాగా, తక్షణమే స్పందించిన చిన్నారెడ్డి సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌కు లేఖరాసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
పోలవరానికి నిధుల విడుదలపై కేంద్రం కసరత్తు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ వరకూ మిగిలిన పనుల పూర్తికి గతేడాది జూన్ 5నే నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆ నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. రెండేళ్ల గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ వారం కిందట కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది. 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఖరారు చేసిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులుపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్‌కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్‌కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్‌కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
సేవల రంగం.. సుస్థిర ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది. ⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%. ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు. ⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం. ⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే. ⇒ జీఎస్డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది. ⇒జీఎస్డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి. రూ.5 వేల కోట్లు ఇప్పించండికేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి. సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి. -
సాయం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం వినతి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం అనేక సామాజిక సూచికల్లో వెనుకబడి ఉంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాం. తలసరి ఆదాయం విషయంలో కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తేడా కనిపిస్తోంది. అప్పుల భారం భరించలేని స్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు, గ్యారంటీలు కలిపి ప్రస్తుతం రాష్ట్ర నికర అప్పు రూ.7.27 లక్షల కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే బడ్జెట్లో 36% వరకు అనివార్యంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలిక భారంగా పరిణమిస్తోంది. నెలకు రూ.5,200 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను అసలు, వడ్డీలు చెల్లించేందుకే అవసరమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతోంది. తక్షణ అవసరాల కోసం స్వల్ప కాలిక రుణాలకు వెళ్లాల్సి రావడం బడ్జెట్‌పై ఒత్తిడిని కలుగజేస్తోంది. తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రమనే కారణంతో కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని తగ్గించొద్దు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి వీలున్నంత ఎక్కువ సాయం అందేలా సిఫారసులు చేయండి..’అని రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐదు కీలక విజ్ఞప్తులను 16వ ఆర్థిక సంఘం ముందుంచారు. ఐదు కీలక విజ్ఞప్తులు: 1.కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) అమలు కోసం ఇచ్చే గ్రాంట్లను వినియోగించుకునే విషయంలో రాష్ట్రాలకు స్వతంత్రత ఇవ్వాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించుకునే పథకాల కోసం ఈ నిధులను వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2.రాష్ట్ర ప్రభుత్వ అప్పులను రీస్ట్రక్చర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్), పీఎఫ్సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్)ల ద్వారా తీసుకున్న వాటికి, ఇతర రుణాలకు 10 నుంచి 12 శాతం వరకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తెలిపింది. ఈ వడ్డీల భారం కారణంగా అభివృద్ధికి నిధులు వెచ్చించే పరిస్థితి లేదని, తక్కువ వడ్డీకి రుణాలిప్పిస్తే ప్రస్తుతమున్న రుణాలను చెల్లించి భారం తగ్గించుకుంటామని విజ్ఞప్తి చేసింది. లేదంటే అభివృద్ధి వనరులను పెంపొందించుకునేలా అదనపు సాయాన్ని కేంద్రం నుంచి ఇప్పించాలని కోరింది. 3. కేంద్ర పన్నుల్లో వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరింది. 4. కేంద్ర పన్నుల్లో వాటాకు తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా తెలంగాణ లాంటి రాష్ట్రానికి నష్టం కలుగుతోందని, జీఎస్డీపీ ప్రాతిపదికన ఈ వాటాను నిర్ధారించాలని కోరింది. 5. కేంద్రం వసూలు చేసుకుంటున్న సెస్‌లు, సర్‌చార్జీల్లో వాటా ఇవ్వకపోవడంతో రాష్ట్రాల పన్ను ఆదాయం తగ్గిపోతోందని తెలిపింది. కేంద్ర పన్నుల్లో వాటా పెంపు ద్వారా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుతాయని సూచించింది. ఈ ప్రతిపాదన దేశంలోని అన్ని రాష్ట్రాలకు లబ్ధి కలిగిస్తుందని, సమాఖ్య స్ఫూర్తికి ఊతమిస్తుందని అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలు అనివార్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్‌లోని మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. – తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉంది. కానీ సంపద సృష్టి, ఆదాయ పంపిణీ విషయంలో ప్రాంతాల వారీగా భారీ వైరుధ్యాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో వెనుకబడ్డాం. కేంద్ర పన్నుల్లో వాటా నిర్ణయించేందుకు తలసరి ఆదాయాన్ని కాకుండా జీఎస్డీపీలో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. – ఉచితాలుగా పరిగణించే కొన్ని సంక్షేమ పథకాలు అనివార్యంగా అమలు చేయాల్సి ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆహార సబ్సిడీలు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో సదరు సంక్షేమ పథకాలను పెట్టుబడిగా పరిగణించాలి. – కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు అంచనాల పెంపు, ప్రాజెక్టుల నిర్వహణ భారంగా మారుతున్నాయి. – మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఆఫ్ బడ్జెట్ అప్పులకు వెళ్లాల్సి వస్తోంది. – హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100% నిరుద్యోగం – గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువత, మహిళల్లో నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100 శాతం నిరుద్యోగం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది. – ఆరోగ్య, పౌష్టికాహార అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలు, చిన్నారుల్లో ఎనీమియా (రక్తహీనత) పెరుగుతోంది. బరువు తక్కువ ఉండే చిన్నారులు, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. – ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరేలా 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉండాలని కోరుతున్నాం. -
స్థానిక సంస్థల నిధులు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం పెంచాలని స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్రం గ్రాంట్లు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం అందిస్తున్న గ్రాంట్లు తదితర అంశాలను అరవింద్ పనగరియా వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, వాణిజ్య సంస్థలతో చర్చించారు. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో బృందం సమావేశమైంది. ఈ భేటీలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, పీర్జాదిగూడ మేయర్ అమర్‌సింగ్, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజుతోపాటు 17 మున్సిపాలిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, సీడీఎంఏ గౌతం హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు సంకెపల్లి సు«దీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్, మల్కుడ్ రమేశ్, కార్యదర్శి స్మితా సబర్వాల్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం వ్యాపార వాణిజ్య సంస్థలైన అలీఫ్, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో ఆర్థిక సంఘం భేటీ అయింది. ఆర్థికంగా తోడ్పడాలన్న పార్టీల ప్రతినిధులు ఆర్థిక సంఘం బృందంతో వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరఫున టి. హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీల నుంచి కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల గురించి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు. కేంద్రం గ్రాంట్ల రూపంలో విరివిగా సాయం అందించాలని కోరారు. మరోవైపు హరీశ్‌రావు ఈ భేటీలో స్పందిస్తూ కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్‌చార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నా ఆ డబ్బును వాటా ప్రకారం రాష్ట్రాలకు పంచట్లేదని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. పన్నుల వాటా పెంచాలని కోరాం: హరీశ్‌రావు రాష్ట్రాలకు పన్నుల వాటా 41 శాతానికి బదులు 31 శాతమే వస్తోందని.. దీన్ని సవరించి 50 శాతం పన్నుల వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నేతర ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని.. స్థానిక సంస్థల గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలని కోరామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 40 వేల కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కోసం కూడా విజ్ఞప్తి చేశామన్నారు. పన్ను ఎక్కువగా చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వండి: ఈటల ఉమ్మడి ఏపీలో తెలంగాణకు 2.9 శాతం పన్నుల వాటా వస్తే.. 15వ ఆర్థిక సంఘం నాటికి 2.43 వాటా వచ్చిందని.. ఇప్పుడది 2.1 శాతంగా మారిందని 16వ ఆర్థిక సంఘానికి తెలియజేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్ను ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వాలని కోరినట్లు చెప్పారు. కాగా, పురపాలక పనుల్లో జీఎస్టీని మినహాయించాలని కోరినట్లు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్, చౌటుప్పల్ చైర్పర్సన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. -
అచ్చెన్నకు ఎమోషన్.. అన్నయ్యకు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రెండు డీఏలకు త్వరలో మోక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం(డీఏ) బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు బకాయిల్లో రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రెండు డీఏల ప్రతిపాదనలు, అవసర మైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. వీలును బట్టి సెప్టెంబర్‌లోనే ఈ రెండు డీఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభు త్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థై ర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే రెండు డీఏలను మంజూరు చేస్తూ అధి కారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. నెలకు రూ.150 కోట్ల భారంవాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరికి సంబంధించిన డీఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డీఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డీఏ కింద బేసిక్‌పేలో 3.64 శాతం వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. నాలుగు డీఏలు కలిపి అది 14.56 శాతానికి చేరుతుంది. ఇప్పుడు రెండు డీఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28 శాతం వేతనం ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడు తుందని ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ఈ లె క్కన రెండు డీఏలు కలిపి రూ.1,820 కోట్లు అవ సరమవుతాయి. అంటే ప్రతి నెలా రాష్ట్ర ఖజానాపై రూ.150 కోట్ల పైచిలుకు భారం పడనుంది. -
హిండెన్‌బర్గ్ వివాదం.. ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ తాజా నివేదికకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, దాని చైర్పర్సన్ మాధవీ పురీ బుచ్ ఇప్పటికే ప్రకటనలు చేశారని, దీనిపై తాము చెప్పడానికి ఇంకేమీ లేదని ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చీఫ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఇది పూర్తిగా నిరాధారమని, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కోసం ఇలాంటి అవాస్తవ నివేదికను హిండెన్‌బర్గ్ ఇచి్చందని బుచ్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెబీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలన్నింటినీ సెబీ చీఫ్ వెల్లడించారని స్పష్టం చేసింది. ‘సెబీతో పాటు చైర్పర్సన్ కూడా ఇప్పటికే స్పష్టంగా ప్రకటనలు చేశారు. ఈ ఉందంతపై ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యాఖ్యానించారు. కాగా, అదానీ గ్రూప్ కూడా ఈ నివేదిక దురుద్దేశపూరితమని, సెబీ చీఫ్‌తో తమకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ఖండించింది.బచ్‌కు రీట్స్ అసోసియేషన్ మద్దతుహిండెన్బర్గ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ బుచ్‌కు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్స్), ఆల్టర్నేట్ క్యాపిటల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమ చాంబర్లు మద్దతుగా నిలిచాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా సెబీ రీట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు ‘నిరాధారం, తప్పుదోవ పట్టించేవి’గా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) పేర్కొంది. ఈ కఠిన పరిస్థితు ల్లో తాము సెబీ చీఫ్ బుచ్ వెన్నంటే ఉన్నామని, మార్కె ట్ సమగ్రత, నియంత్రణపరమైన నియమావళి, ఇన్వెస్టర్ల రక్షణ విషయంలో సెబీ తిరుగులేని నిబద్ధతను కనబరిచిందని ఇండియన్ వెంచర్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసో సియేషన్ (ఐవీసీఏ) తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ చాంబర్ యాంఫీ కూడా ఇప్పటికే బుచ్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పు చేయలేదని నిరూపించుకోవాలి: హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ బుచ్‌పై హిండెన్‌బర్గ్ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. సెబీ పదవిలో కొనసాగుతున్న సమయంలో కూడా అదానీతో లింకులున్న ఫండ్స్‌లో వాటాలను కలిగి ఉండటంపై తాను ఎలాంటి తప్పు చేయలేదని బుచ్ నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తమపై హిండెన్‌బర్గ్ కావాలనే బురదజల్లుతోందని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలా రాద్ధాంతం చేస్తోందని బుచ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఇలా స్పందించింది. ‘బెర్ముడా/మారిషస్ విదేశీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని బుచ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, సంబంధిత ఫండ్‌ను తన భర్త చిన్ననాటి స్నేహితుడు నిర్వహించారని, దానిలో వినోద్ అదానీ అప్పుడు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు’ అని కూడా హిండెన్‌బర్గ్ పేర్కొంది. -
తొలి నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలు ఢమాల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలకు కొలమానంగా నిలిచే జీఎస్టీ ఆదాయం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తొలినెలల్లోనే పాతాళం బాట పట్టింది. కొన్నేళ్లుగా జీఎస్టీ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధిరేటును సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ జూలై నెలలో నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేసింది. గతేడాది జూలై నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల్లో పెరుగుదల నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గుదల నమోదైంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,346 కోట్లు. గతేడాది ఇదే నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,593 కోట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ ఆదాయం ఏడుశాతం క్షీణించింది. రూ.247 కోట్ల ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం తొమ్మిదిశాతం వృద్ధితో రూ.1.34 లక్షల కోట్ల (దిగుమతి వస్తువులు లేకుండా)కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీఎస్టీలోను కోత నమోదైంది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో ప్రీ సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ వసూళ్లు 10 శాతం, పోస్ట్ సెటిల్మెంట్ వసూళ్లు ఐదుశాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి రెండు నెలలుగా ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పెన్షన్లు పెంచడం తప్ప పరిపాలనను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయని, ఈ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై పడిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులో ఉంచకపోవడంతో భవననిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడం జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. భవననిర్మాణ పనులు జరిగితే సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్, కలప.. ఇలా అనేక వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఇసుక కొరత కారణంగా వ్యాపారాలు జరగడంలేదని పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు రావడంతో కొనుగోళ్లు సాగి వ్యాపారాలు కళకళలాడేవి. ఇప్పుడు ఆషాఢమాసం అని ఆఫర్లు పెట్టినా.. కొనుగోళ్లు లేవని రిటైల్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రికార్డు గతేడాది రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ 10 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆ శాఖ ఆదాయం రూ.50 వేలకోట్ల మార్కు దాటింది. 2023–24లో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.50,422.60 కోట్లకు చేరితే అందులో నికర జీఎస్టీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.32,029.62 కోట్లు (ఐజీఎస్టీ చెల్లింపులు పోగా). గత ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖలో రిటర్నులు దగ్గర నుంచి పన్ను చెల్లింపుల వరకు అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధికారుల ప్రమేయం లేకుండా వాహనాల తనిఖీకి ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్రూ్కట్నీలో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్రూ్కట్నీ ఆటోమేటెడ్ టూల్ వంటి ఎన్నో వ్యాపార అనుకూల చర్యలను చేపట్టడంతో ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. -
కేంద్ర పద్దుపై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2024–25) కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణాలేవైనా గత పదేళ్లుగా తెలంగాణ అవసరాలు, అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందని ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తామని చెపుతున్న తమకు ఏ మేరకు సాయమందుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపి స్తోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐల ఆధునీకర ణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్ బడ్జెట్ (బడ్జెటే తర) రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్ తగ్గింపు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవు తుందని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్ బడ్జెట్ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాయి. ఆ రెండిటిపై గంపెడాశలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దు లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నాయి. వీటిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉంటాయని, ఈ రెండు పద్దుల్లో కేటాయింపులు అటూ ఇటు జరిగితే మొత్తం బడ్జెట్ అంచనాలే తారు మారవుతాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పన్నుల్లో వాటా కింద రూ.26 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయి డ్ పద్దు కింద రూ.21 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రతిపాదించింది. ఇవి రెండూ కలిపి మొత్తం బడ్జెట్లో 17 శాతం కావడం గమనార్హం. కాగా కేంద్ర పన్నుల వాటాలో ఈసారి పెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తు న్నామని, అలాగే గత కొన్నేళ్లుగా ఆశించిన మేర ఇవ్వని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఈసారైనా అవసరం మేరకు కేటా యించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.నికర అప్పు సీలింగ్‌పై తేల్చండిజాతీయ రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీకి, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఆర్థిక సంఘం సిఫారసుల అమలుకు బడ్జెట్ కేటాయింపు, మహిళా శిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నికర అప్పుపై సీలింగ్‌ను కూడా బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే వెల్లడించాలని, తద్వారా తాము అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి జీఎస్టీ విధించకూడదని, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికేంద్రాన్ని కోరారు.ఈసారి బడ్జెట్లో తెలంగాణ ఆశిస్తున్నవివే..ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరు ద్ధరణ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, ఆఫ్బడ్జెట్ రుణాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు, సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు. నష్టాలకు తోడు బకాయిలు..!కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపో యింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రూ. 33,712 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని, నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన రూ.19,205 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.17,828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి రూ.5,374 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయని, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద రూ.2,250 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రూ.817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు రూ.723 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తులు, సూచనలపై తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే. -
బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం వికసించేనా?
మన దేశంలో బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్లో చర్యలు ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు. రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్మొబైల్: 99895 84665 -
ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేల కోట్లను రాష్ట్ర తుది బడ్జెట్లో కేటాయించాల్సిందిగా ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు అందించనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మధ్యంతర బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.28 వేల కోట్లను కేటాయించగా, అందులో రూ.18 వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకే పోనున్నాయని, రూ.2 వేల కోట్లు వేతనాలు, ఇతర ఖర్చులకు పోగా ఇక రూ.8 వేల కోట్లు మాత్రమే ప్రాజెక్టుల పనులకు మిగులుతాయని చెప్పారు. పనులు జరగాలంటే రూ.11 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ దిశగా పనులు ముమ్మరం చేస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యే ప్రాజెక్టులను ఏ– కేటగిరీలో చేర్చాలని ఆదేశించామని తెలిపారు. 2025లోగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపెండింగ్లో ఉన్న నీల్వాయి, పాలెంవాగు, మత్తడివాగు, పింప్రి, సదర్మట్, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), దేవాదుల, చనాకా కొరాటా, పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్, కొడంగల్–నారాయణపేట, అచ్చంపేట, ఎస్ఎల్బీసీ, సీతారామ, ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకు న్నామని మంత్రి తెలిపారు. ఇక 2025 మార్చి లేదా డిసెంబర్ లోపు కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను పూర్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. గోదావరి– కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తామని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనపై శాసనసభ సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు. నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను న్యాయనిపుణుల సలహా తీసుకున్నాక చేపడతామని తెలిపారు. సదర్మట్, రాజీవ్ కెనాల్ రెడీ: ఈ నెలాఖరున సదర్మట్ ప్రాజెక్టుతో పాటు ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టులో భాగంగా కట్టిన రాజీవ్ కెనాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని ఉత్తమ్ తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సదర్మట్ ప్రాజెక్టులో మిగిలిన పనులన్నీ సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావే శంలో నీటి పారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, డిప్యూ టీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.20న ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఉత్తమ్ భేటీకాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులతో చర్చించడానికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 20న ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అమలు, తుది నివేదికపై ఆ సంస్థ చైర్మన్ అనిల్ జైన్‌తో సమావేశం కానున్నారు. మధ్యంతర నివేదిక అమల్లో పురోగతిపై బుధవారం మంత్రి ఉత్తమ్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ జైన్‌తో ఫోన్లో మాట్లాడారు. నివేదికలో చేసిన సిఫారసుల మేరకు వానాకాలానికి ముందు బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు పూర్తి చేశామని చెప్పారు. కాగా తుది నివేదికను సత్వరం అందించాలని మంత్రి కోరారు. -
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనితో ‘పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచి్చందని‘ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆర్థిక శాఖ ఈ మేరకు పోస్ట్ చేసింది. జీఎస్టీకి పూర్వం అన్ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ మొదలైన వాటిపై 2.5–4 శాతం పన్ను ఉండేదని, కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాటిపై పన్నులు లేవని పేర్కొంది. అలాగే కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్ వేర్, ఫరి్నచర్ మొదలైన వాటిపై రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక, 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు మొదలైన వాటిపై 31.3 శాతం పన్నుల భారం ఉండేదని .. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇవి 18 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయని పేర్కొంది. 2023–24లో రూ. 2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉన్న ట్యాక్స్‌పేయర్లకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపునివ్వడంతో చిన్న స్థాయి ట్యాక్స్‌పేయర్లకు నిబంధనల భారం తగ్గిందని వివరించింది. 17 రకాల స్థానిక పన్నులు, సెస్సుల స్థానంలో జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత నుంచి నిబంధనలను పాటించడంతో పాటు ట్యాక్స్‌పేయర్ల బేస్ కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరినట్లు వివరించారు. -
కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ (బాండ్లు, సెక్యూరిటీల రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది. ‘‘మధ్యంతర బడ్జెట్లో అంచనాలకంటే తక్కువ రుణ సమీకరణ ప్రతిపాదనలు, జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి పరిమితం చేయడం, 2025–26 నాటికి 4.5 శాతానికి తగ్గించే చర్యలను ప్రకటించడంతో దేశీ బాండ్ ఈల్డ్ మార్చి త్రైమాసికంలో నెమ్మదించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, స్థిరమైన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు సహకరించాయి’’అని ఆర్థిక శాఖ వివరించింది. మరోవైపు ఇదే కాలంలో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.33 శాతం గరిష్ట స్థాయిని తాకినట్టు గుర్తు చేసింది. ద్రవ్యలోటు 3 శాతమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలో 3 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల (ఏప్రిల్, మే) కాలంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం తెలిసిందే. సాధారణంగా ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్న కాలంలో కొత్త ప్రాజెక్టులపై వ్యయాలకు కేంద్రం దూరంగా ఉంటుంది. ఇదే ద్రవ్యలోటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో ద్రవ్యలోటు మొత్తం ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో ద్రవ్యలోటు 5.1 శాతంగా (రూ.16,85,494 కోట్లు) ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మే చివరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లుగా ఉన్నట్టు సీజీఏ తెలిపింది. ఇక మొదటి రెండు నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పన్నుల ఆదాయం లక్ష్యంలో ఇది 12.3 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం వ్యయాలు ఏప్రిల్, మే చివరికి రూ.6.23 లక్షల కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాల్లో ఇది 13.1 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతంగా ఉండడం గమనార్హం.