ఆర్థిక శాఖ పరిశీలనలో ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) వ్యాపారం, లాభదాయకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పోస్టులను పెంచే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. 2019 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం పీఎస్‌బీల్లో ఒక సీజీఎం, నలుగురు జనరల్ మేనేజర్లు ఉండొచ్చు. అప్పట్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిలో విలీనం చేసిన అనంతరం జీఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు మధ్య సీజీఎం పోస్టును ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత నుంచి వ్యాపారం మెరుగుపడిన నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా పోస్టులను పెంచుకునే అవకాశాలు కలి్పంచాలని కేంద్ర ఆర్థిక శాఖను పీఎస్‌బీలు కొన్నాళ్లుగా కోరుతున్నాయి.
దీంతో తదుపరి వృద్ధి అవకాశాలను బ్యాంకులు అందిపుచ్చుకోవడంలో తోడ్పాటు అందించే దిశగా సీజీఎం పోస్టుల పెంపు ప్రతిపాదనలను ఆర్థిక సేవల విభాగం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 పీఎస్‌బీల్లో దాదాపు 4 లక్షల మంది ఆఫీసర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు 35 శాతం పెరిగి రూ. 1.4 లక్షల కోట్ల స్థాయిని దాటాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వాటా ఏకంగా 40 శాతం పైగా (రూ. 61,077 కోట్లు) ఉంది.
Comments
Please login to add a commentAdd a comment