Vacancy
-
పీఎస్బీల్లో సీజీఎం పోస్టుల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వ్యాపారం, లాభదాయకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పోస్టులను పెంచే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. 2019 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం పీఎస్బీల్లో ఒక సీజీఎం, నలుగురు జనరల్ మేనేజర్లు ఉండొచ్చు. అప్పట్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిలో విలీనం చేసిన అనంతరం జీఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు మధ్య సీజీఎం పోస్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వ్యాపారం మెరుగుపడిన నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా పోస్టులను పెంచుకునే అవకాశాలు కలి్పంచాలని కేంద్ర ఆర్థిక శాఖను పీఎస్‌బీలు కొన్నాళ్లుగా కోరుతున్నాయి. దీంతో తదుపరి వృద్ధి అవకాశాలను బ్యాంకులు అందిపుచ్చుకోవడంలో తోడ్పాటు అందించే దిశగా సీజీఎం పోస్టుల పెంపు ప్రతిపాదనలను ఆర్థిక సేవల విభాగం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 పీఎస్బీల్లో దాదాపు 4 లక్షల మంది ఆఫీసర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు 35 శాతం పెరిగి రూ. 1.4 లక్షల కోట్ల స్థాయిని దాటాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటా ఏకంగా 40 శాతం పైగా (రూ. 61,077 కోట్లు) ఉంది. -
విద్యుత్‌శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘విద్యుత్ శాఖలో పదేళ్లు గా ప్రమోషన్లు పెండింగ్‌లో ఉండగా, మా ప్రభుత్వమే ఇచ్చి0ది. ఎవరూ అడగక ముందే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఈ శాఖలో ఖాళీల కారణంగా ఉన్న వారిపై పనిభారం పడు తోంది. నెల,రెండు నెలల్లో వీటి భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధికారుల తో విద్యుత్, సంక్షేమ శాఖలపై మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. మార్పులపై ప్రత్యేక శిక్షణ వరదల సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని భట్టి అభినందించారు. అయితే శాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉందని, 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య వచ్చినా వినియోగదారులు 1912కు కాల్ చేయొచ్చని, 108 లాగే ఇది కూడా ఉపయోగపడుతుందన్నారు. పేరు, అడ్రస్ చెబితే అక్కడ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నందున ఉద్యోగులు చిన్నలోపం కూడా ఎదురుకాకుండా చూడాలన్నారు. మరమ్మతులు చేసిన కొన్నాళ్లకే టాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నందున, వ్యవస్థలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. మూసీ అంశం కొత్తది కాదు రెవెన్యూ రికార్డుల అప్డేట్ అంటూ.. గత పాలకులు బినామీల పేర్లపైకి భూములను బదలాయించారని భట్టి ఆరోపించారు. తాము మాత్రమే ఆక్రమణకు గురైన చెరువులను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకునేవారని, అందుకే మూసీ అంశాన్ని కేబినెట్లో చర్చించారా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. మూసీపై కేబినెట్లో చర్చించడానికి కొత్త అంశమేమీ కాదన్నారు. మూసీని శుభ్రం చేసి నగరం నడి»ొడ్డున స్వచ్ఛమైన నది ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, తాము చేసి చూపిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్‌లు సిద్ధం కాకముందే రూ.1.50 లక్షల కోట్లు వ్యయమవుతుందని చెప్పడం సరికాదని చెప్పారు. తాము గడీల్లో లేమని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సలహాలు ఇవొచ్చని భట్టి తెలిపారు. మైనింగ్ వ్యవస్థపై అధ్యయనం చేశాం అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొని ఆధునిక యంత్ర పరికరా లు, సాంకేతికతను వినియోగించి ఎక్కువ బొగ్గు వెలికితీయడం, బొగ్గు ఉత్పత్తిలో భద్రతా చర్యలను పరిశీలించామని భట్టి తెలిపారు. సింగరేణి పెద్ద మైనింగ్ వ్యవస్థ కావడంతో ఆ శాఖ మంత్రి గా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించానన్నా రు. దసరా కన్నా ముందే అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల పెండింగ్ బిల్లులు రూ.114 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేశామని, పిల్లల కాస్మోటిక్ చార్జీలను ఏ నెలకానెల అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అన్నీ క్లియర్ చేస్తామన్నారు. 2029–2030 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం పోస్టులు 435 కాగా, అందులో 351 ప్రాథమికఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 80 పోస్టులు డీఎంఈ పరిధిలో ఆస్పత్రుల్లో ఆర్ఎంఓ పోస్టులు. ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు నాలుగు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. బోర్డు వెబ్సైట్( https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో తేదీన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అదే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.58,850 నుంచి రూ.1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధితశాఖ నుంచి ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు.అంటే ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80 శాతంగా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకొని 80 శాతంగా మార్చుతారు. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పనిచేస్తున్నట్టు అనుభవ ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధ్రువ పత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఇతర ముఖ్యాంశాలు... » ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు సాఫ్ట్‌కాపీని దగ్గర ఉంచుకోవాలి. » ఆధార్ కార్డు, పదోతరగతి సర్టిఫికెట్ (పుట్టిన తేదీ రుజువుకు), ఎంబీబీఎస్ సమగ్ర మార్కుల మెమో, సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు, స్థానికతను తెలియజేసే స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి), ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీల విషయంలో నాన్–క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ఆదాయ, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీ వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికులు వయస్సు సడలింపునకు సరీ్వస్ సర్టిఫికెట్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కోసం సర్వీస్ సర్టిఫికోట్ అప్లోడ్ చేయాలి. » నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సరి్టఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో, ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే (అర్హతకు సమానమైనవి) వాటిని ’నిపుణుల కమిటీ’కి సిఫార్సు చేస్తారు. నిపుణులకమిటీ’ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది.» తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దర ఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్లకు అర్హులు కారు. » పోస్టులను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. » మల్టీ జోన్–1లో జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్. » మల్టీ జోన్–2 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ -
జిల్లాకో నోడల్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను కూడా నియమించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల ఏర్పాట్లతో పాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించారు. గ్రూప్– 1 పరీక్షల ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రానున్న మూడు వారాల పాటు నిఘా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్యాక్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థా యి గోడౌన్ల వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రతి విద్యారి్థకీ కనీసం జత యూనిఫాం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా? లేదా అనే విషయాన్ని నిర్ణిత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులివే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పోస్టుల భర్తీకి టైమ్‌లైన్.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి. -
ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గింది
సాక్షి, హైదరాబాద్: నివాస, కార్యాలయ స్థిరాస్తి వ్యాపారంలో ఐటీ రంగానికి ప్రధాన పాత్ర. ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని గృహాలను, కంపెనీల కోసం ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తుంటారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సీన్ మారింది. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో అపార్ట్మెంట్లకు గిరాకీ తగ్గడంతో పాటు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు ప్రధాన ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణేలలో ఆఫీస్ స్పేస్ వేకెన్సీగా ఉంది. కోవిడ్ తర్వాత నిర్మాణ సంస్థలు కూడా కొత్త కార్యాలయాల స్థలాల సరఫరాను తగ్గించి.. ఉన్న ఆఫీస్ స్పేస్‌ను భర్తీ చేయడంపై దృష్టి సారించాయి. కరోనా సమయంలో ఐటీ వ్యాపారం జోరుగా సాగడంతో పెద్ద, మధ్య తరహా సంస్థలు అప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ లీజులను పునరుద్ధరించారు. అదే సమయంలో లీజు స్థలాలను సొంతానికి కొనుగోలు చేయడమో లేదా కొత్త ఆఫీస్ స్పేస్‌ను తీసుకోవటమో చేయలేదు. ఎందుకంటే లీజు పునరుద్ధరణ కంటే స్థలం కొనుగోలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఐటీఈఎస్ రంగాల కంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), తయారీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. నాలుగు ప్రధాన ఐటీ హబ్ నగరాలలో చ.అ. ఆఫీస్ స్పేస్ ధర నెలకు రూ.58–78లుగా ఉండగా.. ఎన్సీఆర్, ముంబైలలో రూ.80–126లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 4 కోట్ల చ.అ. స్థలం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో 15 శాతం కంటే ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా మరో 4 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణ దశలో ఉందని, వచ్చే 2–3 ఏళ్లలో ఆయా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇతర నగరాల్లో.. ప్రస్తుతం అత్యధికంగా బెంగళూరులో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. 16.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. ఇందులో 11.25 శాతం స్పేస్ వేకెన్సీ ఉంది. కొత్తగా 4 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది. ► ముంబైలో 10.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 16 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా 1.5 కోట్ల చ.అ. కొత్త స్పేస్ కన్స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉంది. ► కోల్‌కతాలో 2.5 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 23.5 శాతం వెకెన్సీ ఉంది. సుమారు 20 లక్షల చ.అ. స్పేస్ ΄్లానింగ్ దశలో ఉంది. ► పుణేలో ప్రస్తుతం 6 కోట్ల చ.అ. స్పేస్ ఉండగా.. అత్యల్పంగా 8.5 శాతం స్థలం మాత్రమే వేకెన్సీ ఉంది. కానీ, కొత్తగా 1.3 కోట్ల చ.అ. స్థలం నిర్మాణ దశలో ఉంది. ► చెన్నైలో 5.5 కోట్ల చ.అ. అందుబాటులో ఉండగా.. 10.35 శాతం స్థలం ఖాళీగా ఉంది. కొత్తగా 1.5 కోట్ల చ.అ. స్పేస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ► ఎన్సీఆర్లో 12.8 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉండగా.. 28.5 శాతం వేకెన్సీ ఉంది. కొత్తగా 2.6 కోట్ల చ.అ. స్పేస్ నిర్మాణ దశలో ఉంది. నగరాల వారీగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ (చ.అ.) (కోట్లలో) నగరం ప్రస్తుత ఖాళీలు నిర్మాణంలోని స్థలం (%లో) స్థలం బెంగళూరు 16.8 11.25 4 హైదరాబాద్ 8 15 4 చెన్నై 5.5 10.35 1.5 పుణే 6 8.50 1.3 ఎన్సీఆర్ 12.8 28.50 2.6 ముంబై 10.8 16 1.5 కోల్‌కతా 2.5 23.50 20 లక్షలు -
ప్రైవేట్ జాబ్స్, ఒక్క పోస్ట్ కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి లక్షల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టేందుకు ఆయా దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ నియామకాల్లో జాబ్ కొట్టేందుకు అభ్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నట్లు టెక్ గిగ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో తేలింది. వచ్చే ఏడాది దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. అందుకోసం ఆయా కంపెనీలు ఇప్పటి నుంచి ఉద్యోగుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ తెలిపింది. అంతేకాదు కోవిడ్ తగ్గి వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉందని విడుదల చేసిన ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అయినా సరే ఒక్క జాబ్ కోసం ఐదుగురు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. టెక్ గిగ్ సంస్థ అభ్యర్ధులు ఏఏ కంపెనీల్లో జాబ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు? ఒక్క జాబ్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో పాల్గొన్న 43శాతం మంది టీసీఎస్‌లో జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో ఉండగా, ఇన్ఫోసిస్ 24%, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా 4% కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు జాబ్ దక్కించుకునేందుకు పోటీ పుడుతునట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 21% మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో జాబ్స్ డిమాండ్ ఎక్కువగా ఉందని, అదే సమయంలో అభ్యర్ధులు కూడా ఐటీ ఉద్యోగం దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో కంపెనీల్లో ఒక్క జాబ్ కోసం 5మంది పోటీపడుతున్నారని, వారిని షార్ట్ లిస్ట్ చేయడం కత్తిమీద సాములాగా మారిందని అంటున్నారు. ఐటీ రంగంలో టాలెంట్ వార్ డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు స్థిరంగా పెరుగుతుండగా.. సంస్థలు మాత్రం నైపుణ్యమైన అభ్యర్ధుల్ని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర..! -
బాస్.. నడిపించేవారేరీ ?
సాక్షి, గుంటూరు : జిల్లా పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. అర్బన్ జిల్లాలో ఏఎస్పీ అడ్మిన్, క్రైమ్ ఏఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ, ఎస్బీ సీఐ–1, రూరల్ జిల్లాలో ఎస్బీ డీఎస్పీ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, ఏఆర్ ఆర్ఐ, ఏవో పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన బదిలీల్లో ఇక్కడి జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ పరిస్థితి పోలీసింగ్పైన, పోలీసు పరిపాలనపైనా పడుతోంది. ఏఎస్పీ పోస్టులు ఖాళీ.. అర్బన్ జిల్లాలో ఏఎస్పీ క్రైమ్, ఏఎస్పీ అడ్మిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్‌గా పని చేస్తున్న వై.టి. నాయుడు ఇటీవల బదిలీ అయ్యారు. క్రైమ్ ఏఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు గత ఆగస్టులో పదవీ విరమణ పొందారు. నెల రోజుల అనంతరం ఈ నెల 4న వెయిటింగ్లో ఉన్న ఏఎస్పీ ఎం. శ్రీనివాస్‌ను క్రైమ్ ఏఎస్పీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన నేటికీ వచ్చి జాయిన్ అవ్వలేదు. అర్బన్ ఏఆర్ డీఎస్పీ పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంటోంది. ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ వెల్ఫేర్లతోనే బందోబస్తు, ఏఆర్ కానిస్టేబుళ్ల డ్యూటీలు, పరిపాలన తదిర వ్యవహారలను నెట్టుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ సీతరామయ్యను ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆ స్థానంలోకి కొత్త అధికారిని నియమించలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీగా, ఏఎస్పీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలను సీతరామయ్య చూసుకుంటున్నారు. అర్బన్ ఎస్బీ సీఐ–1 పోస్టు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని కొత్తపేట సీఐగా బదిలీ చేశారు. అనంతరం ఆ స్థానంలో ఎవరిని కేటాయించలేదు. నిఘా విభాగం అస్తవ్యస్తం.. స్పెషల్ బ్రాంచి(ఎస్బీ) పోలీసింగ్‌లో అత్యంత కీలకం. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ముందుగానే పసిగట్టి జిల్లా బాస్‌కు సమాచారం ఎస్బీ చేరవేస్తుంది. శాంతిభద్రతలు ఎక్కడ ఎలా ఉన్నాయో శోధిస్తుంది. ఈ విభాగంలో సీనియర్ అధికారులు ఉంటే క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను జోడించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు బాస్‌కు వెన్నుముకలా వ్యవహరిస్తారు. సుమారు మూడు నెలల క్రితం ఎస్బీ డీఎస్పీగా పని చేస్తున్న వెంకటనారాయణ బదిలీపై హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అనంతరం ఇక్కడికి కొత్త డీఎస్పీని కేటాయించలేదు. ఈ విభాగంలో సీఐ–2 పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఒక సీఐ మాత్రమే రూరల్ ఎస్బీని నడిపిస్తున్నారు. సీనియర్ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో రూరల్ ఎస్బీ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూరల్ జిల్లా ఏవో శివకుమార్ సుమారు మూడు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించలేదు. డీసీఆర్బీ డీఎస్పీ గోలి లక్ష్మయ్యకు ఏవోగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఈయన ఎక్కువ సమయం ఏవో విధులకే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో డీసీఆర్బీలో పర్యవేక్షణ కొరవడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ధర్మేంద్రబాబు గత జూలైలో కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. అనంతరం ఇక్కడ డీఎస్పీని కేటాయించలేదు. దీంతో సీఐతో మహిళా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు. డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని తెలుస్తోంది. దీనికి తోడు సిబ్బంది గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతున్నట్టు పోలీస్ శాఖలో చర్చ నడుస్తోంది. ఉన్నతాధికారులపైనే భారం.. అర్బన్, రూరల్ జిల్లాలో కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ, సీఐల పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండటంతో పోలీస్ బాస్‌లే వీటి పర్యవేక్షణ చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ అధికారులు లేకపోవడంతో ఈ మొత్తం భారం ఎస్పీలపైనే పడుతోంది. సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర వీఐపీలు, వీవీఐపీలు నివాసం ఉంటూ నిత్యం పర్యటించే జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఎస్పీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. డీజీపీ, ఐజీలు దృష్టి సారించాలి... రాజధాని జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో కేసుల విచారణ, బందోబస్తు, పరిపాలన మొదలైన వ్యవహారాలపై ప్రభావం పడుతోంది. కావున డీజీపీ, ఐజీలు ఖాళీగా ఉన్న కీలక పోస్టులపై దృష్టి సారించి వీలైనంత త్వరగా ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. లేని పక్షంలో శాంతిభద్రతలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. -
30న శ్రీరామ్ చిట్స్ జాబ్ మేళా
వికారాబాద్ రూరల్ : శ్రీరామ్ చిట్స్‌లో 20 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30న పట్టణంలోని సబ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎక్సిక్యూటివ్స్ యూనిట్ మేనేజర్స్ కోసం ఏదైనా డిగ్రీ చదివి ఉండాలన్నారు. వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని జీతం రూ. 10 వేల నుంచి 14.500 వరకు ఉంటుందన్నారు. ఇందు కోసం బయోడేటా, రేషన్‌కార్డు, మూడు ఫోటోలు ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9951723428 నెంబర్లను సంప్రదించాలన్నారు. -
నో క్లియర్
♦ కుప్పలు.. తెప్పలు.. ♦ అన్ని విభాగాల్లో పేరుకుపోతున్న ఫైళ్లు ♦ ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు ఇందూరు : జిల్లాలో ప్రధాన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నారుు. ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు ఉండటంతో అటు సొంత శాఖకు.. ఇటు అదనంగా ఇచ్చిన శాఖకు న్యాయం చేయలేక పోతున్నారు. కార్యాలయూల్లో చాలా ఫైళ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోరుు పెండింగ్‌లో ఉంటున్నారుు. వీటికి సంబంధించిన వారు పనులు కాక కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడు అధికారులు లేక వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు ఉసురుమని వెళ్తున్నారు. ఆర్డీవో కార్యాలయంలో పేరుకుపోయాయ్.. జిల్లాకే జిల్లా రెవెన్యూ కార్యాలయం తలమానికం. దీనికి కలెక్టర్ పరిపాలన విభాగం అని మరో పేరు కూడా ఉంది. జిల్లా కలెక్టర్‌కు ప్రతీ ఫైలు ఇక్కడి నుంచే వెళ్తుంది. మొత్తంగా చెప్పాలంటే కలెక్టర్ పరిపాలన ఇక్కడి నుండే జరుగుతుంది. ప్రజాసమస్యలు మొదలుకుని అధికార యంత్రాంగం వరకు ఇదే మూల సముదాయం. మండల పరిషత్‌ల పరిపాలనను చూసుకోవడం, ఇతర పనులు చాలనే ఉంటాయి. ఇటు కలెక్టర్ పరిపాలన విభాగంలో మూడు రెవెన్యూ డివిజన్ అధికారులు కార్యాలయాలతోపాటు మండల తహసీల్దార్ కార్యాలయాలను చూసుకోవాలి. ఉద్యోగుల వేతనాలు, గన్ లెసైన్స్, లా అండ్ ఆడర్స్, ఆపద్బంధు, భూమి, కోర్టు కేసులు, ఎన్నికలు, ప్రజావాణి, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, ప్రోటోకాల్, మీసేవా, ఇతరాత్ర చాలా పనులు డీఆర్వో కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇవే కాకుండా కలెక్టర్, జేసీలు చెప్పిన పనులు కూడా ఉంటాయి. ఈ శాఖకు ఏడు నెలలుగా రెగ్యూలర్ డీఆర్వో లేక ఇన్చార్జి పాలనలో కొనసాగుతోంది. ఇన్చార్జి అధికారిగా జెడ్పీ సీఈఓ మోహల్లాల్ను నియమించారు. జెడ్పీ కూడా పెద్దదే. దీనికితోడు ఆర్డీవో పెద్ద విభాగ సమావేశాలు, పర్యవేక్షణ, మరో పక్కా ఫైళ్లను చూసి వాటిపై సంతకాలు చేసి పంపాలంటే తలకు మించిన భారంగా తయారైంది. కలెక్టర్‌కు సంబంధించిన ఫైళ్లు క్లియర్ అవుతున్నా.. మండలాలకు చెందిన, ఇతర ఫైళ్లు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెగ్యులర్ డీఆర్వోను ప్రభుత్వం నియమిస్తే తప్పా ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలా ఉండగా రెగ్యులర్ డీఆర్వో లేకపోవడంతో కొంత మంది ఉద్యోగులకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందనే విమర్శలు ఉన్నారుు. ♦ మైనార్టీ కార్పొరేషన్‌కు రెగ్యులర్ ఈడీగా పని చేస్తున్న ప్రేమ్‌కుమార్ అదనంగా మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా, మరో పక్క రాజీవ్ విద్యా మిషన్‌కు ప్రాజెక్టు డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూట కో శాఖలో గంటకో కూర్చీలో కూర్చుంటున్నారు. దీంతో తన సొంత శాఖతోపాటు అదనంగా ఉన్న శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు. పనులు, ప్రజా సమస్యలు త్వరగా పూర్తి కావడం లేదు. ♦ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ డిప్యూటీ డెరైక్టర్‌గా కొనసాగుతూ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు ఇన్‌చార్జ్జి అధికారిగా పనిచేస్తున్నారు. రెండు పెద్ద శాఖలే కావడంతో కార్యకలాపాలు చూసుకోవడం కష్టంగా మారింది. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. ఫైళ్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ♦ జిల్లా బీసీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ అధికారిగా పని చేస్తున్న విమలాదేవికి అదనంగా బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. స్టడీ సర్కిల్ నగర శివారులో దూరంగా ఉండటంతో అక్కడి వరకు వెళ్లి విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారింది. ఫైళ్లపై సంతకాలు కావాలంటే స్టడీ సర్కిల్ సిబ్బంది ఐదు ఏడు కిలో మీటర్లు ప్రయాణించి కలెక్టర్‌లో ఆమెతో సంతకాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ♦ యువజన సంక్షేమ శాఖకు రెగ్యులర్ సీఈఓగా పని చేస్తున్న ఉపేందర్ అనదనంగా అర్బన్ ఐకేపీ మెప్మా, టూరిజం శాఖలకు ఇన్చార్జి అధికారిగా పని చేస్తున్నారు. మూడు శాఖలను తాను ఒక్కడే చూసుకోవడం కష్టంగా మారింది. ఫైళ్లను చూసేందుకు సమయం దొరకడం లేదు. -
రిటైర్మెంట్ వయసును పెంచం
శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచే ప్రసక్తే లేదని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు.