సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్‌లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు.
అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment