professor
-
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, కవి, రచయితగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యతో గత నెల 19న నిమ్స్‌లో చేరారు. నిమ్స్ డైరెక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి స్పెషల్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడుతోందని అనుకుంటుండగా ఇతర సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది. శనివారం రాత్రి 8.36 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస హైట్స్‌లోని స్వగృహానికి సాయిబాబా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద ఆయన భౌతికకాయాన్ని కొద్ది సమయం ఉంచుతామని కుటుంబ సభ్యులు చెప్పారు.బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే అంతిమయాత్ర 4 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి చేరుతుందని, సాయిబాబా కోరిక మేరకు ఆయన పారి్థవ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయన తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. అమలాపురం నుంచి హస్తిన దాకా.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన నాగ సాయిబాబాకు ఐదేళ్ల వయస్సులోనే పోలియోతో రెండుకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అయినప్పటికీ స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరిలో ఆయనను పదవి నుంచి తొలగించారు. పదేళ్లు అండా సెల్లో జైలు శిక్ష సాయిబాబా అరెస్టు అనంతరం కేసును విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు 2017లో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బాంబే హైకోర్టు 2022లో ఆయనపై కేసును కొట్టివేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. బాంబే హైకోర్టు సాయిబాబా నిర్దోషి అని మళ్లీ తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది మార్చిలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీనికి ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లోని అండా సెల్లో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఉండగానే సాయిబాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైనా అనారోగ్య సమస్యలు కొనసాగడంతో కోలుకోలేకపోయారు. సాయిబాబా మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. నిమ్స్ మార్చురీలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: హరగోపాల్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిర్బంధ వ్యతిరేక వేదిక కనీ్వనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో–కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాఘవాచారి, కె.రవిచందర్‌లు జోహార్లు అరి్పంచారు. సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయారని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.జైల్లో మగ్గిపోవడమే కారణం అక్రమ కేసులతో అన్యాయంగా జైలుకు వెళ్లి అక్కడే మగ్గిపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకొని బయటకు వచ్చారు. మళ్లీ ప్రజల కోసమే పనిచేయాలనుకున్నారు. కానీ జైల్లో చుట్టుముట్టిన అనారోగ్యం నుంచి కోలుకోలేక పోయారు. చిన్న ఆపరేషన్ చేసినా శరీరం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిమ్స్‌లో చికిత్స విజయవంతం అయినా తర్వాత తలెత్తిన ఇబ్బందులతో కన్నుమూశారు. – సాయిబాబా భార్య వసంత, కుమార్తె మంజీరా‘హింసల కొలిమిలో పదేళ్లు’ తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్ర హింసల కొలిమిలో మగ్గిపోయానని ప్రొఫెసర్ సాయిబాబా ఈ ఏడాది ఆగస్టు 23న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వాపోయారు. తన నిర్బంధం, అందుకు కారణాలు, తొమ్మిదేళ్ల జైలు జీవితంలో పడిన కష్టాలు, జైళ్లలో అంతర్గత రాజకీయాలు ఇలా అనేక అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్యహింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు ప్రయత్నించడం, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. జైల్లో నాకు సరైన వైద్యం అందించలేదు. పదేళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వైద్యం లేక నా ఎడమచేయి కూడా పడిపోయింది. పోలియో తప్ప ఏ ఇతర వ్యాధి లేని నేను 21 రకాల జబ్బుల బారినపడ్డా..’ అని చెబుతూ సాయిబాబా భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యమంతా అమలాపురంలోనే.. డిగ్రీ వరకూ ఇక్కడే చదివిన సాయిబాబాఅమలాపురం టౌన్: మానవ హక్కుల కార్యకర్త, విద్యావేత్త, కవి, రచయిత ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా బాల్యం, డిగ్రీ వరకు విద్యాభ్యాసమంతా అమలాపురంతో పాటు పరిసర గ్రామాల్లోనే సాగింది. సాయిబాబా కుటుంబం దాదాపు 40 ఏళ్ల కిందట అమలాపురాన్ని విడిచి హైదరాబాద్‌కు వెళ్లగా.. అమలాపురం, నల్లమిల్లి, సన్నవిల్లి తదితర గ్రామాల్లో ఆయనకుఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణవార్త తెలియగానే వారంతా కన్నీరుమున్నీరయ్యారు. నల్లమిల్లి నుంచి ఢిల్లీకి.. సాయిబాబా స్వగ్రామం అమలాపురం రూరల్ మండలంలోని నల్లమిల్లి. ఆయన తండ్రి సత్యనారాయణమూర్తి ఒక సన్నకారు రైతు. తల్లి సూర్యావతి గృహిణి. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయిబాబా, రెండో కుమారుడు రామదేవ్. సాయిబాబాకు ఐదేళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. వీల్‌చైర్‌కే పరిమితమైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టువీడకుండా నల్లమిల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తొలుత తమ అమ్మమ్మ ఊరు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో వారి కుటుంబం ఉండేది. ఆ తర్వాత అమలాపురంలోని అద్దె ఇంట్లోకి మారారు. అక్కడే సాయిబాబా.. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం వారి కుటుంబం అమలాపురంలోని గాం««దీనగర్‌లో ఇల్లు నిరి్మంచుకుంది. సాయిబాబా ఇంటరీ్మడియెట్, డిగ్రీ చదువు అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనే సాగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రుల మృతితో సాయిబాబా, ఆయన సోదరుడు రామదేవ్ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. అన్యాయాన్ని సహించడు.. చిన్నతనం నుంచే సాయిబాబా ప్రశి్నంచేతత్వంతో ఉండేవాడు. అన్యాయాన్ని సహించేవాడు కాదు. నాకు కజిన్ అయిన సాయిబాబా మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డా. – గోకరకొండ గంగాజలం, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, ఉప్పలగుప్తం నిరాధార ఆరోపణలతో హింసించారు మానవ హక్కుల వేదిక నాయకుడిగా, కవిగా, ప్రొఫెసర్‌గా సాయిబాబు ప్రజలు, విద్యార్థుల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. దివ్యాంగుడైన వ్యక్తి.. ప్రభుత్వానికి ఎలా హాని తలపెడతారనే ఆలోచన లేకుండా కేంద్రం తొమ్మిదేళ్ల పాటు జైల్లో హింసించింది. లేకపోతే ఆయన మరిన్ని సంవత్సరాలు జీవించేవారు. పరోక్షంగా ఆయన మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత. – నామాడి శ్రీధర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు, అంబాజీపేటసీపీఎం, సీపీఐ సంతాపంసాక్షి, అమరావతి: ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతిపట్ల సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై 24 గంటలు దాటినా కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. దశలవారీ ఉద్యమాలకు ప్రభుత్వ వైద్యుల సంఘం సమాయత్తమవుతోంది. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును శనివారం ఎమ్మెల్యే నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టుకు వైద్య విద్యార్థినులు సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకాలంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్‌లు వేస్తున్నారని, వైద్య విద్యార్థినులతోపాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు గతంలోనే తెలియచేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు రంగరాయ కళాశాల యాజమాన్యంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బెట్టింగ్‌రాయుళ్లను వెనకేసుకువస్తూ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధిత ప్రొఫెసర్ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులు, దాడితో ఫోరెన్సిక్ హెచ్‌వోడీ ఉమామహేశ్వరరావు మానసిక ఆందోళనతో ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్యసంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావును కలిసి సంఘీభావం తెలిపారు. కాగా, ఎమ్మెల్యే నానాజీ తీరును గర్హిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఆదివారం ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంఘ అధ్యక్షుడు డాక్టర్ జయధీర్‌బాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీ ఆందోళనకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక న్యాయ సాధన సమితి డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ భానుమతి, ప్రధాన కార్యదర్శి నవీన్‌రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్‌కుమార్, ముఖ్య సలహాదారులు అడ్వకేట్ జవహర్ అలీ, అయితాబత్తుల రామేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి జి.ఆస్కార్‌రావు, జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు డాక్టర్ ఉమామహేశ్వరరావును పరామర్శించారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ మొక్కుబడిగా స్పందించారు. వైద్యులకు, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేనూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా‘ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించాను. నేనేదో తగువు సెటిల్ చేద్దామని ఆర్ఎంసీ హాస్టల్‌కు వెళ్లాను. అక్కడ నేనే తగువులో పడిపోయాను. దానికి ఇప్పుడు సభాముఖంగా డాక్టర్‌కు సారీ చెబుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న అలా ఉన్నాను. తిరుపతి లడ్డూ విషయంలో ఎవరో చేసిన తప్పునకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయనే దీక్ష చేపడుతున్నప్పుడు ఆయన పార్టీలో ఉండి, నేను తప్పు చేసి నేను ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదని భావించి సోమవారం కాకినాడ గొడారిగుంట ఇంటి వద్ద దీక్ష చేపడుతున్నాను’ అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అయితే ఈ ప్రకటనపై పార్టీనేతలు విస్తుపోతున్నారు. నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు అన్నట్టుగా ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: కురసాల కన్నబాబుజనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచిత ప్రవర్తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష్యుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. వైద్యుడిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల దురుసు ప్రవర్తన, వ్యవహారశైలి, దాడి జనమంతా వీడియోల్లో చూశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాల్సిందే. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చితం అంటూ దీక్షలు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదన్నారు.ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా..ఈ ఘటనపై శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంతపాటిల్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు అందుబాటులో లేదు. దీంతో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీరామకోటేశ్వరరావు, సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. రెండుచోట్లా ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.మరోవైపు కేసు విషయంలో వితండ వాదన జరుగుతోంది. వైద్యుడు స్వయంగా ఫిర్యాదు చేయలేదు, ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ పృథ్వీ చెబుతున్నారు. వైద్యుడిని చంపుతానని బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎందుకు కేసు నమోదు చేయలేదని వైద్యులు, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనప్రభుత్వ వైద్యుల సంఘంసాక్షి, అమరావతి: ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ను ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశం వివరాలను అధ్యక్షుడు డాక్టర్ జయ«దీర్ మీడియాకు విడుదల చేశారు. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు.ప్రొఫెసర్‌పై దాడి హేయందాడికి పాల్పడ్డ జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబుసాక్షి, అమరావతి: మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హామీలు అమలు చేయలేక దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నాయకులను దాడులకు ప్రేరేపించడం, ఆ తర్వాత వారే క్షమాపణలు చెబుతున్నట్టు డ్రామా చేయడం నిత్యకృత్యమైందన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్, కాలేజీ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అసభ్య పదజాలంతో దూషించి చెంప దెబ్బకొట్టడం, జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు తార్కాణమన్నారు. దళిత అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు వైఎస్సార్ïÜపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత అధికారిని అసభ్యంగా దూషించి దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెబితే చాలా!ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సురేష్చల్లపల్లి (అవనిగడ్డ): విధి నిర్వహణలో ఉన్న దళిత ప్రొఫెసర్‌పై అందరూ చూస్తుండగా దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు ప్రశ్నించారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసే ప్రజాప్రతినిధులు, వ్యక్తులపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులు అధికారులపై దాడులు పరిపాటిగా మారాయని చర్యకు ప్రతిచర్య ఉండాలన్నారు. దాడిని ఖండించిన జూడాలుసాక్షి, అమరావతి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడటాన్ని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) తీవ్రంగా ఖండించింది. ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడి, దుర్భాషలాడిన ఘటన ఆరోగ్య సంరక్షకులను అగౌరవపరచడమేనని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రొఫెసర్‌పై దాడి హేయం ఏపీ ఏఎఫ్‌ఎంటీ అధ్యక్షుడు సాయిసుదీర్కర్నూలు (హాస్పిటల్): ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి హేయమైన చర్య అని ఏపీ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ (ఏపీ ఏఎఫ్‌ఎంటీ) అధ్యక్షుడు డాక్టర్ టి.సాయిసుధీర్ ఖండించారు. ఏపీ ఏఎఫ్‌ఎంటీ, ఏపీ జీడీఏ, ఏపీ జేయూడీఏ, ఐఎంఏ సంస్థలను సంప్రదించి తదనంతర కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాడి సిగ్గుచేటువైఎస్సార్సీపీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు మెహబూబ్లబ్బీపేట (విజయవాడ తూర్పు): విధుల్లో ఉన్న మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ బండబూతులు తిడుతూ దాడికి పాల్పడటం దుర్మార్గమని, సిగ్గుపడాల్సిన అంశమని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు
గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG).. 'ప్రొఫెసర్ జగదీష్ షెత్' 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఈయన చేసిన కృషిని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించింది.2024లో ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్ కాన్స్టాంటైన్ ఎస్. కాట్సికేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి రాబిన్ కౌల్టర్, మోల్డే యూనివర్సిటీ నుంచి కార్లోస్ సౌసా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.సుమారు 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్‌లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన ప్రొఫెసర్ షెత్.. ఈ రంగానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారు. ఇందులో ఒకటి 'ది గ్లోబల్ రూల్ ఆఫ్ త్రీ'. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క జార్జ్ ఆర్. టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఇప్పటికే ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
సుల్తాన్‌బజార్: తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పోలీసులకు కోరారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు టెమూజియన్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. తనకు లక్ష్మీ గౌతమితో వివాహం అయినప్పటి నుండి ఆమె మానసికంగా శారీరకంగా హింసిస్తుందని ఆయన తెలిపారు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నారు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమాలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. నగరంలోని మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నట్లు వివరించారు. తమకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పెళ్లి అయినప్పటి నుండి అకారణంగా హింసిస్తోందని వాపోయాడు. పలు మార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారలేదన్నారు. ఇటీవల చంపేందుకు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై స్థానిక అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నంచారు. ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. -
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ నిషేధిత డ్రగ్స్ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ 2014లో తెయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్ (డిప్యుటేషన్) పీరియడ్ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ బయోమెట్రిక్ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి రావడంతో శ్రీనివాస్ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెడికెమ్ ల్యాబ్.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులో మెడికెమ్ ల్యాబ్ అనే సంస్థలో శ్రీనివాస్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్ అయిన వారిలో తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్ పోలీస్ అధికారులు గత నెల 22న అరెస్ట్ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇవి చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్.. -
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
ప్రొఫెసర్ కారు బీభత్సం
శివాజీనగర: నగరంలో ఓ విద్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ కారు అదుపుతప్పి విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. శనివారం మహారాణి క్లస్టర్ కాలేజీ ఆవరణలో వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు... ఇంగ్లిష్ ప్రొఫెసర్ హెచ్.నాగరాజు కారు తీసుకొని వర్సిటీకి వచ్చారు, కారును పార్క్ చేస్తూ బ్రేక్‌కి బదులుగా యాక్సిలేటర్‌ను నొక్కడంతో కారు వేగంగా దూసుకెళ్లి దారిలో వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది, అలాగే మరో రెండు కార్లను ఢీకొని నిలిచిపోయింది. మొత్తం మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అశ్విని (19) అనే బీకాం విద్యార్థినికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది, మరో యువతి నందుప్రియకు స్వల్ప గాయాలు తగిలాయి, నాగరాజుకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. డీసీపీ ఘోర్పడే ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడుతూ, నిందితుడు నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో మరో ప్రొఫెసర్‌కు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
అగ్రరాజ్యంలో తెలుగు తేజం
తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు గుంటూరుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమైన వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని గొప్ప విద్యాలయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలకు అవసరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ నీలి విశాఖపట్నంలో చదువుకున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసిగానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేశారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు హంటింగ్టన్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కస్టమర్ ఆఫీ సర్గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్ టీచర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్ ఎచీవ్మెంట్’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు. -
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
చాట్‌జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్..
ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు. తమ ఫైనల్ ఎగ్జామ్స్‌లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
ప్రొఫెసర్ విద్యావర్ధిని సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ చేసిన అవకతవకలు, అక్రమాల్లో పాలుపంచుకున్న వృక్షశాస్త్రం ప్రొఫెసర్ విద్యావర్ధినిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పాలకమండలి తీర్మానించింది. బుధవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో టీయూ పాలకమండలి సమావేశం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ ఆధ్వర్యంలో జరిగింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరు కాకపోవడంతో వాకా టి కరుణ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చ నిర్వహించి కొన్ని తీర్మానాలు చేశారు. పాలకమండలి అను మతి లేకుండా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన విద్యావర్ధిని పదవీకాలాన్ని గుర్తించేది లేదని నిర్ణయించారు. పైగా వీసీ విచ్చలవిడిగా చేపట్టిన అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకల్లో పాలుపంచుకుని ఇష్టారీతిన సంతకాలు పెట్టినందున విద్యావర్ధినిని ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానించారు. ఈ సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఆర్థిక అవకతవకలపై విచారణ పూర్తయ్యేవరకు విద్యావర్ధిని వర్సిటీలోకి రావొద్దని ఆంక్షలు పెట్టారు. విద్యావర్ధిని నిర్ధోషిగా నిరూపించుకుంటేనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు అక్రమ మార్గంలో రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న అకడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ పాలకమండలి తీర్మానించింది. -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం