ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలి
హైదరాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.నాగాసాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని పౌర, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బొజ్జాతారకం, రవిచంద్ర, దుడ్డు ప్రభాకర్, ప్రొఫెసర్.లక్ష్మణ్, బల్లా రవీంద్రనాథ్, చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ వికలాంగుడైన సాయిబాబాను పోలీసులు చ ట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. సాయిబాబా కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మావోలు, టైస్ట్‌లతో సంబంధాలున్నాయని ప్రచారం చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
సాయిబాబా ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతున్నారనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్) సంయుక్త కార్యదర్శిగా ఉండి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, అందుకే ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులతో కిడ్నాప్ చేయించిందన్నారు. సాయిబాబాను విడుదల చేసే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సాయిబాబా తల్లి సూర్యవతి మాట్లాడుతూ వికలాంగుడైన తన కూమారుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నకేసు అయితేనే పరిధి దాటిరాని పోలీసులు గడ్చిరౌలి నుండి ఢిల్లీకి వెళ్లి ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోటి, రివేరా తదితరులు పాల్గొన్నారు.