అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
విద్యావేత్త, హక్కుల ఉద్యమకారుడిగా సాయిబాబాకు గుర్తింపు
మావోలతో సంబంధాల ఆరోపణలతో పదేళ్లు జైలు జీవితం
ఇటీవలే విడుదలైనా వెంటాడిన అనారోగ్య సమస్యలు
నేడు ఆయన భౌతికకాయం గాంధీ ఆస్పత్రికి అప్పగింత
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, కవి, రచయితగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యతో గత నెల 19న నిమ్స్‌లో చేరారు. నిమ్స్ డైరెక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి స్పెషల్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడుతోందని అనుకుంటుండగా ఇతర సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది. శనివారం రాత్రి 8.36 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస హైట్స్‌లోని స్వగృహానికి సాయిబాబా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద ఆయన భౌతికకాయాన్ని కొద్ది సమయం ఉంచుతామని కుటుంబ సభ్యులు చెప్పారు.
బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే అంతిమయాత్ర 4 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి చేరుతుందని, సాయిబాబా కోరిక మేరకు ఆయన పారి్థవ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయన తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.
అమలాపురం నుంచి హస్తిన దాకా..
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన నాగ సాయిబాబాకు ఐదేళ్ల వయస్సులోనే పోలియోతో రెండుకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అయినప్పటికీ స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. 2013లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరిలో ఆయనను పదవి నుంచి తొలగించారు.
పదేళ్లు అండా సెల్‌లో జైలు శిక్ష
సాయిబాబా అరెస్టు అనంతరం కేసును విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు 2017లో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బాంబే హైకోర్టు 2022లో ఆయనపై కేసును కొట్టివేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. బాంబే హైకోర్టు సాయిబాబా నిర్దోషి అని మళ్లీ తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది మార్చిలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీనికి ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లోని అండా సెల్‌లో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు.
జైల్లో ఉండగానే సాయిబాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైనా అనారోగ్య సమస్యలు కొనసాగడంతో కోలుకోలేకపోయారు. సాయిబాబా మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. నిమ్స్ మార్చురీలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం పలువురు సందర్శించి నివాళులరి్పంచారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: హరగోపాల్
ప్రొఫెసర్ సాయిబాబాకు నిర్బంధ వ్యతిరేక వేదిక కనీ్వనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో–కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాఘవాచారి, కె.రవిచందర్‌లు జోహార్లు అరి్పంచారు. సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయారని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
జైల్లో మగ్గిపోవడమే కారణం
అక్రమ కేసులతో అన్యాయంగా జైలుకు వెళ్లి అక్కడే మగ్గిపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకొని బయటకు వచ్చారు. మళ్లీ ప్రజల కోసమే పనిచేయాలనుకున్నారు. కానీ జైల్లో చుట్టుముట్టిన అనారోగ్యం నుంచి కోలుకోలేక పోయారు. చిన్న ఆపరేషన్ చేసినా శరీరం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిమ్స్‌లో చికిత్స విజయవంతం అయినా తర్వాత తలెత్తిన ఇబ్బందులతో కన్నుమూశారు.
– సాయిబాబా భార్య వసంత, కుమార్తె మంజీరా
‘హింసల కొలిమిలో పదేళ్లు’
తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్ర హింసల కొలిమిలో మగ్గిపోయానని ప్రొఫెసర్ సాయిబాబా ఈ ఏడాది ఆగస్టు 23న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వాపోయారు. తన నిర్బంధం, అందుకు కారణాలు, తొమ్మిదేళ్ల జైలు జీవితంలో పడిన కష్టాలు, జైళ్లలో అంతర్గత రాజకీయాలు ఇలా అనేక అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్యహింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు ప్రయత్నించడం, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. జైల్లో నాకు సరైన వైద్యం అందించలేదు. పదేళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వైద్యం లేక నా ఎడమచేయి కూడా పడిపోయింది. పోలియో తప్ప ఏ ఇతర వ్యాధి లేని నేను 21 రకాల జబ్బుల బారినపడ్డా..’ అని చెబుతూ సాయిబాబా భావోద్వేగానికి లోనయ్యారు.
బాల్యమంతా అమలాపురంలోనే..
డిగ్రీ వరకూ ఇక్కడే చదివిన సాయిబాబా
అమలాపురం టౌన్: మానవ హక్కుల కార్యకర్త, విద్యావేత్త, కవి, రచయిత ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా బాల్యం, డిగ్రీ వరకు విద్యాభ్యాసమంతా అమలాపురంతో పాటు పరిసర గ్రామాల్లోనే సాగింది. సాయిబాబా కుటుంబం దాదాపు 40 ఏళ్ల కిందట అమలాపురాన్ని విడిచి హైదరాబాద్‌కు వెళ్లగా.. అమలాపురం, నల్లమిల్లి, సన్నవిల్లి తదితర గ్రామాల్లో ఆయనకుఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణవార్త తెలియగానే వారంతా కన్నీరుమున్నీరయ్యారు.
నల్లమిల్లి నుంచి ఢిల్లీకి..
సాయిబాబా స్వగ్రామం అమలాపురం రూరల్ మండలంలోని నల్లమిల్లి. ఆయన తండ్రి సత్యనారాయణమూర్తి ఒక సన్నకారు రైతు. తల్లి సూర్యావతి గృహిణి. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయిబాబా, రెండో కుమారుడు రామదేవ్. సాయిబాబాకు ఐదేళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. వీల్‌చైర్‌కే పరిమితమైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టువీడకుండా నల్లమిల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తొలుత తమ అమ్మమ్మ ఊరు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో వారి కుటుంబం ఉండేది. ఆ తర్వాత అమలాపురంలోని అద్దె ఇంట్లోకి మారారు. అక్కడే సాయిబాబా.. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం వారి కుటుంబం అమలాపురంలోని గాం««దీనగర్‌లో ఇల్లు నిరి్మంచుకుంది. సాయిబాబా ఇంటరీ్మడియెట్, డిగ్రీ చదువు అమలాపురం ఎస్‌కేబీఆర్ కాలేజీలోనే సాగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రుల మృతితో సాయిబాబా, ఆయన సోదరుడు రామదేవ్ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు.
అన్యాయాన్ని సహించడు..
చిన్నతనం నుంచే సాయిబాబా ప్రశి్నంచేతత్వంతో ఉండేవాడు. అన్యాయాన్ని సహించేవాడు కాదు. నాకు కజిన్ అయిన సాయిబాబా మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డా. – గోకరకొండ గంగాజలం, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, ఉప్పలగుప్తం
నిరాధార ఆరోపణలతో హింసించారు
మానవ హక్కుల వేదిక నాయకుడిగా, కవిగా, ప్రొఫెసర్‌గా సాయిబాబు ప్రజలు, విద్యార్థుల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. దివ్యాంగుడైన వ్యక్తి.. ప్రభుత్వానికి ఎలా హాని తలపెడతారనే ఆలోచన లేకుండా కేంద్రం తొమ్మిదేళ్ల పాటు జైల్లో హింసించింది. లేకపోతే ఆయన మరిన్ని సంవత్సరాలు జీవించేవారు. పరోక్షంగా ఆయన మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత. – నామాడి శ్రీధర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు, అంబాజీపేట
సీపీఎం, సీపీఐ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతిపట్ల సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment