‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు? | Telangana High Court expresses anger at AP and Telangana state govts on Margadarsi Issue | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?

Published Sat, Jan 4 2025 4:14 AM | Last Updated on Sat, Jan 4 2025 10:07 AM

Telangana High Court expresses anger at AP and Telangana state govts on Margadarsi Issue

ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?.. ఇది ఎంత మాత్రం సహించరానిది

ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు

అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు?

ఇప్పటి వరకు 13 సార్లు విచారణ వాయిదా వేశాం

మూడు వారాల్లో కౌంటర్లు వేయాల్సిందే.. ఇదే చివరి అవకాశం.. లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి

ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ

200కిపైగా పేజీలతో మార్గదర్శి, కిరణ్‌ దాఖలు చేసిన రిప్లైపై అదనపు కౌంటర్‌ వేస్తామన్న ఆర్బీఐ

అందుకు అంగీకరిస్తూ మూడు వారాల గడువునిచ్చిన ధర్మాసనం.. రిప్లై కాపీని ఉండవల్లికి ఇవ్వాలని మార్గదర్శికి హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా  

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్‌ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచా­రణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్‌ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.
– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు.  ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్‌ లాంటి అన్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు 
స్వీకరించడం నిషేధం.  
⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది.  
⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది.  
⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది.  

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్‌ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. 

కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. 

అదనపు కౌంటర్‌ దాఖలు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుజోయ్‌ పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం సెక్షన్‌ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్‌ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. 

అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్‌ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. 



ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్‌ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 

మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది లక్ష్మీనారాయణ్‌ రవిచందర్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.  

6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. 
ఆర్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది లక్ష్మీనారాయణన్‌ రవిచందర్‌ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్‌ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పందిస్తూ..  కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది.  

కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? 
విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. 

అదనపు కౌంటర్‌ దాఖలు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌
రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్‌ లాంటి అన్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్‌ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. 

అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్‌బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 2006 నవంబర్‌ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. 

చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్‌బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

అక్రమాలను నిర్ధారించిన రంగాచారి
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్‌) ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్‌ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్‌ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన  మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. 

అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.

అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు
చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) చేశారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇది ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్‌ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది.  

హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు
ఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్‌ కుమార్, అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్‌బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. 

చివరగా గతేడాది ఏప్రిల్‌ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement