Telangana High Court
-
హైకోర్టు ఆదేశాలు.. కేటీఆర్ నల్గొండ టూర్ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రేపటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయ్యింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు అనుమతివ్వలేదు.అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్ట్‌లో వాదనలు నడిచాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో బీఆర్ఎస్ సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్‌ను 27కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో నల్గొండ పర్యటనపై కేటీఆర్ వెనక్కి తగ్గారు. -
‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ప్రభుత్వ వాదనలతో అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. దీంతో.. ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనవరి 8వ తేదీన సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అయితే అంతకు ముందే.. కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో.. ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కేటీఆర్ తరుఫున లాయర్ సుందరం వాదనలు ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అంటూ వాదనలు వినిపించారు.ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తునకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అని అన్నారు.ఇరువైపులా వాదనల అనంతరం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ స్టేజ్‌లో క్వాష్ పిటిషన్‌ను అనుమతించలేమని తెలిపింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని లాయర్ సుందరం కోర్టుకు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదుతమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం. ఏసీబీ FIRలో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అని మోహిత్ రావు పేర్కొన్నారు. -
నిషేధాన్ని కఠినంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. 2017లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని చెప్పింది. అంతేకాదు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఆదేశాలను కూడా అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. చైనా మాంజా వినియోగంపై 2017లో ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులు పాటించేలా పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంజయ్ నారాయణ్ పంజరి హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. సింథటిక్ నైలాన్ దారానికి గ్లాస్ పౌడర్ లేదా మెటల్ వంటి రాపిడి పదార్థాలతో కోటింగ్ వేసి మాంజా తయారు చేస్తున్నారు.. ఇది వన్యప్రాణుల, ప్రజాభద్రతతో పాటు పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఎన్జీటీ నిషేధం విధించినా సంక్రాంతి పండుగ సందర్భంగా విరివిగా మార్కెట్లో విక్రయం చేస్తున్నారని వెల్లడించారు. విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ.. ‘సంక్రాంతిని దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేయడం పండుగలో అంతర్భాగంగా వస్తోంది. కాటన్ దారాలతో గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉండేది. పోటీ పెరగడంతో కాలక్రమేణా సింథటిక్, గాజు పూతతో కూడిన మాంజాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు. స్తంభాలు, చెట్లతోపాటు పలుచోట్ల చిక్కుకున్న మాంజా గాలిలో వేలాడుతూ ఉండటం పక్షులు, మనుషుల మరణాలకు దారితీస్తోంది. మాంజాతో మనుషులు తీవ్రంగా గాయపడిన, చనిపోయిన సంఘటనలున్నాయి. బీఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం చైనీస్ మాంజా వాడితే రూ.5 వేల జరిమానా కూడా విధించవచ్చు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్జీటీ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.మాంజాపై 2017లోనే నిషేధం సాక్షి ఫ్లస్ (ఈ– పేపర్)లో -
ప్రత్యేక ‘షో’లూ వద్దు
సాక్షి, హైదరాబాద్: గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో కూడా వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేయాలనుకోవడం సరికాదని హితవు పలికింది. గేమ్‌ఛేంజర్ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దిల్‌రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక షోలకు, టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్తోపాటు సతీశ్కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరల పెంపు సినిమాటోగ్రఫీ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2021లో జారీ చేసిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పెంచిన టికెట్ ధరలు పూర్తికాలం కొనసాగవని, ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వెళ్లే సరికి ఎంత సమయం అవుతుందని జీపీని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా అని మరోసారి చెప్పారు. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను వాయిదా వేసింది -
హరీష్‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు దర్యాప్తు, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు. గత విచారణ సందర్భంగా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. చక్రధర్ గౌడ్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.ఇదీ చదవండి: Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
ప్రత్యేక షోలకు పర్మిషన్లు ఎందుకు?: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘‘ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్(Benefit Shows), ప్రత్యేక షోలకు అనుమతించొద్దు. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదు’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం రేవంత్? -
బెనిఫిట్ షో అవసరమేముందో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంలో సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రముఖ చిత్రాలకు బెని ఫిట్ షోలకు, ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, వాటి అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి కనీసం అలోచించాల్సిన అవస రం లేదా అని నిలదీసింది. 16 ఏళ్లలోపు పిల్ల లను అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనలకు అను మతించకూడదని సూచించింది. ఇలాంటి అంశాల్లో ఒక్క చిత్రంపై ఇలా పిటిషన్ దాఖలు చేయడం కాకుండా.. ప్రజా ప్రయో జన వ్యాజ్యంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికె ట్‌పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తు న్నట్లు పేర్కొన్నారు. 11 నుంచి 19 వరకూ మల్టీ ప్లెక్సులలో టికెట్‌పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికె ట్‌పై అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచు కోడానికి సర్కార్ అనుమతిచ్చింది. అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు మాత్రం సర్కార్ నిరాకరించింది. ఇదిలా ఉండగా, ఈనెల 8న ఇచ్చిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైద రాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. జనవరి 10న ఉదయం 4.30 గంటల నుంచి సిని మా ప్రదర్శనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పిల్‌గా విచారణ చేయాల్సిన అంశం...: ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. టికెట్ ధరల పెంపు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసే లా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం సినిమా రెగ్యులేషన్స్ రూల్స్ 1970, సినిమాస్ లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపారు. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి తర్వాత.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని డిసెంబర్ 21న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు. కనీసం పక్షం రోజులైనా కాకముందే వేకువజామున 4 గంటలకే షో నిర్వహించుకునేలా అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజలకు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న తీరుగా సర్కార్ వ్యవహారం ఉందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ఈ అంశంపై పిల్ వేస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ న్యాయవాది కోర డంతో విచారణ నేటికి వాయిదా వేశారు. కాగా, తగినంత పార్కింగ్ లేకపోవడం, స్క్రీనింగ్‌ల మధ్య తక్కువ సమయం వంటి ఇబ్బందులపైనా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల తొక్కిసలాటకు దారితీస్తుందని పేర్కొన్నారు.హక్కులు హరించడమే..: హైకోర్టు‘సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి. అర్ధరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదే. ఇది ప్రజల నిద్రపోయే హక్కును హరించడమే అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చిత్రాలకు వెళ్లే వాడి ఆరోగ్యం ఏమవుతుంది?’ ‘పిటిషనర్లు కూడా చిత్రం విడుదలకు ముందు పిటిషన్ వేసి ఇక తర్వాత పట్టించుకోవడం లేదు. వేళాపాళా లేని షోలకు 16 ఏళ్లలోపు చిన్నారులను కూడా రద్దీ ఉండే చిత్రాలకు తీసుకొస్తున్నారు.. సర్కార్ కూడా అనుమతిస్తోంది. ఇది సమంజసం కాదు. ప్రజలు బయటకు వెళ్లడానికి, లోనికి రావడానికి స్క్రీనింగ్‌ల మధ్య సమయం ఉండాలి’ -
ఏసీబీ విచారణకు వెళ్లండి: కేటీఆర్‌కు హైకోర్టు సూచన
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.కేటీఆర్‌తో పాటు రాంచందర్ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్‌తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్‌కు సూచించింది. స్టేట్మెంట్ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి హైకోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ తన లాయర్‌తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు -
న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్
-
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్‌లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్‌టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ గత నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్ 31న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్ 18న ఫిర్యాదు, 19న ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్ 528 మేరకు ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్‌లాల్, నీహారిక ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్ అదీనంలోనే హెచ్ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు. -
తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు
సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్‌జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది. ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ! -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. -
ఫార్ములా-ఈ రేసు కేసు..హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట దక్కేనా?
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు (formula e car race case) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ తనపై ఏసీబీ (acb) నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ (ktr)కు ఊరట లభిస్తుందా అనే అంశంపై బీఆర్ఎస్ (brs) శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాను సైతం వాయిదా వేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ .. డిసెంబర్ 20న ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్‌కు ఊరట కల్పించింది. డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఫార్ములా ఈ- కార్ రేసులో కేసులు నమోదు‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) కేసులు నమోదు చేశాయి. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు.ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
నాపై కేసును కొట్టేయండి..
-
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడతారని ఓ అత్తను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నివాసి 84 ఏళ్ల పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగి.. న్యూజెర్సీలో ఉంటున్న తన అల్లుడిపై కేసు నమోదుకు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న పిటిషనర్ కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడు. గతంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలోకి చొరబడి తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. ‘ఆమె అమెరికాలో అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. భారత పౌరురాలిగా జాతీయ మహిళా కమిషన్‌తో పాటు ఇతర మార్గాల్లో రక్షణ పొందే హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు’ అని బదులిచ్చారు. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.చదవండి: అమెరికాలో భారతీయులకు సరికొత్త ‘అతిథి’ మర్యాదలు -
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
మార్గదర్శి కేసులో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
మార్గదర్శి కేసు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.కాగా, చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,. -
నేరెళ్ల ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదు చేసిన కేసు పురోగతి వివరాలను నెల రోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం ఇచ్చారా? పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? లాంటి వివరాలను అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది. తొలుత విచారణకు హాజరైన ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వివరాలు తెలియకుండా, గడువు కోరడం కోసం ఎందుకు హాజరయ్యారంటూ మందలించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇదీ కేసు నేపథ్యం.. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు, టిప్పర్లు నడిచేవి. ఇసుకను తరలించే క్రమంలో జరిగిన 42 ప్రమాదాల్లో మొత్తం నలుగురు చనిపోయారు. ముఖ్యంగా 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని జూలై 7న అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితులకు పరిహారం ఇచ్చారా? ఈ ఘటనలో దళితులు, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు పిల్లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? చార్జిషీట్ దాఖలు చేశారా? బాధితులకు పరిహారం ఇచ్చారా? అని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహంవ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడం కోసమే హాజరుకావడాన్ని తప్పుబట్టింది. దీంతో వెంటనే ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ విచారణకు హాజరయ్యారు. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు తెలిపారు. విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా పూర్తి వివరాలతో స్థాయీ నివేదిక దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 20కి వాయిదా వేసింది. -
‘గేటెడ్’ నేరాల నిరోధానికి యాప్
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నేరాల నిరోధానికి ఒక యాప్‌ను రూపొందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఇతర నివాసితులకు ఇబ్బందులు కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. హద్దు మీరితే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి ఫేజ్–13లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాస్ క్లబ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని.. దీనిపై ఫిర్యాదు చేసినా యాజమాన్య సంఘం చర్యలు తీసుకోవడంలేదంటూ హరిగోవింద్ ఖురానారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. కమిషనర్లకు అధికారం.. హైదరాబాద్ పోలీస్ చట్టంలోని సెక్షన్ 22 కింద ఊరేగింపుల నియంత్రణ, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటించటం, ఏదైనా వీధి లేదా బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, పాటల నియంత్రణ, హైదరాబాద్ సిటీ లౌడ్ స్పీకర్ నియమాలు–1963, హైదరాబాద్, సికింద్రాబాద్ (పబ్లిక్ ప్లేస్ ఆఫ్ హాల్ట్/పీస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్/ అమ్యూజ్మెంట్) నియమాలు–2005, శబ్ద కాలుష్య (నియంత్రణ) నియమాలు–2000, జీవో 172లోని పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ (ఈఎన్‌వీ) నిబంధనల ప్రకారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అధికారం కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు ఉంది అని హైకోర్టు స్పష్టంచేసింది.తీర్పులో పేర్కొన్నసూచనలు, ఆదేశాలు..1) ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఉప కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు/మహిళలు/రిటైర్డ్ ఉద్యోగులై ఉండాలి. వీరు క్లబ్‌హౌస్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచవచ్చు. 2) అసోసియేషన్ ఓ యాప్ లాంటి ప్లాట్‌ఫామ్/అప్లికేషన్‌ను రూపొందించాలి. దీని ద్వారా సభ్యులు ఫిర్యాదులు/సందేశాలను పంపవచ్చు. దీని నిర్వహణకు ప్రత్యేక టీమ్ ఉండాలి. సబ్–కమిటీ సభ్యులు మాత్రమే యాక్సె స్ కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి. ఫిర్యాదులు/సందేశాలను ఆ సభ్యులకు పంపాలి. సబ్–కమిటీ సభ్యులు ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచాలి. 3) వచి్చన ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకొని కార్యనిర్వాహక కమిటీకి నివేదించాలి. ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 4) గేటెడ్ కమ్యూనిటీ క్లబ్‌హౌస్ వినియోగానికి అసోసియేషన్ నిర్దిష్టంగా చేయవలసినవి, చేయకూడని పనుల జా బితాను రూపొందించాలి. క్లబ్‌హౌస్‌ను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. 5) నగర పోలీసు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి, నేరాల నియంత్రణకు, ఇతర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లకు అవసరమైన సలహాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 6) వేధింపులు, నేరాలు జరిగినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలో తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత పోలీస్ స్టేషన్/టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సూచనలను కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 7) వీలైతే గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలోని నేరాలపై ఫిర్యాదు చేయడానికి, సమాచారం ఇచ్చే వ్యక్తి/ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ (యాప్)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అందించాలి.