
ఐదుగురు ఉగ్రవాదులకు శిక్షను సమర్ధించిన హైకోర్టు
ఎన్‌ఐఏ కోర్టు తీర్పును ధ్రువీకరించిన ఉన్నత న్యాయస్థానం
ఇది అత్యంత క్రూరమైన నేరమని వ్యాఖ్య... పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో భయానక ఘటన
మొత్తం 18 మందిని బలి తీసుకున్న ముష్కరులు
ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి ఉరి శిక్ష విధించిన ఎన్‌ఐఏ కోర్టు
ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో దోషుల అప్పీల్
యావజ్జీవ శిక్షతో లక్ష్యం నెరవేరదన్న ధర్మాసనం
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల అప్పీళ్లు కొట్టివేత
‘‘అమాయక పౌరులపై ఉగ్రదాడులు జరిపి వారి మరణానికి కారణమైనప్పుడు ఉరిశిక్ష విధించాలనే వాదన సరైందే. నగరంలో పేలుళ్లకు పాల్పడటాన్ని సాధారణ నేరంగా పరిగణించరాదు. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా అంతమొందించి భయబ్రాంతులకు గురిచేయడం క్రూరత్వమే. దీన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సి ఉంది. అరుదైన నేరాల్లో ఒకటిగా భావించాలి. విచక్షణా రహితంగా ప్రాణాలను హరించడమే లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్‌లోని చిన్న చిన్న లోపాలతో దోషులు లబ్ధి పొందలేరు.
సాక్షులు తప్పుడు సాక్ష్యం చెప్పారని దోషుల తరఫు న్యాయవా దులు పేర్కొనడంలో అర్థంలేదు. మృతుల్లో పసికందు కూడా ఉంది. వారి కుటుంబీకులకు తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మరణ వాంగ్మూలాలను నమోదు చేయనంత మాత్రాన ఇలాంటి కేసుల్లో నష్టం జరగదు. దోషుల్లో కొందరు తుపాకీ సహా ఇతర ఆయుధాలను వినియోగించడంలో సిద్ధహస్తులు. ఇలాంటి కిరాతక హత్యల విషయంలో ఉపశమనం ఇవ్వడం అర్థరహితం. కనికరం అన్న దానికి తావే లేదు. అంతిమ శిక్ష మరణశిక్షే..’’
– హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఉరి శిక్షే సరైందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2016 డిసెంబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యథాతథంగా సమర్థించింది.
ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలో నిరూపించడంలో అప్పీల్‌దారులు విఫలమయ్యారని పేర్కొంది. అసదుల్లా అక్తర్, జియా ఉర్ రెహ్మాన్, తెహసీన్ అక్తర్, మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీన్ భత్కల్, ఎజాజ్ షేక్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. దోషులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం మంగళవారం 357 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది.
పన్నెండేళ్ల క్రితం..
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిందితుల తరఫున న్యాయవాదులు ఆర్.మహదేవన్, అప్పం చంద్రశేఖర్ వాదనలు వినిపించగా, ఎన్‌ఐఏ తరఫున సీనియర్ న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘ వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం మంగళవారం కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.
దిల్‌సుఖ్‌న గర్ వద్ద పేలుడు దృశ్యం(ఫైల్)
మొత్తం సమాజంపై దుష్ప్రభావం..
‘ఎన్‌ఐఏ కోర్టు వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పీలుదారులకు వివిధ సెక్షన్ల కింద మరణశిక్ష, జీవిత ఖైదు, ఇతర శిక్షలను విధించింది. అప్పీలుదారులు చేసిన వ్యక్తిగత వాదనలు, సాక్షుల వాంగ్మూలాలను కూలంకషంగా పరిశీలించింది. అప్పీలుదారులకు వ్యతిరేకంగా శిక్షలను విధించడానికి బలమైన, సహేతుకమైన కారణాలను నమోదు చేసింది.
శిక్షలను విధించడంలో ట్రయల్ కోర్టు ఎక్కడా ఏకపక్షంగా, అసమంజసంగా వ్యవహరించలేదు. ప్రభుత్వ నివేదికలను పరిశీలించిన తర్వాత.. సీఆర్‌పీసీ సెక్షన్ 366 ప్రకారం 2016, డిసెంబర్ 19న ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్ష సరైనదేనని ఈ ధర్మాసనం భావిస్తోంది. ఇలాంటి కేసుల విచారణలో కునాల్ మజుందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్తాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇది అత్యంత క్రూరమైన నేరం.
ఇది బాధితులపైనే కాదు, మొత్తం సమాజంపై దుష్ప్రభావాలు చూపించింది. ఇలాంటి కేసుల్లో నేరస్తుల మనస్తత్వం, నేరం జరిగిన వెంటనే, ఆ తర్వాత దోషుల ప్రవర్తన, నేరస్తుల గత చరిత్ర, నేర పరిమాణం, బాధితులపై ఆధారపడిన వారిపై దాని పరిణామాలు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే ఇలాంటి కేసుల్లో ఇచ్చే తీర్పు శాంతిని ప్రేమించే పౌరుల మనసుల్లో విశ్వాసాన్ని నింపాలి.
ఇతరులు అలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించే లక్ష్యాన్ని సాధించేలా ఉండాలి. కాబట్టి దోషుల సంస్కరణకు, పునరావాసానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ జీవిత ఖైదు పూర్తిగా వ్యర్థం. ఎందుకంటే ఇలాంటి నేరుస్తుల విషయంలో సంస్కరణ శిక్షతో లక్ష్యం పూర్తిగా నెరవేరదు. కాబట్టి దోషుల అప్పీళ్లను కొట్టివేస్తున్నాం.
వీరికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన మరణశిక్షనుధ్రువీకరిస్తున్నాం. సీఆర్‌పీసీ సెక్షన్ 363లోని సబ్ సెక్షన్(2) నిబంధన మేరకు దోషులకు తీర్పు కాపీని ఉచితంగా అందజేయాలి. నేటి నుంచి 30 రోజుల్లోగా సుప్రీంకోర్టు ముందు అప్పీల్ చేసుకునే హక్కు దోషులకు ఉంటుంది..’ అని ధర్మాసనం పేర్కొంది.
ఏ–1 రియాజ్ భత్కల్
ఈ కేసులో ఎన్‌ఐఏ రియాజ్ భత్కల్‌ను ఏ–1గా చేర్చింది. అసదుల్లా అక్తర్ (ఏ–2), జియా ఉర్ రెహ్మాన్ (పాకిస్తాన్ వాసి, ఏ–3), తెహసీన్ అక్తర్ (ఏ–4), మొహమ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీన్ భత్కల్(ఏ–5), ఎజాజ్ షేక్ (ఏ–6)గా ఉన్నారు. 157 మంది సాక్షులుగా ఉన్నారు.
ఎన్‌ఐఏ కోర్టు 502 డాక్యుమెంట్లు, 201 ఎవిడెన్స్‌లను (సాక్ష్యాధారాలు) పరిశీలించి నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి ఉరి శిక్ష వేసింది. 2016 డిసెంబర్ 24న దోషులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.