
రూ.99 లక్షల నగదు స్వాదీనం
నలుగురి అరెస్టు..మరో నలుగురి పరారీ
సనత్‌నగర్(హైదరాబాద్): రద్దయిన కరెన్సీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.99 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎస్‌ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.టీవోలీ ఎక్స్‌ట్రీమ్ థియేటర్ వద్ద రద్దయిన పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం ఎస్‌ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్‌రెడ్డి, గొల్లమందల రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లతో పాటు కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన వీరు మరికొందరితో కలిసి పాత నోట్ల మారి్పడికి యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.