
నామమాత్రపు వేతనాలతో మున్సిపల్ కార్మికులు సతమతం
దుర్భర జీవితం గడుపుతున్న సిబ్బంది
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్
మరోవైపు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
జవహర్‌నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులు, దుర్బర జీవితాలను గడుపుతున్నారు. పిన్న వయస్సులోనే పారిశుద్ధ్య కార్మికులు జబ్బు బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కష్టపడుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవో 212 ప్రకారం సౌకర్యాలు..
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో 130 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. కాగా గ్రామపంచాయితీ ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తున్న సిబ్బందికి మారుతున్న కాలాన్ని బట్టి రోజూవారి వేతనం పెరగడానికి చాలా ఏళ్లు పట్టింది. పారిశుద్ధ్య సిబ్బందికి కనీసవేతనాలు చెల్లించాలని జీవో నెం.212 ప్రకారం ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పించాలని అనేక ఏళ్లుగా కార్మిక నాయకులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008 డిసెంబర్ నెలలో కాంట్రాక్ట్ కార్మికులకు పాత జీవోను చట్టం చేస్తూ.. కొత్త జీవో ప్రకారం నెలవారీ జీతంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించారు. బ్యాంకుల ద్వారా జీతాలు ఇవ్వాలని, అది నేటికి అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జీవో 65 అమలు..
గత ప్రభుత్వం జీవో 14 ప్రకారం అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం జీవో 65ను అమలు చేస్తోంది. జీవోనెం 60 ప్రకారం వేతనాలు పెంచి, గతంలో కార్మికులకు పెంచిన జీతాలను తగ్గించకుండా వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అనారోగ్య సమస్యలు..
పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారి కుటుంబాల్లో రోజూ ఎవరో ఒకరూ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్యాసకోస వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌కు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కార్మికుల జీవితాలకు సరైన భద్రత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.
సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు..
జవహర్‌నగర్ పట్టణంలో పనిచేస్తున్న 130 మంది కారి్మకుల్లో సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు ఉన్నవారే. అందరికీ నిర్దిష్ట పని గంటలు ఉన్నా.. వీరికి వర్తించవు. ఇంతచేసినా.. వీరికి ఇచ్చే వేతనం నామమాత్రమే. కాలానికి అనుగుణంగా కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పట్టణ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగ భద్రత కరువు ..
కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఐదేళ్లపాటు పనిచేసిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే నిబంధన ఉంది. అయితే స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వకపోవడం వల్ల ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రోజూ అడుగుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారు లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కారి్మకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవిత బీమాను వెంటనే అమలు చేయాలి. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని అనుకున్నాం. కానీ నేటికి ప్రభుత్వం అమలు చేయడంలేదు. ప్రతీ కారి్మకుడికి రూ.26 వేల కనీసం వేతనం చెల్లించాలి.
– రాములు, ఎలక్ట్రిషన్, జవహర్‌నగర్
హెల్త్‌కార్డులు ఇవ్వాలి..
నిత్యం పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ రోగాలబారిన పడుతున్నాం. కనీస వేతనం లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకులకు హెల్త్‌కార్డులు ఇచ్చి, ఉచిత వైద్యం అందించాలి.- వెంకటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటమే..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెలబెట్టుకుని కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. కార్పొరేషన్‌లో కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి పర్మనెంట్ చేయాలి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలను ఆపేదిలేదు.
– శివబాబు, రాష్ట్ర మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి