ఫైన్ ఆర్ట్స్‌పై యువతకు పెరుగుతున్న ఆసక్తి
ప్రతిభకు పదును పెట్టేందుకు పలురకాల కోర్సులు
శిల్పకళ, పెయింటింగ్ తదితర రంగాల్లో రాణిస్తూ
వ్యర్థాల నుంచి అబ్బురపరిచే ఆకృతుల తయారు
వినూత్న పెయింటింగ్ వైపు ఔత్సాహికుల అడుగులు
ఫొటోగ్రఫీలో టాలెంట్ చూపిస్తున్న మరికొందరు
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చదివితే ఉపాధి ఉంటుందో లేదోనన్న అనుమానాలు గతంలో చాలామందికి ఉండేవి. అయితే హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏటా ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు చూస్తుంటే ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, బయటకు వస్తే మంచి గుర్తింపు, గౌరవంతో పాటు ఉపాధి కూడా ఉంటుందని అనేక మంది విద్యార్థులు నిరూపిస్తున్నారు.
కల్చరల్ ఎంట్రప్రెన్యూర్షిప్‌లో భాగంగా ఫైన్ ఆర్ట్స్ చేసిన విద్యార్థులు కలిసి చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారికి పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పైగా, చాలా పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే చదువుతో పాటు పిల్లలకు ఫైన్ ఆర్ట్స్ నేరి్పంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైన్ ఆర్ట్స్ చేసిన వారిని టీచర్లుగా నియమించుకుంటున్నారు. దీంతో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మానసిక ఎదుగుదల కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మారిన నగరవాసి అభిరుచి..
మారుతున్న కాలానికి అనుగుణంగా సగటు నగరవాసి అభిరుచి కూడా మారుతోంది. దీంతో ఇంటి ఆవరణతో పాటు ఇంట్లో ప్రతి మూలనూ వినూత్నంగా, ఆహ్లాదకరంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అందుకోసం అందమైన పెయింటింగ్స్, మంచి ఫొటోలతో పాటు చిన్నపాటి శిల్పాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ వ్యాపారం నగరంలో అభివృద్ధి చెందుతోంది. కళలకు కాస్త టెక్నాలజీని జోడించి ముందుకు వెళ్తే ఈ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని పేర్కొంటున్నారు.
కూడళ్ల వద్ద ఆకర్షణగా..
భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లోని కూడళ్ల వద్ద ఆకర్షణీయంగా ఉండేలా శిల్పాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నగరంలోని అనేక కూడళ్ల వద్ద ఆలోచింపజేసేలా శిల్పాలను రూపొందించారు. కేవలం శిలలతోనే కాకుండా వివిధ రకాల వ్యర్థాలతో వాటిని రూపొందించి పర్యావరణహితాన్ని సమాజానికి చాటుతున్నారు. జేఎన్‌ఏఎఫ్‌టీయూకు చెందిన పలువురు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శిల్పకారుడు బుద్ధి సంతో‹Ù, స్ట్రీట్ ఆర్టిస్ట్ కిరీట్ రాజ్, స్ట్రీట్ ఆరి్టస్ట్ రెహమాన్, మురళి, మహేశ్ తదితరులు కలిసి నగరానికి కొత్త సొబగులు దిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన నగర సుందరీకరణ కార్యక్రమాల్లో వీరు అనేకసార్లు భాగస్వాములయ్యారు.
ప్రయోగాలు చేయడం ఇష్టం..
చిన్నప్పుడు డ్రాయింగ్స్, స్కెచ్‌లు వేస్తుండేవాడిని. ఇంటర్ తర్వాత జేఎన్‌ఏఎఫ్‌టీయూలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక స్కల్ప్చరింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. కొత్తకొత్త మెటీరియల్స్‌తో శిల్పాలు చేయాలని కోరికగా ఉండేది. అందుకే రాళ్లతో పాటు ఈ–వేస్ట్, జాలీలు, పేపర్ గుజ్జు, రాళ్లు, నట్స్, బోల్ట్స్ వంటి వాటితో అనేక శిల్పాలను రూపొందించేవాడిని. లక్డీకాపూల్‌లోని నిరంకారి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తక శిల్పం, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పం, వరంగల్‌లోని ములుగురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన గుర్రం శిల్పం, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పాలపిట్ట విగ్రహం నేను తయారు చేసినవే. చాలా మంది తమ ఇళ్లల్లో పెట్టుకునేందుకు అడిగి మరీ.. వారికి కావాల్సిన విధంగా తయారు చేయించుకుంటారు.
– బుద్ధి సంతోష్ కుమార్, శిల్పకారుడు
నాన్నే నాకు స్ఫూర్తి..
మా నాన్న లారీ బాడీలు తయారు చేస్తుంటారు. ఆ ట్రక్కులపై పెయింటర్స్ వేసే పెయింటింగ్స్ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచి వాటిని గీసేందుకు ప్రయత్నించేవాడిని ఆ క్రమంలోనే పెయింటింగ్స్‌పై ఆసక్తి పెరిగింది. అయితే నా స్కిల్స్‌ను మరింత పెంచుకునేందుకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోచేరాను. ఆయిల్, ఆక్రెలిక్, వాటర్ కలర్స్, భిన్నమైన పెన్సిల్స్‌తో స్కెచ్‌లు వేయడం నేర్చుకున్నాను. పెయింటింగ్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నా లక్ష్యం.
– అబ్దుల్ రెహమాన్, స్ట్రీట్ ఆర్టిస్ట్
ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నా..
చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉండేది. మా అన్నయ్య ఫణితేజ బొమ్మలను చూసి నేర్చకునేవాడిని. అదే ఇష్టంతో పెయింటింగ్‌లో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ పూర్తి చేశాను. ఈ కోర్సుల ద్వారా ఆర్ట్‌లో నైపుణ్యం నేర్చుకున్నాను. ఆర్ట్ హిస్టరీలో పట్టు సాధించాను. ఆర్ట్ షోలు, గ్యాలరీల్లో పనిచేశాను. ఫైన్ ఆర్ట్స్‌లో వచి్చన అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను.
– కిరీటి రాజ్ మూసి, ఆర్టిస్ట్.
Comments
Please login to add a commentAdd a comment