
ఇతర మెట్రో నగరాలకన్నా వృద్ధి వేగవంతం
చారిత్రక విశేషాలు, ఆధునిక ఆకర్షణల మేలు కలయిక
కోవిడ్ తర్వాత పుంజుకుని దౌడ్ తీస్తున్న పర్యాటకం
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ తదితర ల్యాండ్ మార్కుల ద్వారా అందివచి్చన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయంగా ప్రపంచ వేడుకలకు చిరునామాగా మారిన ఆధునిక తత్వం వెరసి ప్రపంచ పర్యాటకులకు నగరాన్ని గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా భారీ సినిమాల తయారీ కేంద్రంగా కళలు, ప్రసిద్ధ వంటకాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన పర్యాటక పాలసీ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్యాటకాభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో నగర పర్యాటక రంగ వృద్ధి విశేషాలపై ఓ విశ్లేషణ.
నగర పర్యాటక అభివృద్ధిలో బిజినెస్ టూరిజమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడుల రాకతో ప్రపంచ స్థాయి వాణిజ్య సదస్సులు, సమావేశాలకు వేదికగా, వ్యాపార పర్యాటకానికి నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చాయి. అదే విధంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్య వసతులు, కార్పొరేట్ ఆస్పత్రులు విదేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉన్న వైద్య సేవల వ్యయం నగరాన్ని ఆరోగ్య పర్యాటకానికి రాజధానిగా మారుస్తున్నాయి.
మెట్రో టు.. ఎయిర్ ట్రా‘వెల్’..
నగర పర్యాటక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 72 దేశీయ, 18 అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. గత 2023–24లో నగరం నుంచి సుమారు 20లక్షల మంది అమెరికా, యుకేలకు ప్రయాణించారు. ఇందులో గణనీయమైన భాగం విద్యార్థులు, నిపుణులు ఉన్నారు. ప్రయాణికుల సంఖ్య 2021లో 8 లక్షల నుంచి 2022లో 12.4 లక్షలకు, 2023లో దాదాపు 21 లక్షలకు, 2024లో దాదాపు 25 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 45.6% సమీకృత వార్షిక వృద్ధి రేటుగా సూచిస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024 వరకూ చూస్తే.. దేశంలోని టాప్ 5 మెట్రో నగరాల్లో ప్రయాణికుల రద్దీ పరంగా సిటీ అత్యధిక వృద్ధి సాధించింది. నగరం 11.7% పెరుగుదలను సాధించగా బెంగళూరు (10.1%) ముంబై (4%), కోల్‌కతా 9.7%, చెన్నై 3.3 శాతంతో వెనుకబడ్డాయి.
ఫుల్.. హోటల్స్..
ప్రస్తుతం, రాష్ట్రంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ పరంగా చూస్తే.. 7,500 గదులు అందుబాటులో ఉన్నాయని అంచనా. వీటిలో మన హైదరాబాద్ నగరంలోనే 5,000 వరకూ ఉన్నాయి. రాజధాని నగరంలో అడుగుపెట్టిన వారి సంఖ్య ఏడాదిలో 16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌లోని హోటళ్లు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి చెబుతున్నారు.
దేశీయ పర్యాటకులు 2021–22లో 3.2 లక్షల మంది, 2022–23లో 6.07 లక్షల మంది తెలంగాణను సందర్శించారని, 89.84 శాతం పెరుగుదల నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో విదేశీ పర్యాటకులు 5,917 నుంచి 68,401 (10–56.01 శాతం)కి పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధిలో సింహభాగం నగరానికే దక్కుతుందనేది తెలిసిందే.
రానున్నాయ్ ఆకర్షణలెన్నో..
ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను నెలకొల్పే ముందు వరకూ కూడా భారీ స్థాయి సమావేశాలకు నగరంలోని హెచ్‌ఐసీసీ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది. అయితే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో 10,000 సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఎమ్‌ఐసీఎఫ్ సెగ్మెంట్‌లో నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో ఉంచుతుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. దుబాయ్ తరహా షాపింగ్ మాల్స్ సహా ఇంకా మరెన్నో ఆకర్షణలు నగర పర్యాటకానికి మరింత ఊపు తేనున్నాయి.
నగరం వెలుపల కూడా..
నగరంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, లాడ్ బజార్ వంటివి హిస్టారికల్ టూరిజం వృద్ధికి దోహదం చేసే విశేషాలుగా నిలుస్తున్నాయి. ఇక నగరానికి కాస్త దూరంలోనే ఉన్న యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం.. వంటి చోట్ల స్పిరిట్యువల్ టూరిజం వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి. అలాగే పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట్ వంటివి సంప్రదాయ హస్తకళల పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment