ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే జూ పార్కులు, ప్రదర్శనశాలలు, ప్రధాన పార్కు లను రాష్ట్ర ప్రభుత్వం మూసేయగా, తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్‌ఐ) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసేసింది. మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి రద్దు చేసింది. ఇదే విభాగం అధీనంలో ఉన్న వేయిస్తంభాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు మాత్రం స్వల్ప సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇవి దేవాలయాలు కావడంతో వాటిని మూసే పరిస్థితి లేదు. అయితే ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా, క్యూలైన్లలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
రామనవమి ఉత్సవాలపై నియంత్రణ
రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాలయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజులు కావటంతో దేవాలయాలకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీంతోపాటు ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ వైరస్ వ్యాపించే విధానం, దాన్ని నియంత్రిం చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 2న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు దృష్టి సారించారు. భద్రాచలంలో ప్రభుత్వ వేడుకగా జరిగే సీతారామ కల్యాణాన్ని పూర్తిగా ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు.
అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు ఆలయానికి రాకుండా కట్టడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ టికెట్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆ టికెట్లు కొన్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లోనూ అర్చకులు దేవేరుల కల్యాణం నిర్వహించటానికే పరిమితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు దేవాలయ నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున, భక్తులే స్వచ్ఛందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని పేర్కొంటున్నారు.
ఉగాది వేడుకలకూ దూరం!
ఉగాది వేడుకలనూ ఆర్భాటాలకు దూరంగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రగతిభవన్‌లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. టీవీల్లో లైవ్ ద్వారా ప్రజలు చూడాలనే సూచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
బోసిపోయిన భద్రాద్రి రామాలయం పరిసరాలు
Comments
Please login to add a commentAdd a comment