
నగరంలో అమెరికన్ ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ
ప్రత్యేకంగా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు
ఇప్పటికే 4 నేషనల్స్ గెలిచాం : ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్ మణికంఠ
రెండేళ్లలో నగర వేదికగా అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ప్రణాళికలు
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్‌బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది.
అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్‌ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్‌బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్‌లో భాగంగా చేరింది.
రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..
ఈ క్రీడను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్‌ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్‌లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్‌ఎఫ్‌ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం.
– చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.
అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌లో కాంటాక్ట్, నాన్‌కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం.
– జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment